'గూగుల్ ఘనత నాదే'
రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం పలువురితో వరుస సమావేశాల అనంతరం విలేకరులో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం పలువురు కేంద్రమంత్రులు సహా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు. వరుస సమావేశాల అనంతరం విలేకరులో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను తీసుకువచ్చింది తానేనని, అదే క్రమంలో ఇప్పుడు గూగుల్ సంస్థ నగరంలో అతిపెద్ద కార్యాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని, గతంలో తాను అనుసరించిన విధానలవల్లే ఇది సాధ్యమయిందని చంద్రబాబు అన్నారు.
మోదీ ఏడాది పాలనలో ఏపీకి కొంత మద్దతు లభించిందని, రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్రం సహకారం మరింత అవసరమన్నారు. హైకోర్టు తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ ప్రభుత్వమే అందుకు సంసిద్ధత కనబర్చడంలేదని పేర్కొన్నారు.
కొత్త రాజధాని నిర్మాణమంటే కేవలం బిల్డింగులు కట్టడమే కాదన్న చంద్రబాబు.. కంపెనీలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరగా నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఉమా భారతిని కోరినట్లు చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పార్టీ వ్యవహారాలు, పునర్విభజన అంశాలపై చర్చించానన్నారు.


