Breaking News

ఊరుంది.. పేరు లేదు!

Published on Sat, 02/21/2026 - 12:37

ఇది వీర్నపల్లి మండలం రంగంపేట వద్ద వరిపొలం. రంగంపేట ఊరి పక్కనే ఇళ్లను ఆనుకుని ఈ పొలం ఉంది. ఆ భూమి యజమాని వరి పంట వేసి పొలంలో ముదురుకలుపు తీస్తుంది. కానీ వారికున్న భూమి పాస్‌పుస్తకంలో మాత్రం రంగంపేట పేరు లేదు. రెవెన్యూ గ్రామం కంచర్ల అని ఉంది. ఊరుంది.. భూమి ఉంది.. కానీ ఆ భూమి సర్వే నంబర్‌ మాత్రం కంచర్ల రెవెన్యూ గ్రామంలో ఉంది. ఆన్‌లైన్‌లో యూరియా నమోదుకు రంగంపేట అని నమోదు చేస్తే యాప్‌ తీసుకోవడం లేదు. 

భూమి పాస్‌బుక్కులో ఉన్న కంచర్ల పేరు నమోదు చేస్తేనే యాప్‌ ఓకే చేస్తుంది. ఊరున్నా.. రెవెన్యూ శివారు పక్క ఊరు ఉండడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 89 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా.. కేవలం 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని రైతులకు రెవెన్యూ శాఖ జారీ చేసిన పట్టాదార్‌ పాస్‌పుస్తకాల్లో రెవెన్యూ గ్రామం పేరు ఉంది. సదరు రైతులు ఉండే ఊరు పేరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

(సిరిసిల్ల): మూడు దశాబ్దాలుగా భూచట్టాలను ఎన్ని మారినా రెవెన్యూ గ్రామాల పేర్లు మార్చడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. 1998 ప్రాంతంలో ఆర్వోఆర్‌ (రికార్డు ఆఫ్‌ రైట్స్‌) చట్టం వచ్చింది. అప్పట్లో ప్రతీ రైతుకు ఫొటోతో కూడిన పాస్‌బుక్కును జారీ చేశారు. పాత తరం నాటి తోక పాస్‌బుక్కుల స్థానంలో పెద్ద పాస్‌పుస్తకాలు జారీ చేశారు. కానీ రెవెన్యూ గ్రామాల పేర్లు మార్చలేదు. ఆ తరువాత భూ యజమాన్య చట్టం ప్రకారం మళ్లీ కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ధరణి చట్టం తెచ్చి మరోమారు కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేశారు. ఇప్పుడు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా క్షేత్రస్థాయిలోని సమస్యలను పరిష్కరించడం లేదు. తాతల కాలం నాటి రెవెన్యూ గ్రామాలే కొనసాగుతోండగా.. పెద్ద ఊర్ల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ కనిపించడం లేదు. 

అనేక సమస్యలకు మూలం..
వీర్నపల్లి మండలం రంగంపేట రెవెన్యూ రికార్డుల్లో లేక కంచర్ల పేరు ఉండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూముల క్రయవిక్రయాలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే సమయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రంగంపేట జనాభా 1,387 ఉండగా.. ఓటర్ల సంఖ్య 756 ఉంది. రైతులకు జారీచేసిన పాస్‌పుస్తకాల 303 వరకు ఉన్నాయి. కానీ అన్ని పాస్‌పుస్తకాల్లో కంచర్ల పేరే ఉంది. రంగంపేట ఊరు ఉనికి కరువైంది.

ప్రతీ గ్రామసభలో తీర్మానం
రంగంపేట గ్రామపంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతీ గ్రామసభలో రెవెన్యూ గ్రామం కావాలని తీర్మానం చేసి పంపుతున్నాం. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు యూరియా బస్తాలకు ఆన్‌లైన్‌ రావడంతో కంచర్ల అని నమోదు చేస్తేనే కంప్యూటర్‌ తీసుకుంటుంది. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ గ్రామంగా రంగంపేటను గుర్తించాలి. 
– సుతారి మల్లయ్య, రైతు, రంగంపేట

ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు
మా గ్రామంలో మాజీ మంత్రి కేటీఆర్‌ 2020 జూలై 7న భూపట్టాల పంపిణీ చేశారు. 300 మంది రైతులం పట్టాలు అందుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఆ పట్టా పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో రైతుబంధు రావడం లేదు. యూరియా తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది.    
– నందగిరి అంబాదాస్, 
రైతు, రంగంపేట

ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం 
రెవెన్యూ రికార్డుల్లో రెవెన్యూ గ్రామం పేరు వస్తుంది. గ్రామపంచాయతీల పేర్లు రావడం లేదు. ఇది చాలా కాలంగా ఇలాగే ఉంది. రెవెన్యూ గ్రామాల పేర్లను మార్చాలంటే.. ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకుని, రాష్ట్ర స్థాయిలో గెజిట్‌ జారీ చేయాల్సి ఉంటుంది. మా స్థాయిలో చేసే సమస్య కాదిది. ఒక్క రెవెన్యూ గ్రామం పరిధిలో అనేక గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. పాస్‌పుస్తకంలో ఉన్న రెవెన్యూ గ్రామం పేరును నమోదు చేస్తే.. ఏ సమస్య లేకుండా.. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చు.
– గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్‌

భూముల స్వరూపం
గ్రామాలు: 260
రెవెన్యూ గ్రామాలు: 171
మొత్తం సర్వేనంబర్లు: 91,416
రెవెన్యూ భూమి: 4,68,532 ఎకరాలు
రైతులు : 1,03,140 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)