40కి పైగా చోరీలు | Sakshi
Sakshi News home page

40కి పైగా చోరీలు

Published Tue, Apr 2 2019 7:33 AM

Inter State Thief Arrest in Hyderabad - Sakshi

అమీర్‌పేట: ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగ విజయ్‌ కాంబ్లేను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. చోరీలు చేసి ఏడుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా పద్ధ తి మార్చుకోకుండా మళ్లీ మళ్లీ చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అతడిని క్రైం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ వివరాలను వెళ్లడించారు. కర్నాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా, ఔరాద్‌ తాలూక, శాంతాపూర్‌కు చెందిన 36 ఏళ్ల విజయ్‌ కాంబ్లే అలియాస్‌ లక్ష్మణ్‌ సోంబా కాంబ్లే మహా రాష్ట్రలోని లాతూర్‌లోని నాందేడ్‌ రోడ్‌ గణేష్‌నగర్‌లో ఉంటూ హెయిర్‌ కటింగ్‌ షాపు నిర్వహించేవాడు. ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఉదయం పూట ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి పూట పక్కా ప్రణాళికతో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడతాడు. బీరువాల్లోంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేసేవాడు.

మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు చేసి కిలోల కొద్దీ ఆభరణాలు ఎత్తుకుపోయాడు. వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏడుసార్లు జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చి మళ్లీ చోరీలు కొనసాగిస్తున్నాడు. ఎస్‌ఆర్‌నగర్, జగిత్యాల్, కోరుట్ల, భైంసా, గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 8 చోరీలకు పాల్పడి రూ.40 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. భైంసాలో టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి ఇంట్లో చోరీ చేసిన కాంబ్లే 60 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు విజయ కాంబ్లేపై పీడీ యాక్ట్‌  చట్టం కింద కేసు నమోదు చేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఆర్‌నగర్‌ క్రైం డీఐ వై.అజయ్‌కుమార్, ఇతర సిబ్బంది నిఘాపెట్టి పట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ కాంబ్లేను పీడీ యాక్ట్‌ కింద రిమాండ్‌కు తరలించారు. ఆయా ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఘటనల నేపథ్యంలో పీటీ వారెంట్ల ఆధారంగా నింధితుడి వద్ద నుంచి సొత్తు రికవరీ కోసం ఆయా పోలీస్‌స్టేషన్లకు అప్పగించే వీలుందని డీసీపీ తెలిపారు. సమావేశంలో పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, వై.అజయ్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement