కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత
Breaking News
రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు
Published on Thu, 02/12/2026 - 04:05
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్ సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా బదిలీ అయ్యారు. సింగరేణి సంస్థ సీఎండీ అదనపు బాధ్యతల నుంచి డి.కృష్ణభాస్కర్‌ను ప్రభుత్వం ఉపసంహరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా విభజించిన ప్రభుత్వం ఈ మూడింటికి ప్రత్యేకాధికారి (స్పెషల్ ఆఫీసర్)గా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను నియమించడంతోపాటు, మూడు కార్పొరేషన్లకు ముగ్గురు ఐఏఎస్‌లను కమిషనర్లుగా నియమించింది.
ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, నాన్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నైనీ బొగ్గు బ్లాకు ఓవర్‌బర్డన్ తొలగింపునకు సంబంధించి నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి సీఎండీగా అదనపు బాధ్యతల్లో ఉన్న కృష్ణభాస్కర్‌ను తప్పించి పూర్తిస్థాయి సీఎండీగా జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ప్రభుత్వం నియమించింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచీ ఘోష్‌కు ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీల అభివృద్ధి విభాగం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ రెండు పోస్టుల బాధ్యతల నుంచి జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ఉపసంహరించుకుంది. ఎస్టీల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఎస్టీల అభివృద్ధి విభాగం కమిషనర్‌గా సబ్యసాచీ ఘోష్‌కు మరో రెండు పోస్టుల్లో కూడా సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ రెండు పోస్టుల అదనపు బాధ్యతల నుంచి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను ఉపసంహరించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ డి.దివ్యకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ పోస్టు అదనపు బాధ్యతల నుంచి శ్రుతి ఓఝాను తప్పించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 7 కార్పొరేషన్లు, 20 పురపాలికలను విలీనం చేసి ఏర్పాటు చేసిన కొత్త జీహెచ్ఎంసీని ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్విభజించిన విషయం తెలిసిందే.
కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను అదే పోస్టులో కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు జి.సుృజన, టి.వినయ్‌కృష్ణారెడ్డిలను సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లుగా బదిలీ చేసింది. సెర్ప్ అదనపు సీఈఓ పి.కాత్యాయినీ దేవిని ప్రజావాణి నోడల్ అధికారిగా బదిలీ చేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి డి.దివ్యను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
రాష్ట్ర ఆర్థిక సంఘం జేఎండీగా అదనపు బాధ్యతల్లో పి.కాత్యాయినీ దేవి కొనసాగుతారని స్పష్టం చేసింది. హైదరాబాద్ జలమండలి ఈడీని అదే సంస్థ జేఎండీగా బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీ యు.రఘురామ్శర్మను పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన మంత్రి శ్రీధర్‌బాబుకు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది.
Tags : 1