వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌ | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌

Published Tue, May 28 2024 7:40 AM

వరల్డ

ఉలవపాడు: ప్రపంచ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు మండల పరిఽధిలోని రామాయపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ జీవన్‌కుమార్‌ ఎంపికయ్యారు. జూలైలో ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 45 ఏళ్ల విభాగంలో ఆంధ్రా తరఫున ఆయన పాల్గొన్నారు. జావెలిన్‌ త్రో, హ్యామర్‌ త్రోలో బంగారు పతకాలు సాధించాడు. ఆయన ప్రతిభ చూపడంతో వరల్ట్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యాడు. జీవన్‌ చాలామంది క్రీడాకారులను తయారు చేసి ఉత్తమ పీడీగా అవార్డు అందుకున్నారు. జీవన్‌ను పాఠశాల సిబ్బంది సోమవారం అభినందించారు.

పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహం

డ్వామా పీడీ వెంకట్రావు

ఉదయగిరి: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తున్నామని డ్వామా పీడీ వెంకట్రావు తెలిపారు. కలిగిరిలో జరుగుతున్న ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం పీడీ మాట్లాడుతూ రోజుకు రూ.300 గిట్టుబాటయ్యేలా కూలీలు నిర్ణీత కొలతల్లో పనులు చేయాలన్నారు. కనీసం నాలుగు గంటల సమయం పని చేసేలా చూడాలన్నారు. పనుల వద్ద ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. కూలీలు రెండు లీటర్ల తాగునీటిని వెంట తెచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 80 వేల మంది పనులకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 60 లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. పండ్ల తోటలు సాగు చేసే రైతులకు దుక్కుల దున్నకం నుంచి మొక్కలు నాటడంతోపాటు మూడేళ్ల పూర్తి స్థాయిలో నిర్వహణ ఉపాధి హామీ పథకంలో చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాలో మౌలిక వసతుల కల్పనకు కూడా ఉపాధి పథకం ద్వారా కొన్ని పనులు చేయిస్తామన్నారు. పనుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాసులు, ఈసీ రవీంద్ర, టీఏలు మధు, అనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

12న పొట్టేళ్ల వేలం

ఉదయగిరి: కొండాపురం మండలం చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రంలో జూన్‌ 12వ తేదీన నెల్లూరు జొడిపి, పల్లా పొట్టేళ్లకు సంబంధించి వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకుడు పి.మహేశ్వరుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 186 పొట్టేళ్లకు నిర్వహించే ఈ వేలంపాటలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఆరోజు ఉదయం 8 నుంచి 10 గంటల్లోపు రూ.5 వేలు దరావత్తు చెల్లించాలన్నారు. ఔత్సాహికులు జూన్‌ 10, 11 తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు పశుక్షేత్రంలో ఉన్న పొట్టేళ్లను పరిశీలించవచ్చని తెలియజేశారు. మరిన్ని వివరాలకు చింతలదేవి పశుక్షేత్రంలో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.

విద్యుదాఘాతానికి గురై యువకుడి మృత్యువాత

అనుమసముద్రంపేట: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఏఎస్‌పేట మండలంలోని హసనాపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సంగం మండలం కుమ్మరివీధికి చెందిన చిట్టమూరు బ్రహ్మయ్య, లక్ష్మమ్మల కుమారుడు వినోద్‌ (27) కరెంట్‌ పని చేస్తుంటాడు. అతను సోమవారం హసనాపురంలో ఓ ఇంటి వద్ద పని చేస్తున్నాడు. ఈదురుగాలుల కారణంగా వినోద్‌కు విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. అక్కడి వారు గుర్తించి వెంటనే అతడిని ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినోద్‌ మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నిరుగా రోదించారు.

వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌
1/2

వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌

వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌
2/2

వరల్డ్‌ మాస్టర్‌ అథ్లెటిక్స్‌కు పీడీ జీవన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement