Breaking News

ఉండేనా.. ఊడేనా?

Published on Sat, 07/11/2026 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ నేతల భవితవ్యం డోలాయమానంలో పడింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమితులైన వీరి రెండేళ్ల పదవీకాలం ఈ నెలలో ముగుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి మొదలై 20వ తేదీ వరకు 33 మంది కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీకాలం ముగుస్తోంది. కానీ, ఇప్పటివరకు ఆయా కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తారా? వీరినే కొనసాగిస్తారా అన్నది తేలలేదు. 

పదవుల కోసం పడరాని పాట్లు
ఓవైపు పదవీకాలం అయిపోతుండడంతో తమ పదవులు నిలబెట్టుకునేందుకు ప్రస్తుత కార్పొరేషన్‌ చైర్మన్లు పడరాని పాట్లు పడుతున్నారు. తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మొదలు, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో సహా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కానీ రాష్ట్ర పార్టీ పెద్దలు ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడంతో తమ పదవులు ఉంటాయో ఊడతాయోననే సందిగ్ధంలో ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం కళ్లలో వత్తులు వేసుకొని వారంతా ఎదురుచూస్తున్నారు.  

రెన్యువల్‌ ఉంటుందా..? 
పార్టీ అధికారంలోకి వచ్చేందుకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసిన నాయకులు, అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ టికెట్లు పొందలేని వారు, పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా పనిచేసిన వారికి తొలి దఫాలో చైర్మన్లుగా అవకాశమిచ్చారు. 2024, జూలైలో వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో 2026 జూలైలో రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. అయితే, ఈ కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. వీరి పదవీకాలం మరో ఆరునెలలు ఉందన్నప్పటి నుంచే ఈ పదవుల నియామకంపై ఊహాగానాలు, చర్చోపచర్చలు జరిగాయి. తొలుత అవకాశమిచ్చిన వారెవరికీ మరోమారు రెన్యూవల్‌ ఉండదని, ఎవరినీ మళ్లీ కొనసాగించేది లేదని సీఎం రేవంత్‌ తన సన్నిహితులతో చెప్పినట్టు తొలుత వార్తలు వచ్చాయి.

మరోవైపు చైర్మన్ల విషయంలో గ్రేడింగ్‌ జరిగిందని, మెరుగైన పనితీరు కనబర్చిన వారు, పార్టీకి అవసరమైన వారు కలిపి ఓ 10–11 మంది రెన్యూవల్‌ అవుతారనే చర్చ ఆ తర్వాత జరిగింది. వీరి పదవీకాలం ముగిసేలోపే ఉత్తర్వులు వస్తాయని పార్టీ నేతలంతా భావించారు. కానీ, అలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ప్రస్తుత కార్పొరేషన్‌ చైర్మన్లు మరో ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ చైర్మన్లుగా పనిచేస్తున్న ముగ్గురికి వారి వారి నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ సమస్య ఏర్పడనుంది.

నిర్మలా జగ్గారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, ఈరవత్రి అనిల్‌ల నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నందున వారికి అధికారిక ప్రొటోకాల్‌ ఉండాలంటే అధికార పదవి తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరి పదవీకాలం ముగిసేలోపే ఉత్తర్వులు వస్తాయనే చర్చ కూడా జరిగింది. కానీ, అలాంటిదేమీ జరగకపోవడంతో కార్పొరేషన్‌ చైర్మన్లు నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో శనివారమే కార్పొరేషన్లకు చైర్మన్ల ఉత్తర్వులు వెలువడతాయనే వార్తలు వస్తున్నాయి.

కానీ, అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన కసరత్తుకు ముగింపుగా ఈనెల 15వ తేదీన సీఎం రేవంత్, ఇన్‌చార్జ్‌ మీనాక్షి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌లు భేటీ అవుతారని, ఈ సమావేశంలో ఎన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలి? ఎంతమందికి రెన్యూవల్‌ చేయాలి? ఎంతమందిని తప్పించాలి? కొత్తగా ఎవరికి చైర్మన్లుగా అవకాశం కల్పించాలి? చైర్మన్లతోపాటు డైరెక్టర్‌ పోస్టుల నియామకంలో ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.  

మిగిలినవీ ముగిస్తారా?  
వివిధ కార్పొరేషన్లు, కమిషన్లు, కుల ఫెడరేషన్లు, నగరాభివృద్ధి అథారిటీలు కలిపి దాదాపు 130 సంస్థలకు చైర్మన్లను నియమించే అవకాశముంది. ఇందులో 37 కార్పొరేషన్లు, 17 కుల ఫెడరేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ నేతలను చైర్మన్లుగా నియమించారు. విద్యుత్‌ సంస్థలు, ఇరిగేషన్, ఆరోగ్య శాఖకు సంబంధించిన 12 కార్పొరేషన్లకు ఐఏఎస్‌ అధికారులను నియమించారు. టీజీపీఎస్సీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ కమిషన్లు, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఫుడ్‌ కమిషన్, ఉమెన్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, లోకాయుక్త, మీడియా అకాడమీ లాంటి 13 సంస్థలకు కూడా మండళ్లు ఏర్పాటయ్యాయి.

ఇవి పోను మరో నాలుగైదు కార్పొరేషన్లకు ఇంకా పదవీ కాలం ముగిసేందుకు సమయముంది. ఇవన్నీ మినహాయించగా, ప్రస్తుతం మరో 45 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశముంది. ఇప్పుడు పదవీకాలం ముగిసే 33 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లు, పాలకమండళ్లను నియమించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అయ్యే వాటితో పాటు మరో 30 వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను ఈ దఫా ప్రకటించవచ్చనే చర్చ కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ మేరకు దాదాపు 60కిపైగా కార్పొరేషన్లను పరిగణనలోకి తీసుకొని సామాజిక సమీకరణల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)