సాగర్‌ కాంట్రాక్టర్‌ పరార్‌...! | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాంట్రాక్టర్‌ పరార్‌...!

Published Thu, Aug 2 2018 11:54 AM

Contractor Negligence Project Works - Sakshi

‘వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు పనులను ఇక పరుగెత్తిస్తా..! నిధులు మంజూరయ్యాయి. ఇక కొద్ది రోజుల్లో సాగునీరు అందిస్తాం...’ ఇవీ మంత్రి పదవి వచ్చిన వెంటనే సుజయకృష్ణ రంగారావు రైతులకు ఇచ్చిన హామీ. అయితే ఈ పనులు ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులకు సంబంధించి ఇటు మంత్రిగాని, అటు ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. దీంతో సాగునీటి కోసం అదనపు ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బొబ్బిలి : వెంగళరాయ సాగర్‌ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్‌ పనులను 20 శాతం కూడా చేయకుండానే కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. పనులు ప్రారంభించి కొన్ని చోట్ల చేపట్టిన పనులను ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేయడమే తప్ప వాటిని పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం వారు చేసిన ఫోన్లనూ లిఫ్ట్‌ చేయడం లేదు. వెంగళరాయ సాగర్‌ పనులు ఈ ఖరీఫ్‌కే కాదు వచ్చే ఖరీఫ్‌కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 

2013లో శంకుస్థాపన చేసినపుడు ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా రైతులకు కేవలం 18 నెలల్లో సాగునీరు అందిస్తామని మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యే హోదాలో హామీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై ఆ తరువాత పార్టీ మార్చి మంత్రి అయిన తరువాత జూట్‌ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా అదనపు జలాల ప్రాజెక్టునూ పరుగులెత్తిస్తామన్నారు. కానీ ఏ పనీ సాగడం లేదు.

మంత్రి పదవి వచ్చాక ఇచ్చిన హామీ కనుక ఇక మాకు భయం లేదు...సాగునీరు అందుతుందనుకుంటున్న రైతులు ఇప్పుడు మా నోట్లో మట్టికొట్టారని వాపోతున్నారు. వెంగళరాయ సాగర్‌ అదనపు ఆయకట్టు పనులను చేపడుతున్న  ఆర్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌  పనులను నిలిపివేసి ఏడాదవుతున్నా  అధికారులుగానీ, ఇటు పనులు ప్రారంభించి సాగునీరందిస్తామన్న మంత్రి సుజయకృష్ణ  రంగారావుగానీ పట్టించుకోకపోవడంతో అదనపు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

17 శాతం లెస్సుకు వేసినపుడే అనుమానం రావాలిగా! 

వెంగళరాయ సాగర్‌ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్‌ ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఈ టెండర్‌ను 17 శాతం లెస్సుకు వేశారు. అప్పుడైనా ప్రజాప్రతినిధులు, అధికారులకు అనుమానం రావాలి. కానీ ఎంచక్కా పనులు ప్రారంభించారు. ఇప్పుడు నష్టాలొస్తున్నాయంటూ పనులు నిలిపివేశారు. నిధులేమో మూలుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు.  ప్రారంభంలో కాంట్రాక్టర్‌కు ప్రతీ 15 రోజులకూ నోటీసులు జారీ చేస్తున్నప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయన్న కాంట్రాక్టర్‌ ఇప్పుడు ఏకంగా ఫోన్లు కూడా ఎత్తడం లేదని అధికారులు చెబుతున్నారు. 

భూ సేకరణే పూర్తి కాని వైనం 

2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని రైతాంగం ఎదురు చూస్తున్నది. సీతానగరం మండలంలోని 5 గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబందించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు.  పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు పలుమార్లు దాటిపోయింది. ఇప్పటికి  రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడం కానీ మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం కానీ చేయాలి. ఆ తరువాత కొత్తగా టెండర్‌ వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నేటికీ కాంట్రాక్టర్‌ను మార్చే ప్రతిపాదనలు కానీ ప్రభుత్వానికి నివేదించడం కానీ చేయకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రైతులు ఆరోపిస్తున్నారు.  

వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం 23.78  ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది.

దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద రూ.3కోట్లతో వయాడెక్ట్‌  నిర్మించేందుకు భూసార పరీక్షలు చేసేందుకు సుమారు పది నెలలవుతోంది.  

ఎస్‌ హయాంలోనే శంకుస్థాపన 

జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుగా పేరొందిన వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు ద్వారా 24వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరందుతున్నా జలాశయ సామరŠాధ్యన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కిందట అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ పనులు వరుసగా అంచనాలను పెంచుకుంటూ పోయి నేటికి రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన కాంట్రాక్టర్‌ ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంతకన్నా తక్కువే అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికి రాస్తాం..

కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. ఎన్నోమార్లు నోటీసులు ఇచ్చాం. స్పందన లేదు. ఇప్పుడు ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. కొత్తగా మరే కాంట్రాక్టర్‌ కూడా లెస్సుకు ఉండటం వల్ల రావడం లేదు. ఈ విషయమే ప్రభుత్వానికి రాస్తున్నాం. 

– కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్‌

Advertisement
Advertisement