Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
ఆట, పాట గెలిచాయి
Published on Sun, 11/16/2025 - 05:44
చాంపియన్ స్పోర్ట్ షూటర్ శ్రేయసి సింగ్, స్టార్ సింగర్ మైథిలీ ఠాకూర్‌లు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో.... ‘ఆడినంత సులువు కాదు’ ‘పాడినంత సులువు కాదు’ అన్నారు విమర్శకులు. అయితే ఈ ఇద్దరూ ఆడినంత తేలిగ్గానే, పాడినంత సులువుగానే బిహార్ తాజా ఎన్నికలలో విజయం సాధించారు. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువ మహిళా నాయకుల గురించి...
ఈసారి కూడా గురి తప్పలేదు!
బిహార్ లోని జముయి నియోజక వర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలిచిన శ్రేయసి సింగ్ ఒకప్పుడు చాంపియన్ స్పోర్ట్ షూటర్. శాసనసభ్యురాలిగా ఇది ఆమె రెండో విజయం. బిహార్ జముయి జిల్లాలోని గిదౌర్‌కు చెందిన శ్రేయసి సింగ్‌కు ఘనమైన క్రీడా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తాత సెరేందర్‌సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ ‘నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి పుతుల్ కుమారి మాజీ ఎంపీ.
దిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో చదువుకున్న శ్రేయసి ఫరిదాబాద్‌లోని మానవ్ రచనా ఇంటర్నేషల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి షూటింగ్ చూస్తూ పెరగడం వల్ల సహజంగానే ఆ క్రీడపై ఆమెకు ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి నైపుణ్యం తోడు కావడంతో షూటింగ్‌లో గురి తప్పకుండా దూసుకుపోయింది. 61వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శ్రేయసి సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరి 2020 బిహార్ శాసన సభ ఎన్నికల్లో జముయి నియోజక వర్గం నుంచి గెలిచింది. యువత, మహిళ ఓటర్లను ఆకర్షించగల చరిష్మా, కుటుంబ రాజకీయ నేపథ్యం వల్ల బీజేపీ శ్రేయసీకి సీటు ఇచ్చింది. పురుషాధిపత్యం కనిపించే బిహార్ రాజకీయ రణక్షేత్రంలో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే క్షేత్రస్థాయి నుంచి బిహార్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న శ్రేయసి ఎప్పుడూ తడబడలేదు. వెనకబడిన రాష్ట్రమైన బిహార్‌లో మహిళల రాజకీయ భాగస్వామ్యానికి శ్రేయసి సింగ్ రోల్‌మోడల్‌గా మారింది. స్త్రీ విద్య, ఉపాధి కోసం రాజకీయ వేదికగా క్రియాశీలంగా పనిచేస్తోంది.
చారిత్రక విజయ గీతం
‘సంగీతంలో పుట్టింది. సంగీతంతో పెరి గింది’ అనే మాట మైథిలి ఠాకూర్‌కు సరిపోతుంది. బాల్యం నుంచి ఆమెకు శాస్త్రీయ, జానపద సంగీతంతో అనుబంధం ఉంది. ‘లిటిల్ చాంప్స్’ ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ లాంటి రియాలిటీ షోల ద్వారా చిన్న వయసులోనే సెలబ్రిటీగా మారింది. ‘జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్’ పోటీలో విజేతగా నిలిచింది. తొలి ఆల్బమ్ ‘యా రబ్బా’తో సంగీత అభిమానుల ప్రశంసలు అందుకుంది. మరుసటి సంవత్సరం ‘రైజింగ్ స్టార్’లో రన్నరప్‌గా నిలిచింది.
ఆలీనగర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా ఆర్జేడీ అభ్యర్థిపై విజయం సాధించిన మైథిలీ ఠాకూర్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీటును గెల్చుకోవడం బీజేపికి ఇది మొదటిసారి. దీనిని చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. బిహార్ అసెంబ్లీకి ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలిగా సంచలనం సృష్టించి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తోంది 25 సంవత్సరాల మైథిలీ ఠాకూర్. ఎన్నికల ప్రచార యాత్రలలో జానపద, భక్తిగీతాలు ఆలపిస్తూ జనాలను ఆకట్టుకుంది.
ఇతరుల కంటే భిన్నంగా సామాజిక సంస్కరణకు, సాంస్కృతిక పునర్జీవనాన్ని మిళితం చేసి తనదైన ఎజెండాను రూపొందించింది ఠాకూర్. మిథిల చిత్రకళను పాఠశాలల్లో పాఠ్యేతర అంశం (ఎక్స్‌ట్రా–కరికులర్ కంపోనెంట్)గా ప్రవేశపెడతామని, బాలికల కోసం బలమైన విద్యాకార్యక్రమాలు, స్థానిక యువత కోసం ఉపాధి–కేంద్రీకృత కార్యక్రమాలు, మిథిల చిత్రకళ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించింది మైథిలీ ఠాకూర్.
Tags : 1