ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు
Breaking News
మౌనమేలనోయి.. యువతను వెంటాడుతున్న షైనెస్
Published on Fri, 09/19/2025 - 11:50
కొన్ని సందర్భాల్లో సైలెన్స్ ఎంత ప్రశాంతతనిస్తుందో.. మరికొన్ని సందర్భాల్లో సైలెన్స్..అంత వైలెంట్‌గా ఉంటుంది.. ఈ విషయం మనలో చాలా మంది గ్రహించే ఉంటాయి. కానీ ప్రస్తుత తరంలోని కొందరు యువత ఇదే సూత్రంగా పాటిస్తున్నారు. కంఠానికి కళ్లెం వేస్తున్నారు. ఎప్పుడూ మౌనంగా కూర్చుంటూ.. ఫోన్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితికి వెళ్లి పోతున్నారు. ఏది చెప్పాలన్నా సైగలతోనూ.. మెసేజ్‌లు, చాటింగ్ రూపంలోనో తప్ప ఎదురుపడి మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గట్టిగా మాట్లాడితే షైనెస్ ఫీల్ అవుతున్నారు.. ఫోన్ అడిక్షన్ కారణంగా బయటి వారితోనే కాదు.. ఏకంగా ఇంట్లో వారితోనూ మాట్లాడలేని స్థితికి చేరుకుంటున్నారు పలువురు నగరవాసులు. దీంతో గత్యంతరం లేక మానసిక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి తప్పడం లేదని వాపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఫోన్ అడిక్షన్‌తో భావప్రకటనకు బ్రేక్ నైపుణ్యాన్ని కోల్పోతున్న నగర యువత
ప్రతిదానికీ బిడియపడుతున్న పరిస్థితులు
వాట్సాప్ మెసేజ్‌లు, చాటింగ్‌తోనే భావప్రకటన
కుటుంబ సభ్యులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి
మానసిక వైద్యులను సంప్రదిస్తున్న పలువురు
వాక్చాతుర్యం ఒక అద్భుతమైన కళ.. మనసులోని భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించేది ‘మాట’ ఒక్కటే. పిల్లలు గలగలా మాట్లాడేస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది. మరికంత మంది తమ వాగ్ధాటితో కట్టిపడేస్తూంటారు. కానీ ఇటీవల కాలంలో మాటలు మౌనం దాల్చుతున్నాయి. మొబైల్‌ఫోన్ మాయాజాలంలో యువత కొట్టుకుపోతోంది. సూటిగా, స్పష్టంగా మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. నగరంలో ఈ తరహా ‘షైనెస్’ తీవ్ర సమస్యగా మారుతోందని పలువురు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది. డిగ్రీలు, పీజీలు వంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వాళ్లు కూడా తమ భావాలను స్పష్టంగా వెల్లడించలేకపోతున్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను తెలియజేసేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం.
ఏది కావాలన్నా వాట్సాప్‌లోనే..
‘ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచి్చనా పలుకరించదు. తన లోకం తనదే.. అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు ఏది కావాలన్నా.. తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వారం రోజుల క్రితం హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురుతో కలిసి మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించారు.
అడిక్షన్‌తో మానసిక సమస్యలు..
ఇంటికి వచ్చిన అతిథులను కనీసం బాగున్నారా.. అని కూడా పలకరించలేని పరిస్థితి. నిజానికి ఇది కేవలం ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు.. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల పరిస్థితి ఇదే.. ఈ తరహా షైనెస్‌తో బాధపడుతున్నవారు నగరవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇరవై నాలుగు గంటలూ మొబైల్ ఫోన్‌లకు అతుక్కొనిపోవడం వల్ల..బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. రోజు రోజుకు ఇలాంటి మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఈ ‘షైనస్’ (బిడియం) ఇటీవల కాలంలో ఒక సవాల్‌గా మారిందని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు చదువుల్లో ఉన్నత ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటనా నైపుణ్యంపై మాత్రం పట్టు కోల్పోతున్నారని చెబుతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
పరిష్కార మార్గాలు..
అలాంటి వారితో నిత్యం ఏదో ఒక విషయంపై ఇంట్లో వారు నిరంతరం సంభాషించాలి.ఇరువై నాలుగు గంటలూ ఫోన్‌కు అతుక్కుపోయి మాట్లాడలేకపోతున్న పిల్లలను గుర్తించడంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావాలి.
అలాంటి పిల్లలను నెమ్మదిగా మాటల్లోకి దింపి సంభాషణలను పొడిగించాలి. ఇది ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించాలి.
ఆ పిల్లల వాక్చాతుర్యాన్ని, భావప్రకటన నైపుణ్యాన్ని ప్రశంసించాలి. ప్రసంగాలను ప్రోత్సహించాలి.
క్రమంగా మొబైల్ అడిక్షన్‌ను తగ్గించాలి అంటున్నారు మానసిక నిపుణులు.
భావప్రకటనను కోల్పోతూ..
‘ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో, ఇతరత్రా సమాజిక మాధ్యమాల్లో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్టు చేస్తారు. కానీ ఆయా వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా విషెస్ కూడా చెప్పలేకపోతున్నారు.’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. యువతలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్‌పై ఆధారపడడం, ఏదైనా సందేహం వచి్చన పెద్దలను అడగకుండా గూగుల్ లేదా ఇతర యాప్స్‌లో సెర్చ్ కొట్టడం తద్వారా వారికి కావాల్సిన సమాచారం తెలుసుకోవడం కూడా ఓ కారణమే. తద్వారా తమలోని భావప్రకటనా నైపుణ్యాన్ని కోల్పోతున్నారని తెలుస్తోంది. నిత్యం ఒంటరిగా ఫోన్‌తో కాలం గడపడం ద్వారా ఎవరితోనూ పరిచయాలు లేక.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఏదైనా మాట్లాడితే ఏమంటారోననే భయంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పదేళ్ల నుంచి పాతికేళ్ల వరకూ..
సాధారణంగా పిల్లల మాటలతోనే ఇళ్లల్లో సందడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పదేళ్ల పిల్లల నుంచి పాతికేళ్ల యువత వరకూ ప్రతి ఒక్కరికీ మొబైల్‌ఫోన్ ఒక్కటే ప్రపంచంగా మారింది. దీంతో ఇంట్లో, బయట ఆ మొబైల్‌లోనే మునిగిపోతున్నారు. చివరికి రోడ్డుపై నడిచినా, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణం చేసినా సరే మొబైలే కాలక్షేపం.. దీని కారణంగా ఇతరులతో మాట్లాడే లక్షణాన్ని కోల్పోతున్నారు.. మరీ ముఖ్యంగా తమలోని భావాలను చెప్పేందుకు, పంచుకునేందుకు తీవ్రమైన షైనెస్‌కు గురవుతున్నారు.‘ఇలాంటి పిల్లలు ఎదుటి వ్యక్తి ముఖంలోకి సూటిగా చూసి స్పష్టంగా మాట్లాడలేరు. ఈ షైనెస్ లక్షణం కారణంగా.. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సాప్‌లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారుతోంది.’ అని డాక్టర్ సంహిత చెబుతున్నారు.
చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
Tags : 1