హర్షకుమార్కు హైకోర్టు బెయిల్ మంజూరు | Sakshi
Sakshi News home page

హర్షకుమార్కు హైకోర్టు బెయిల్ మంజూరు

Published Tue, Jul 28 2015 1:09 PM

G V Harsha Kumar gets bail from High Court

హైదరాబాద్ : అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్కు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రిలో క్రైస్తవుల కోసం శ్మశానం ఏర్పాటు చేయాలని కోరుతూ  జీవీ హర్షకుమార్ జూలై 10వ తేదీన స్థానిక జాంపేట సెయింట్‌ పాల్‌ చర్చి గ్రౌండ్‌లోఆమరణ నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే.  అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల సమయంలో నగరంలో దీక్షతో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన పోలీసు అధికారులు శనివారం రాత్రి (11-07-2015)  ఆయనను బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

ఆ క్రమంలో తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అనారోగ్యంతో ఉన్న హర్షకుమార్ను ఆసుపత్రికి తరలించారు. ఆ రాత్రంతా హర్షకుమార్ ఆస్పత్రిలో కూడా నిరాహార దీక్ష కొనసాగించారు. అక్కడితో ఆగని ఆయన ఆదివారం ఉదయం రోడ్డు మీదే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో హర్షకుమార్ను పోలీసులు ఆదివారం సాయంత్రం జడ్జి నివాసానికి తీసుకువెళ్లి ఆయన ముందు నిలబెట్టారు. దీంతో హర్షకుమార్కు 14 రోజుల రిమాండ్ విధించారు. హర్షకుమార్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు హర్షకుమార్కు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement