అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
Published on Sun, 06/15/2025 - 09:14
సనత్నగర్(హైదరాబాద్): ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఓ మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏలూరు జిల్లా అడ్డగిద్దల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజు, కొక్కిణి శ్రావణి (30) దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు నడుస్తుండడంతో మానసికంగా కుంగిపోయింది.
ఈ క్రమంలో గత ఆరు నెలల క్రితం శ్రావణిని ఎర్రగడ్డ జనప్రియా అపార్ట్మెంట్స్లో ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస్, దుర్గాలు తమ వద్దకు తీసుకువచ్చారు. గత ఆరు నెలలుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటూ స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మూడు రోజుల క్రితం వీరు ఊరిలో ఉన్న అల్లుడు రాజు వద్దకు వెళ్లి తమ కూతురు కాపురం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒప్పించి అతనిని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు.
అయితే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపం చెందిన శ్రావణి శనివారం ఉదయం 8.30 గంటలకు జనప్రియా అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags : 1