చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన? | Sakshi
Sakshi News home page

చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన?

Published Fri, Mar 15 2024 6:02 PM

Social media satires Buzz on janasena netha Pawan Kalyan - Sakshi

ఆయన నిన్న రాత్రి డిన్నర్ చేసి  పడుకొనే సమయానికి  ఒక పార్టీలో ఉన్నాడు.
పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని...   మరో పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యాడు . 
టిఫిన్ చేస్తుంటే  .. పాత పార్టీ వారు వచ్చి నచ్చ  చెప్పారు . 
సాయంకాలం టీ తాగే సమయానికి  తిరిగీ పార్టీ మారే ప్రయత్నం చేసారు . 
రేపు లేచి స్నానం  చేసి  ,  ఏ పార్టీ లో చేరుతారో తెలియదు . 

 

అయన రేపు చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీలోనే కొనసాగవచ్చని ..  వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం పార్టీ మారడం ఖాయం అని ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు పేను స్వామి విశ్లేషించారు.

గవ్వల శాస్త్రం ప్రకారం అయన పాత పార్టీ లో కొనసాగే అవకాశం ఉందని యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంట్వ్యూ లో గవ్వల గన్నా రావు గారు సెలవిచ్చారు .

చిలుక జ్యోతిష్యం ప్రకారం ఆయన కొత్త పార్టీ లోకి పోతాడు అని ఒక  యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియోకు  ఒక్క రోజులో వెయ్యి   కోట్ల వ్యూస్ వచ్చాయి .

ఒక రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ బోగస్ అని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ ను డబ్బులిచ్చి కొనుక్కొంటారని..... గిట్టని.. గిట్టుబాటు లేని కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సణుక్కొంటున్నారు. 

అయన ఏ పార్టీలో ఉంటాడు అనే దాని పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా వున్న ప్రముఖ బెట్టింగ్ సంస్థ వారు ఆయన కొత్త పార్టీ లో చేరే అవకాశముందని చెప్పారు. 

ఇదిలా ఉండగా ఆయన పాత పార్టీ లోనే కొనసాగాలని కోరుతూ...  ఆ పార్టీ కి చెందిన నలుగురు  కార్యకర్తలు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య ప్రయత్నం  చేసారు . వారు ఒంటికి  నిప్పంటించుకొంటారేమో కెమెరా లు ఆన్ చేసి ఆశగా   ఎదురు చూసిన ముప్పై అయిదు యూట్యూబ్ చానెల్స్ వారికి నిరాశ ఎదురయ్యింది . 

కాల్ షీట్స్ అయిపోవడంతో మరో షూటింగ్ కోసం ఆ కార్యకర్తలు బండెక్కి వెళ్లిపోయారు. షూటింగ్ పూర్తి కాకుండానే వారి వెళ్లిపోవడం అన్యాయమని ఇలా అయితే తాము జూనియర్ ఆర్టిస్ట్ల కోసం మరో కంపెనీని చూసుకొంటామని ఆ పార్టీ కీలకనాయకుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది .

ఆయన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ ఆ నాయకులు నగర బంద్‌కు పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు లాంటి వాటి జోలికి తాము పోమని విద్యా సంస్థలు తెరిస్తే మాత్రం ఫర్నిచర్ ధ్వసం చేస్తామని వారు హెచ్చరించారు .

ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో ఆయన కొత్త పార్టీలో చేరడం ఖాయం అని అరవై శాతం ప్రజలు తెలిపారు. ఆయన పాత పార్టీలోనే కొనసాగాలని కోరుతూ సర్వ  మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు .

ఆయన పార్టీ మారుతారు లేదా అనే విషయంపై ఇప్పుడు ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఊపిరి ఆడక ఇప్పటికే యాభై మంది గుండెపోటుకు , ఇరవై మంది మెదడు పోటుకు గురయ్యారు .

మీ పిల్లాపాపల ఆలనా పాలన గాలికి వదిలి .. మీ శ్రీమతి గారిని టీవీ సీరియళ్లకు వదిలేసి .. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్రతి క్షణం మారుతున్న పరిస్థితిని మీకు అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా అందిస్తూనే ఉంటాము. 

గమనిక: ఇవన్నీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న కమెంట్లు. వీటిని చదువుతోంటే.... గత ఎ‍న్నికల్లో  డిపాజిట్‌ కూడా రాకుండా చతికిలపడిన నేత, కేకలు, కూకలు తప్ప, ప్రసంగాల్లో  మేటర్‌ లేని , వేల బుక్స్‌ చదివిన అపర మేధావి (అంతా ఉత్తిదే) గుర్తొస్తే మాత్రం మా బాధ్యత కాదు.  
 

Advertisement
Advertisement