హీరో కాదు... విలనే! | Sakshi
Sakshi News home page

హీరో కాదు... విలనే!

Published Mon, Apr 7 2014 10:57 PM

హీరో కాదు... విలనే!

అధ్యయనం

మందు కొట్టినప్పుడు అబద్ధాలాడితే ‘‘ఏదో తాగి వాగాను గురూ. లైటుగా తీసుకో’’ అంటూ ఒక సాకును వెతుక్కోవచ్చు. మరి మందు  కొట్టకుండానే అబద్దాలు ఆడితే... ఆ పాపం ఎవరిది? కచ్చితంగా ఆక్సిటోసిన్ హార్మోన్‌దే అంటున్నారు పరిశోధకులు. నిజానికి ‘ఆక్సిటోసిన్’కి మంచి పేరు ఉంది.

‘లవ్ హార్మోన్’ అని కూడా దీన్ని పిలుస్తారు. ప్రేమలో పడడానికి,  బంధాలు దృఢతరం కావడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుంది... అని కూడా ఎంతో మంది కితాబు ఇచ్చారు. మరి అలాంటి ‘హీరో’ హార్మోన్‌లో ఇప్పుడు ‘విలన్’ కోణం బయటపడింది. ఒక మాదిరి అబద్ధాల నుంచి  శుద్ధ అబద్ధాలు ఆడడానికి కారణం ఆక్సిటోసిన్ ప్రభావమేనని ఇజ్రాయెల్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్ పరిశోధక బృందం చెబుతుంది.
 
వీరు తమ పరిశోధన  కోసం రెండు బృందాలను ఎంచుకొని,  ఒక  కంప్యూటర్ గేమ్‌ను డిజైన్ చేసి... దీని ఆధారంగా కొన్ని నిర్ధారణలకు వచ్చారు. రెండు బృందాలలోని వారూ అబద్ధం చెప్పినప్పటికీ, ఆక్సిటోసిన్  విడుదలైన  వారు మాత్రం  ఎక్కువ అబద్ధాలాడారు. ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతున్నకొద్దీ  ‘అబద్ధాల తీవ్రత’ అంతకంతకూ పెరుగుతూ పోయింది.

 పి.యస్:  అంటే అబద్ధమాడి దొరికిపోతే ‘‘తప్పు నాది కాదు... ఆక్సిటోసిన్‌ది. అంతే!’’ అని డైలాగు కొట్టొచ్చన్నమాట!
 

 
Advertisement
 
Advertisement