రక్తమోడిన రహదారులు | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

Published Tue, May 28 2024 7:40 AM

రక్తమ

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందాయి. మనుబోలు మండలంలో ఒకరు, ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకరు, అనంతసాగరం మండలంలో ఒకరు మృతిచెందారు.

వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురి మృతి

లారీని ఢీకొన్న మోటార్‌బైక్‌

మనుబోలు: లారీని మోటార్‌బైక్‌ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం జరిగింది. కుప్పం నియోజకవర్గం నాయునూరుకు చెందిన బి.బాబు కుమారుడు బి.కార్తీ (20), తమిళనాడు కృష్ణగిరికి చెందిన జయరాం కుమారుడు జె.అరవింద్‌ బైక్‌పై నెల్లూరు నుంచి చైన్నెకి వెళ్తున్నారు. మండల పరిధిలోని వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పొదలకూరు వైపు నుంచి వచ్చిన లారీ హైవేకి తూర్పున ఉన్న వే బ్రిడ్జ్‌ వద్ద వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన బైక్‌ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి వారిని వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కార్తీ మృతిచెందాడు. అరవింద్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా పడి..

ఆత్మకూరు: పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఓ కుటుంబం నెల్లూరు జిల్లాకు వచ్చింది. ఆత్మకూరు సమీపంలోని ఏఎస్‌పేట దర్గా సందర్శించేందుకు వెళ్తుండగా ముంబై జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. సీఐ జి.వేణు, ఎస్సై ముత్యాలరావు కథనం మేరకు.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఏఎస్‌పేట, కసుమూరు, వేనాడు దర్గాలను సందర్శించేందుకు ఆటోలో వచ్చింది. ఏఎస్‌పేట దర్గాకు వెళ్లేందుకు ఆత్మకూరు సమీపంలోని పేట అడ్డరోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా ముందు వాహనాలను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఆటోలో ముందు వైపు కూర్చొని ఉన్న కరీమున్నీసా (45) రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ముందు వెళ్తున్న వాహనాన్ని..

సోమశిల: అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవేపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన వెంకట సుధ (29) కమ్మవారిపల్లిలో ఉంటున్న అక్క ఇంటికి మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. ఉప్పలపాడు కూడలి వద్ద బొలెరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అది బైక్‌ను ఢీకొంది. దీంతో సుధ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సోమశిల ఎస్సై సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

రక్తమోడిన రహదారులు
1/3

రక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు
2/3

రక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు
3/3

రక్తమోడిన రహదారులు

Advertisement
 
Advertisement
 
Advertisement