ఆస్తి కావాలి.. నాన్న వద్దు! | Sakshi
Sakshi News home page

ఆస్తి కావాలి.. నాన్న వద్దు!

Published Thu, Apr 20 2017 3:29 AM

ఆస్తి కావాలి.. నాన్న వద్దు! - Sakshi

కొడుకుల తీరుతో.. ఠాణా మెట్లెక్కిన వృద్ధుడు

సిరిసిల్ల రూరల్‌: ‘అయ్యా.. నాకు ఇద్దరు కొడుకులు రామయ్య, ఎల్లయ్య.. నా ముసల్ది కాలం జేసింది.. మేం సంపాదించిన నాలుగెకరాల భూమిని ఆరేండ్ల కింద కొడుకులు చెరో రెండెకరాలు పంచుకున్నరు.. అరవై గొర్లుంటే.. వాటిని గూడా అమ్ముకున్నరు.. ఇగ ఆస్తిపాస్తులేవీలేవు.. చేతిల చిల్లిగవ్వలేదు.. బుక్కెడు బువ్వ పెట్టమంటే పట్టించుకుంటలేరు.. కడుపు మాడుతంది.. జెర మీరైనా మా కొడుకులతోని అన్నం పెట్టించుండ్రి సారూ..’అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన పరుమళ్ల మల్లయ్య(70) బుధవారం పోలీసులను ఆశ్రయించాడు.

వృద్ధాప్యం కావడంతో ఏవైనా పనులు చేసేందుకు శరీరం సహకరించడం లేదని ఎస్సై సైదారావుకు మొరపెట్టుకున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. బాధితుడి కుమారులను ఠాణాకు తీసుకు వచ్చేందుకు గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చారు. వృద్ధుడి ఆస్తిని స్వాధీనం చేసుకుని రెవెన్యూశాఖకు డిపాజిట్‌ చేయడమా, లేక విక్రయించి వచ్చిన సొమ్మును పోషణకు వెచ్చించడమా? అనే దానిపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు. అలాగే, వృద్ధాప్యంలో తండ్రి పోషణను విస్మరించిన కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement