Breaking News

గ్రేటర్‌లో ఓట్ల గల్లంతు!

Published on Mon, 06/22/2026 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 కార్యక్రమంలో కీలకమైన ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాకముందే భారీ సంఖ్యలో ఓటర్ల పేర్ల గల్లంతు సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా భారీ ‘శుద్ధికరణ’కు లోనుకానుందని ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల ఓటర్ల మ్యాపింగ్‌ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,38,62,322 మంది (70.54%) ఇప్పటివరకు మ్యాపింగ్‌ అయ్యారు. ఇంకా 99,64,126 మంది ఓటర్లు (29.46%) మ్యాపింగ్‌కు అందుబాటులోకి రాలేదు.  

మూడు జిల్లాల్లో.. 
హైదరాబాద్‌ జిల్లాలో 25.24 లక్షలు, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో 16.78 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.29 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్‌ పెండింగ్‌లో ఉంది. ఓటర్ల మ్యాపింగ్‌ జరగాల్సిన వారిలో 57.31 లక్షల (57.5 శాతం) మంది ఈ మూడు జిల్లాల ఓటర్లే కావడం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యల్ప మ్యాపింగ్‌ ఈ జిల్లాల్లోనే జరిగింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 43.67శాతం, హైదరాబాద్‌ జిల్లాలో 46.69 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.68 శాతమే మ్యాపింగ్‌ జరిగింది. స్థానిక బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) సైతం మిగిలిన ఓటర్లకు సంబంధించిన ‘ఆచూకీ’తెలియరావడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

అద్దె ఇళ్లల్లో నివా సం ఉండటం, తరచూ ఉద్యోగాలు మారడం, ఐటీ ఉద్యోగుల వలసలు, విద్యార్థుల వలసలు, ఒకే వ్యక్తి బహుళ చిరునామాలు కలిగి ఉండటం వంటి కారణాలతో ఈ మూడు జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల సిబ్బంది సహాయాన్ని ఎన్నికల సంఘం కోరింది. 

మేడ్చల్‌లో మరింత తీవ్రమా? 
ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసి రెండు జాబితాల్లో ఓటర్ల సమాచారాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సరిపోల్చి చూస్తున్నారు. రాష్ట్రంలో మ్యాపింగ్‌ జరిగిన 2.38 కోట్ల ఓటర్లలో 89.88లక్షల (37.67శాతం) మందికి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసాలు/లోపాలున్నట్టు గుర్తించారు. వీరిలో 28.55 లక్షల (32శాతం) మంది ఓటర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలవారే. రంగారెడ్డి జిల్లాలో 11.44 లక్షలు, హైదరాబాద్‌ జిల్లాలో 8.65 లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో 8.45 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు తేలింది. మేడ్చల్‌ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జిల్లాలో 13 లక్షలు మంది ఓటర్లు మ్యాపింగ్‌ పూర్తైతే 8.45 లక్షల (65శాతం) మంది వివరాల్లో తేడాలున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక శాతం వ్యత్యాసాలు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం.  

గ్రామీణ జిల్లాల ముందంజ 
గ్రామీణ జిల్లాలు ఓటర్ల మ్యాపింగ్‌లో ముందంజలో ఉండటమే కాకుండా అతి తక్కువగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. మహబూబాబాద్‌లో 94.54శాతం, జనగాంలో 93.44 శాతం, మెదక్‌లో 89.98 శాతం, నారాయణపేటలో 85.54 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.92శాతం ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తైంది. గ్రామీణ జిల్లాల్లో జనాభా స్థిరంగా ఉండటం, వారిని స్థానిక బీఎల్‌ఓలు సులభంగా చేరుకోగలగడంతో మ్యాపింగ్‌ వేగంగా జరిగింది.  

రాజకీయాలు, ఎన్నికలపై తీవ్ర ప్రభావం 
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లుండగా, 1.13 కోట్ల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలవారే. రాష్ట్రంలో ఇంకా మ్యాపింగ్‌ మిగిలిన ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతానికే చెందినవారే కాగా, వివరాల్లో వ్యత్యాసాలున్న ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వారే కావడం గమనార్హం.

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై ఈ జిల్లాల్లో జరిగే ఓటరు జాబితా మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా భారీ మార్పుకు లోనైతే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సైతం మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)