రజత వికాసం | Sakshi
Sakshi News home page

రజత వికాసం

Published Wed, Jul 30 2014 1:43 AM

రజత వికాసం

85 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో
 వికాస్ ఠాకూర్‌కు రెండో స్థానం

 
 గ్లాస్గో: ఓ వైపు వెన్నునొప్పి... మరో వైపు ప్రత్యర్థుల జోరు... అయినా తనలో మాత్రం పతకం నెగ్గాలనే కసి.. ఈ కసితోనే భారత వెయిట్ లిఫ్టర్, 20 ఏళ్ల వికాస్ ఠాకూర్ అద్భుతం చేశాడు. వెన్ను నొప్పి వేధిస్తున్నా... పంటి బిగువున బాధను అనుచుకుంటూ అద్భుత ప్రదర్శనతో రాణించి కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన 85 కేజీల విభాగంలో ఠాకూర్ స్నాచ్‌లో 150 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 183 కేజీలు (మొత్తం 333 కేజీలు) బరువు ఎత్తాడు.
 
 అయితే పతకం విషయంలో తనకు కాస్త ‘అదృష్టం’ కూడా తోడైంది. కాంస్యం సాధించిన పాస్కల్ ప్లమోండన్ కూడా 333 కేజీ (151+182)ల బరువు ఎత్తి సమానంగా నిలిచాడు. దీంతో లిఫ్టర్ల శరీర బరువు కీలకమైంది. వికాస్ 84 కేజీల బరువు ఉండగా కెనడాకు చెందిన పాస్కల్ 85 కేజీల బరువున్నట్టు తేలింది. దీంతో వికాస్ రజతంతో మెరిశాడు. ఇక ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ ప్యాటర్సన్ (335 కేజీ; 151+184) దక్కించుకున్నాడు.


 

Advertisement
Advertisement