ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు.. ఆ హిట్‌ సినిమాకే ఎక్కువ క్రేజ్‌

Published Tue, Mar 5 2024 7:47 AM

Tamilnadu Government 2015 Film Awards Announced - Sakshi

రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం  ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి,  సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్‌' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్‌' ఎంపిక  అయింది.  దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వ‌య‌దిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి.

తని ఒరువన్‌ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్‌ చరణ్‌ రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్‌ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వ‌య‌దిలిలే అనే సినిమా కూడా తెలుగులో  '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే.

ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్‌  'గురు' పేరుతో రీమేక్‌ చేశారు. 36 వ‌య‌దిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది.

ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో  నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు.  తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది.

అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్‌ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

Advertisement
 
Advertisement