ఇప్పుడు.. కాంగ్రెస్‌కు తాకట్టు.. | Sakshi
Sakshi News home page

ఇప్పుడు.. కాంగ్రెస్‌కు తాకట్టు..

Published Fri, Aug 10 2018 2:17 AM

Chandrababu has openly supported Congress candidate - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, పార్లమెంటు తలుపులు మూసి మరీ నిట్టనిలువునా చీల్చి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని విభజిం చిందని, రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆ పార్టీని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిట్టిపోశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేసిందని కూడా అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం తిడుతూనే ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకత పునాదులపైన. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది.

అంతేకాదు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలన్నిటినీ ఐక్యం చేసిన ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటుతో కైవసం చేసుకున్న చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీని కాంగ్రెస్‌కు పాదాక్రాంతం చేయడం చూసి ప్రజలే కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అవకాశవాదానికి పరాకాష్ట వంటి చంద్రబాబు తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు.

ఆ పార్టీల ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు..
ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ‘ప్రత్యేక హోదా’ను విభజన చట్టంలో పెట్టినట్లయితే సుప్రీంకోర్టుకైనా వెళ్లి దానిని సాధించుకునే అవకాశం ఉండేది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల మరింత నష్టపోయారు.. దారుణంగా మోసపోయారు. పోనీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలనైనా కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అని విభజన చట్టంలో కాంగ్రెస్‌ పెట్టిందా అంటే అదీ లేదు. 13వ షెడ్యూలులో పెట్టిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సినవేననే అర్ధంలో చట్టంలో రాయకుండా కాంగ్రెస్‌పార్టీ మరో ద్రోహం చేసింది. 13వ షెడ్యూలులో పెట్టిన .. రైల్వే జోన్‌ నుంచి కడప స్టీల్‌ ఫ్యాక్టరీ వరకు, క్రూడాయిల్‌ రిఫైనరీ నుంచి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వరకు ఇలా ఏది తీసుకున్నా అన్నీ చట్టంలో.. ‘మే.. మే.. మే’అని పెట్టింది. అంటే చేయవచ్చు అనే అర్ధంలో రాశారన్నమాట. మే అని కాకుండా షల్‌ అని పెట్టి ఉంటే తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది.

ఆ రోజు చట్టంలో షల్‌ అని పెట్టకుండా కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. కచ్చితంతా చేయాలి అనే అర్ధంలో షల్‌ అని పెట్టి ఉంటే ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వారు కూడా భాగస్వాములే. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆ రెండు పార్టీలు అలా తుంగలో తొక్కాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ద్రోహం చేసింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందంటూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇపుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చే వైఖరి తీసుకోవడం, ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

వైఎస్సార్సీపీ సూత్రబద్ధవైఖరి..
రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ద్రోహం చేశాయి.. రెండు పార్టీలూ రాష్ట్ర ప్రజలను వంచించాయి.. కాబట్టి ఆ రెండు పార్టీలకూ మద్దతివ్వరాదన్న వైఖరి తీసుకుంది. అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేయగా.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ.. అవకాశం ఉండీ.. అధికారంలో ఉండీ.. మోసం చేసింది. అందుకనే ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారని ఆపార్టీ నేతలు ప్రకటించారు. ఎన్డీయే ఓ బీజేపీయేతర అభ్యర్థిని బరిలో దింపగా కాంగ్రెస్‌ పార్టీ స్వయంగా తన అభ్యర్థినే రంగంలో నిలిపింది. అలాంటి కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎలాంటి సంకోచమూ లేకుండా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతిచ్చి తన నిజస్వరూపాన్ని చాటుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసుల నుంచి రక్షణ కోసమే..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి. ఎందుకంటే తన కేసుల నుంచి రక్షణ కావాలి. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఎపుడు ఎలాంటి ముప్పు తెచ్చినా ఓ జాతీయ పార్టీ ఆదుకోవాలని ఆయన ఆశిస్తారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో సంబంధాలు తెగిపోయిన వెంటనే ఆయన కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యారు. ఒకవైపు బీజేపీతో లోపాయికారి సంబంధాల కోసం లాబీయింగ్‌ నడుపుతూనే కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా మద్దతిచ్చే స్థితికి చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుమ్మరించిన కేసులో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇక రాష్ట్రంలో లక్షల కోట్లకు చేరుకున్న అవినీతి గురించి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సంస్థలు నివేదికలిస్తున్నాయి.. వీటి నుంచి చంద్రబాబుకు రక్షణ అవసరం. అందుకే రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి మరో జాతీయ పార్టీకి చేరువయ్యారని వినిపిస్తోంది. అంత ద్రోహం చేసినా కాంగ్రెస్‌ అభ్యర్థికి బహిరంగంగా మద్దతివ్వడానికి, ఓటు వేయడానికి చంద్రబాబు ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

Advertisement
Advertisement