Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు
Breaking News
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంత ప్రమాదకరమైనదా..? పాపం ఆ వ్యక్తి..
Published on Thu, 05/22/2025 - 17:49
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదంతాలు ఎన్నో జరిగాయి. అందులోనూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్.. ఏదైనా తేడాకొడితే..నేరుగా మన బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకుళంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అతడి జీవితాన్ని ఎంతలా నరకప్రాయంగా చేసిందో వింటే..నోటమాట రాదు. ఇంత ప్రమాదరకరమైనదా.. ?హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనిపిస్తుంది.
49 ఏళ్ల సనీల్ తన లుక్ అందంగా మార్చుకోవాలనుకుని కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని ఇన్‌సైట్ డెర్మా క్లినిక్‌ని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి గురించి పూర్తిగా తెలుసుకునే యత్నం చేయకుండానే కేవలం ప్రకటనల ఆధారంగా సంప్రదించాడు. అయితే అక్కడ వైద్యులు అతడిని పరిశీలించి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలా అతడికి సదరు ఆస్పత్రి వైద్యులు చేద్దాం అనుకున్నా..నాలుగుసార్లు అనుకోని అవాంతరాలతో వాయిదా పడింది.
అప్పుడైనా ఇలా ఎందుకు జరగుతుందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరి 2025లో ఒకరోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సమయాత్తమయ్యాడు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయినా తర్వాత నుంచి ఇన్ఫెక్షన్‌ల బారినపడ్డాడు. మార్చి 1 నాటికి, అతడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగుమచ్చలు, ఒక విధమైన స్రావాలు కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ సాధారణ సమస్యలే అని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపారు సనీల్‌కి.
దీంతో ఆస్పత్రికి వచ్చినా..పరిస్థితి మెరుగుపడలేదు కదా..మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దాంతో సనీల్ శరీరంలో బీపీ, చక్కెరస్థాయిలు ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నరకయాతన భరించలేక అక్కడే సమీపంలో ఉన్న సనీల్ లౌర్డ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాక్ వద్దకు పంపారు.
అక్కడ ఆయన సనీల్ పరిస్థితిని చూసి..మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు నిర్థారించారు. తక్షణమే సనీల్‌ని సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటివరకు పదమూడు సర్జరీలకు పైగా చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్‌ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అత్యవసర శస్త్ర చికిత్స వంటి వాటితో పోరాడటమే ఏకైక మార్గం.
ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తుందట. తన తలలో ఒక రంధ్ర ఏర్పడిందని..ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని అన్నారు. అంతేగాదు ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా..ఒక విధమైన స్రావాలు కారడంతో వాక్యూమ్-అసిస్టెడ్ డ్రైనేజ్ పంప్‌ను అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. దాన్ని కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్‌పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. అలాగే అందుకు బాధ్యులైన సదరు వైద్యులకు శిక్ష పడేదాక వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్. అతడిగాథ వింటే..అందానికి సంబంధించిన శస్త్రచికిత్సల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో చెప్పడమే గాక మనోగత అందానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయం చెప్పకనే చెబుతోంది.
(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..)
Tags : 1