స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Breaking News
‘సర్’ లోపాలమయం
Published on Fri, 07/03/2026 - 02:40
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)లో పారదర్శకత లేదని, జవాబుదారీతనం కరువైందని, విధానపరమైన పలు లోపాలున్నాయని ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకులు, రచయిత డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు. దీనిని పౌర సమాజం, బుద్ధి జీవులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు 105వ జయంతిని పురస్కరించుకుని గురువారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని ఓ ఆడిటోరియంలో ఆయన స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు.
‘ఎస్ఐఆర్ 2025–26: భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేయడమా?’అనే అంశంపై పరకాల ప్రసంగించారు. పీవీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారతదేశపు గొప్ప నాయకులలో పీవీ ఒకరని దగ్గర నుంచి గమనించే అవకాశం లభించడం ఒక ‘అర్హత లేని భాగ్యం’అని అభివర్ణించారు.
విస్తృత చర్చ జరగాలి
వందేమాతరంపై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటి ఇటీవలి కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై విస్తృతంగా చర్చ జరగాలని పరకాల అన్నారు. 2002లో చేపట్టిన విస్తృత సవరణతో పోలిస్తే ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావిస్తూనే.. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అన్నారు.
సమాధానం చెప్పేవారే లేరు..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ముగించగా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకం మిగిలి పోయాయని, ఆలోపే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసిపోయాయని పరకాల చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను జాబితాల నుంచి తీసేశారని వీటిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరన్నారు. అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు సూచించే గణాంకాలను వెల్లడిస్తూ, ఈ ధోరణులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబేడ్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితానే పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ (అకడమిక్) ప్రొఫెసర్ జి.పుష్ప చక్రపాణి, రిజి్రస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags : 1