73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
హైరేంజ్‌లో హైదరాబాద్
Published on Thu, 05/22/2025 - 11:36
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్‌ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని..
– సాక్షి, సిటీబ్యూరో
దేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..
నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్‌గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.
హైదరాబాద్‌కి ఈ ఊపు ఎందుకు..?
‘హైదరాబాద్‌లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్‌టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.
ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు.
ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి
ఆఫీస్ స్పేస్‌కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్
2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్‌ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్‌కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది.
Tags : 1