Breaking News

అక్రమాల టై‘టానిక్‌’

Published on Sun, 03/10/2024 - 06:22

సాక్షి, హైదరాబాద్‌: ఎలైట్‌ పేరుతో మద్యం వ్యాపా రంలోకి ప్రవేశించిన టానిక్‌ గ్రూపు ఏకంగా రాష్ట్రంలోని లిక్కర్‌ దందాను కబ్జా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. రెండు షాపులు పెడతామని, విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముతామని నమ్మబలికి ఎంట్రీ ఇచ్చిన ఆ సంస్థ ఆ తర్వాత ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికల్లో భాగంగా ఏకంగా గొలుసు వ్యాపారానికి (చైన్‌ బిజినెస్‌) సిద్ధమైంది. నాటి ప్రభుత్వంలోని ఒకరిద్దరు కీలక వ్యక్తుల (ఒక మాజీ ప్రజా ప్రతినిధి, ఒక మాజీ ఉన్నతాధికారి) సాన్నిహిత్యం, సంపూర్ణ సహకారంతో నిబంధనలను తన కనుసన్నల్లో రూపొందించుకుని, తనకు మాత్రమే సాధ్యమయ్యేలా రూల్స్‌ పెట్టి ఇంకెవరూ ఎలైట్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న టానిక్‌ సంస్థ గత ఆరేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడిందని తెలుస్తోంది. 

ఖాళీగా ఉన్నాయంటూ ‘టెండర్‌’ 
ఎక్సైజ్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.... రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా 2016–18 సంవత్సరాల్లో లాటరీ పద్ధతిన 2,216 ఏ4 షాపులకు లైసెన్సులిచ్చే ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకుంటూ టానిక్‌ గ్రూపు రంగంలోకి దిగింది. అప్పట్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 70 వరకు షాపులను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించింది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ అండ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తామంటూ లిక్కర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

ఎలైట్‌ స్టోర్‌ పేరుతో కేవలం విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్ముకునేందుకు వీలుగా తమకు మాత్రమే సాధ్యమయ్యేలా నిబంధనలను రూపొందించేలా మరీ అడుగుపెట్టింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారే ఎక్సైజ్‌ శాఖ అధిపతిగా ఉండడం, టీఎస్‌బీసీఎల్‌కూ ఆయనే బాస్‌ కావడంతో ఆయన్ని మచ్చిక చేసుకుని ఎలైట్‌ స్టోర్‌ ఏర్పాటు కోసం ప్రత్యేక జీవోను వచ్చేలా చేసింది. కనీసం ఎక్సైజ్‌ శాఖకు సమాచారం లేకుండానే ఆ జీవో ముసాయిదాను బయట తయారుచేయించి ఆ ముసాయిదాతోనే ఫైల్‌ నడిపించిందని ఎక్సైజ్‌ అధికారులు చెపుతున్నారంటే టానిక్‌ సంస్థ ముందస్తు వ్యూహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఎలైట్‌ షాపు ఏర్పాటు చేసేందుకు గాను ప్లింత్‌ ఏరియా 10వేల చదరపు అడుగులు ఉండాలనీ, సదరు షాపును సూపర్‌మార్కెట్లు, మాల్స్‌లో ఏర్పాటు చేయాలంటే ఆయా మాల్స్‌ మొత్తం వైశాల్యం 25వేల చదరపు అడుగులు ఉండాలని, కనీసం 100 ఇంపోర్టెడ్‌ బాటిళ్లు ఎప్పుడూ డిస్‌ప్లే ఉండాలని... ఇలా తమకు మాత్రమే సాధ్యమయ్యే నిబంధనలను జీవోలో పెట్టించి ఇంకెవరూ ఈ ఎలైట్‌ షాపుల ఏర్పాటుకు ముందుకు వచ్చే వీలులేకుండా చూసుకుంది. 2016, అక్టోబర్‌ 26న వచ్చిన జీవోనెం:271 ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేయడం, వారం రోజుల్లో అనిత్‌రాజ్‌ లక్ష్మారెడ్డి పేరిట లైసెన్సు ఇవ్వడం కూడా పూర్తయిపోయాయి. 

చైన్‌ బిజినెస్‌ స్థాయికి ప్రణాళిక..  
ముందుగా రెండు షాపులు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న టానిక్‌ సంస్థ తొలుత ఒక్క దుకాణాన్ని మాత్రమే తెరిచింది. కొన్నిరోజుల పాటు విదేశీ మద్యాన్ని మాత్రమే అమ్మిన తర్వాత ఇండియన్‌ ప్రీమియం లిక్కర్‌ కూడా అమ్ముతామంటూ ఎక్సైజ్‌ శాఖకు దరఖాస్తు చేసుకుంది. టానిక్‌ అడిగిందే తడవుగా ఎక్సై జ్‌ శాఖ అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో ఈ ఒక్క షాపు ద్వారానే ఊహించిన దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుండడం, ఎప్పుడో వస్తుందని ఊహించిన ఆదాయం తొలి ఏడాది నుంచే రావడంతో గొలుసు వ్యాపారం చేయాలనే ఆలోచన టానిక్‌ యాజమాన్యానికి తట్టింది. పుల్లారెడ్డి స్వీట్లు, ప్యారడైజ్‌ బిర్యానీ పాయింట్లు, నారాయణ, చైతన్య కళాశాలల తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలైట్‌ దుకాణాలు తెరుస్తామని ప్రతిపాదించింది. కానీ అప్పటికే ఏ4 షాపుల టెండర్లు పూర్తి కావడంతో సదరు షాపుల లైసెన్సీల నుంచి ప్రతికూలత వస్తుందని, న్యాయపరంగా అడ్డంకులు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అభ్యంతరం చెప్పడంతో వెనక్కు తగ్గింది. 

క్యూ/టానిక్‌గా పేర్లుగా మార్చి 
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళిక దెబ్బతినడంతో వైన్స్‌షాపుల వైపు టానిక్‌ దృష్టి మళ్లింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లాటరీ పద్ధతిలో పాల్గొనేందుకు ప్రయత్నించింది. అడపాదడపా షాపులు వచ్చినా టెండర్‌ ఫీజు భారీగా కట్టాల్సి వస్తుండడంతో లైసెన్స్‌ పొందిన ఏ4 షాపులను మచ్చిక చేసుకునే పనిలో పడింది. శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాల పరిధిలోనికి వచ్చే దాదాపు 10 షాపుల్లో భాగస్వామ్యం తీసుకుంది. తమ వాటా ఉన్న వైన్‌షాపులకు క్యూ/టానిక్‌గా పేర్లు మార్చుకుంది.

అచ్చం మాతృ టానిక్‌ షాపులాగానే ఎలైట్‌గా వీటిని తయారు చేసి విదేశీ మద్యంతో పాటు ఇండియన్‌ ప్రీమియం లిక్కర్‌ను మాత్రమే విక్రయించేది. చీప్‌ లిక్కర్‌తో పాటు తక్కువ ధర ఉండే బ్రాండ్లు అమ్మేందుకు వైన్స్‌లకు అనుమతి ఉన్నప్పటికీ ఈ టానిక్‌ చైన్‌షాపుల్లో మాత్రం లభించేవి కావు. ఇలా భాగస్వామ్యం తీసుకునే ప్రక్రియలో, తనిఖీల విషయంలో తమకు సహకరించిన ఆరుగురు అధికారులకు అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మంచి పోస్టింగులే కాదు... ఆమ్యామ్యాలను కూడా సమర్పించుకున్నట్టు తెలిసింది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న ఒకరి బంధువులు కూడా ఈ టానిక్‌ చైన్‌షాపుల్లో భాగస్వామిగా ఉన్నారని సమాచారం. 

ఏకంగా ఐదేళ్లకు లైసెన్సు... ఆ తర్వాత రెన్యువల్‌ 
సాధారణంగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ఏ4 షాపులు (వైన్స్‌), వాకిన్‌ స్టోర్‌లకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సులిస్తారు. బార్లకు కూడా రెండేళ్లకే లైసెన్స్‌ ఇచ్చినా గడువు ముగిసిన తర్వాత వాటిని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, టానిక్‌ ఎలైట్‌ వాకిన్‌ స్టోర్‌కు ఏకంగా ఐదేళ్ల లైసెన్సు మంజూరు చేశారు. ఈ మేరకు జీవోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలా ఐదేళ్ల పాటు లైసెన్సు ఇవ్వడమే కాదు మళ్లీ ఆ లైసెన్సును రెన్యువల్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇదే కాదు... రాష్ట్రంలోని అన్ని వైన్స్‌షాపులకు ఉన్న టర్నోవర్‌ ట్యాక్స్‌ (టీవోటీ)లోనూ ఈ ఎలైట్‌ షాపునకు మినహాయింపులిచ్చారు. మూడేళ్ల పాటు ఎంత వ్యాపారం చేసినా టీవోటీ వసూలు చేయవద్దన్న వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనతోనే రూ.వందల కోట్ల వ్యాపారాన్ని యథేచ్ఛగా టానిక్‌ చేసుకున్నా ఒక్క రూపాయి కూడా ఎక్సైజ్‌ శాఖకు అదనపు పన్ను చెల్లించే పనిలేకుండా పోయింది. ఇప్పుడు ఈ పన్నుల కోసమే జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. అనివార్యంగా ఎక్సైజ్‌ శాఖ కూడా నోటీసులు జారీ చేస్తూ గత తప్పిదాలను సవరించుకునే పనిలో పడింది. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)