బల్క్ డ్రగ్‌ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం  | Sakshi
Sakshi News home page

బల్క్ డ్రగ్‌ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం 

Published Sun, Dec 10 2023 5:47 AM

Center approves change of location of Bulkdrug Park - Sakshi

సాక్షి, అమరావతి: బల్క్‌ డ్రగ్‌ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు.

నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్‌ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూని­ట్లు ఉన్నాయి. బల్క్‌ డ్రగ్‌ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.  
 

Advertisement
Advertisement