తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు
Breaking News
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
Published on Tue, 07/01/2025 - 05:00
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...
మదర్ హుడ్
అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు.
చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!
మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం.
ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి.
ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియో
ఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్‌లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం.
నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.
డాక్టర్ యానీ
క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్,
కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్
Tags : 1