కొందరికే లబ్ధి | Sakshi
Sakshi News home page

కొందరికే లబ్ధి

Published Sun, Nov 9 2014 2:42 AM

farmers are concern on debt rescheduling

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే రుణాల రీషెడ్యూల్ ప్రకటన అన్నదాతలకు ఊరటనిస్తుంది. కానీ హుద్‌హుద్ తుఫాన్ నేపథ్యంలో ప్రకటించిన రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందే అవకాశం లేకపోవడంతో జిల్లాలోని మెజార్టీ రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
 
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో నాలుగులక్షలఎనిమిదివేలమంది రైతులున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 3.79 లక్షల హెక్టార్లలో వరితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. 2.70లక్షల ఎకరాల్లో వరి, 75వేల ఎకరాల్లో చెరకు, అపరాలు పండిస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్-రబీ సీజన్‌లకు కలిపి  రైతులకు రూ.950కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటి వరకు అందించింది రూ.320 కోట్లు మాత్రమే.

అది కూడా అతికష్టమ్మీద 50వేల లోపు రైతులకు మాత్రమే ఇవ్వగలిగారు.  రుణమాఫీ వల్ల రూ.1040కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని సుమారు 2.50లక్షల మంది రైతులు ఆశించారు. కానీ రు ణమాఫీ వల్ల మిగిలిన రైతులకు ఖరీఫ్ సీజన్‌లో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారీల వద్ద అం దినకాడికి రూ.10లు..
 రూ.15లవడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేసారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో హుదూద్ విరుచుకుపడింది. జిల్లాలో 882 గ్రామాల పరిధిలో 1,35,184 మంది రైతులు సాగు చేసిన 82,385.681 ఎకరాల్లో పంటలు 50 శాతానికి పైగా దెబ్బతిన్నాయి.

గతంలో ఎన్నడూలేని రీతిలో జిల్లాలోని 43 మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా ప్రకటించి ఆయా మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలన్నింటిని రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన హుదూద్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న లక్షా35వేల మంది రైతులకు రుణాల రీషెడ్యూల్ వర్తించాలి. కానీ ఆ పరిస్థితి లేదు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఖరీఫ్‌సీజన్‌లో రుణాలు ఇస్తుంటారు. ఈ ఏడాది సాగు ఆలశ్యమవడం..రుణ లక్ష్యాలు చేరుకోకపోవడంతో గడువును తొలుత ఆగస్టు, తర్వాత సెప్టెంబర్ వరకు పొడిగించారు. అయినా 40 శాతం రైతులకు మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయలేకపోయారు.

ఈ లెక్కన 50వేలలోపు రైతులు మాత్రమే ఖరీఫ్ రుణాలు పొందగలిగారు. సగం మందికి పైగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. దీంతో పంట పూర్తిగా నష్టపోయిన రైతుల్లో ఎంతతక్కువ లెక్కేసుకున్నా 80వేల మందికి రీషెడ్యూల్ ద్వారా లబ్ది పొందే అవకాశం లేకుండా పోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఒక పక్క పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయి..మరొక పక్క రీషెడ్యూల్ వల్ల కలిగే లబ్దిని కోల్పోవడంతో వీరి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇంకొక పక్క పరిహారం ఇప్పుడు ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రీషెడ్యూల్ వల్ల లబ్దిపొందే అవకాశం లేకపోవడంతో మరింత అప్పుల ఊబిలో కూరకుపోవాల్సి వస్తుందంటూ రైతులు కలవరపడుతున్నారు.

రుణమాఫీ విషయంలో సర్కార్ కాలయాపన చేయడం వలనే తమకీ దుస్థితి పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసి ఉంటే ఖరీఫ్‌లో తామంతా రుణాలు పొందేవారమని,,ఆమేరకు పంటల బీమా వర్తించడంతో పాటు ఇప్పుడు రీషెడ్యూల్ పరిధిలోకి వచ్చేవారమని అంటు న్నారు. రీషెడ్యూల్ పొందిన రైతులకు గత ఖరీఫ్ సీజన్‌లో వారు పొందిన రుణాలన్నీ 3 నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో రీషెడ్యూల్ అవుతాయి.

అంతేకాకుండా రబీ సాగు చేసే రైతులకు జనవరి నుంచి కొత్త రుణాలు మంజూరవుతాయి. రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించి.. జిల్లా పరిధిలో ఎన్ని కోట్ల మేర ఎంతమంది రైతులు రీషెడ్యూల్ వల్ల లబ్ది పొందుతారో గుర్తించేందుకు వచ్చే వారంలో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ (బ్యాంకర్స్) సమావేశం నిర్వహించి తుది జాబితా ప్రకటించే అవకాశాలు న్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.

Advertisement
 
Advertisement