దండోపాయంతో ‘దారి’లోకి.. | Sakshi
Sakshi News home page

దండోపాయంతో ‘దారి’లోకి..

Published Wed, Aug 24 2016 2:11 AM

దండోపాయంతో ‘దారి’లోకి..

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మహిళా అనుచరులుగా చెలామణి అయిన ఫర్హానా, అఫ్షాలు కూడా మొదట్లో అతడి బాధితులే అని తేలింది. నయీమ్ బంధువులైన వీరిద్దరు అల్కాపురి టౌన్‌షిప్‌లోని గ్యాంగ్‌స్టర్ ఇంట్లో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. నార్సింగ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తొలినాళ్లలో నయీమ్ క్రూరత్వాన్ని చవిచూసిన వీరు.. ఆ తర్వాతే అతడి వెంట ఉంటూ నేరాల్లో పాలుపంచుకోవడం, ఆస్తులకు బినామీగా మారడం చేశారు. మరోవైపు నయీమ్ రాష్ట్ర సరిహ ద్దులు దాటి ప్రయాణించేప్పుడు తన ఆయుధాలను మహిళల వద్ద ఉంచేవాడని తేలింది. వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
అధీనంలోకి తీసుకొని బినామీగా..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలన్‌కు చెందిన ఫర్హానాకు 1999లో మిర్యాలగూడకు చెందిన సయ్యద్ అహ్మద్‌తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసే వాడు. 2007లో భర్త చనిపోవడంతో 2009 వరకు అత్తగారింట్లోనే ఉంది. వరుసకు అన్న అయిన నయీమ్ ఇంట్లో పిల్లల్ని చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన మూడో కుమారుడైన సలీమ్‌ను తీసుకుని నయీమ్ వద్దకు వచ్చింది. అప్పట్లో నయీమ్ హయత్‌నగర్‌లో ‘రంగన్న’ అనే పేరుతో ఉన్న ఇంట్లో నివసించేవాడు.

ఆ ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ ఫర్హానాను బెదిరించాడు. సలీమ్‌ను కూడా తీవ్రంగా హింసించడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. వావి వరసలు మర్చిపోయిన నయీమ్... ఫర్హానాతోనూ వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఓ దశలో ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత తన ఆస్తులకూ బినామీగా మార్చుకున్నాడు. అల్కాపురి టౌన్ షిప్‌లోని నయీమ్‌కు మూడంతస్తుల ఇల్లు ఉంది. మూడో అంతస్తులో జిమ్ ఉండగా రెండో అంతస్తులో నయీమ్ తన భార్య పిల్లలతో ఉండేవాడు.

మొదటి అంతస్తులో ఫర్హానాతోపాటు యువతులు, మైనర్లు, గ్రౌండ్ ఫ్లోర్‌లో డ్రైవర్ కేసీఆర్ అలియాస్ కిషోర్ నివసించే వాడు. నయీమ్ తమపై చేస్తున్న అఘాయిత్యాలను మైనర్లు అప్పుడప్పుడు ఫర్హానాతో చెప్పేవారు. వారిని ఆమె ఓదార్చుతున్న విషయం తెల్సుకున్న నయీమ్.. శిక్షగా ఆమెకు గుండు గీయించాడు. ఫర్హానాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నేరాల్లోనూ ఆమెను వాడాడు. సొంత బావ నదీంను చంపిన తర్వాత మృతదేహాన్ని కొత్తూర్ తీసుకు వెళ్లి కాల్చేయడానికీ ఫర్హానాను వెంట తీసుకెళ్లాడు.
 
పని ఇప్పిస్తానంటూ.. అఫ్షాను..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అఫ్షా వరుసకు నయీమ్ మేనకోడలు. ఈమె తండ్రికి భువనగిరిలో కేబుల్ నెట్‌వర్క్ ఉండేది. భువనగిరిలో పదో తరగతి వరకు చదివిన అఫ్షా చదువు అక్కడితో ఆపించి, తన వద్దకు పంపమంటూ నయీమ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో చదువు మాన్పిం చిన అఫ్షా తల్లిదండ్రులు 2010లో మిర్యాలగూడకు చెందిన అమీర్‌కు ఇచ్చి ఆమె వివాహం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన అమీర్ ఖాళీగానే ఉండటంతో అతడి తండ్రే కుటుంబ పోషణ చూసేవారు.

ఏడాది తర్వాత వీరికి పాప పుట్టింది. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా నయీమ్ కూడా అక్కడకు వచ్చాడు. అఫ్షా, ఆమె భర్తను చూసిన నయీమ్ హైదరాబాద్ వస్తే పని ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో వారు పాపతో సహా అప్పట్లో నయీమ్ ఇంటికి వచ్చారు. కొన్ని రోజులకు అమీర్ ప్రైవేట్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న రోజే అఫ్షాను నయీమ్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక అప్పటి  నుంచి ఆమె జీవితం నయీమ్ చేతిలో చిక్కింది. కొన్ని నేరాల్లోనూ పాలుపంచుకుంది.
 
వారంతా ఎక్కడున్నారు?
అల్కాపురి టౌన్‌షిప్‌లోని ఇంటికి మారడానికి ముందు నయీమ్ షాద్‌నగర్‌లో ఓ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ ఏడాది పాటు తన తమ్ముడి భార్య హీనా, కుమార్తె చియాన్‌లను తీవ్రంగా హింసించగా వీరిద్దరూ సైతం కనిపించకుండా పోయారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడే నయీమ్ మిర్యాలగూడ నుంచి సాదియా, మాలియా, జోహా పేర్లతో ఉన్న యువతులను చదివిస్తానంటూ తీసుకువచ్చాడు. ఆ ముగ్గురిపైనా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తీవ్రంగా హింసించేవాడు.

వీరితో పాటు నయీమ్ తమ్ముడి కుమార్తె షమ, బంధువు అషు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలియట్లేదు. అలాగే రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో తన వెంట ఉండే శమ అలియాష్ అహేలా, సదా అలియాస్ నీలోఫర్, కరీన అలియాస్ అఫ్సలను తీసుకెళ్లేవాడు. వారికి జీన్‌ప్యాంట్స్ వేసి నడుముకు ఆయుధాలు ఉంచేవాడు. ఆపై బుర్ఖా వేయించి తనతో పాటే తీసుకువెళ్లేవాడు. వీరు ఎవరు? ఎక్కడున్నారన్న అంశాలపై పోలీసు విభాగం దృష్టిపెట్టింది.

Advertisement
Advertisement