Breaking News

గురుకులాలకు తాళాలు!

Published on Fri, 06/13/2025 - 03:30

సాక్షి, హైదరాబాద్‌: అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు గురుకుల పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. వేసవి సెలవుల అనంతరం గురువారం గురుకులాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు గేట్లకు వేసిన తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రిన్సిపాళ్లు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్చలు జరపడంతో మధ్యాహ్నం తర్వాత కొన్నిచోట్ల యజమానులు తాళాలు తీశారు. 

గురుకులాలూ షురూ..: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పాఠశాల లు తెరుచుకున్నాయి. మిగతా స్కూళ్లతో పాటు గురుకుల విద్యా సంస్థలు సైతం పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకల్లా తరగతులు ప్రారంభం కావాల్సి ఉండడంతో గంట ముందే ప్రిన్సిపాళ్లు పాఠశాలలకు చేరుకున్నారు. 

అయితే ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు భవనాలకు పాఠశాల సిబ్బంది వేసిన తాళాల స్థానంలో భవన యజమానుల తాళాలు కనిపించాయి. అద్దె బకాయిలు చెల్లించే వరకు తాళాలు తీసే ప్రసక్తే లేదని యజమానులు ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి స్పష్టం చేశారు. మరికొందరు తమ భవనాలు వెంటనే ఖాళీ చేయాలని తేల్చిచెప్పడంతో పాఠశాలల సిబ్బంది, బడికెళ్లేందుకు వచ్చిన పిల్లలు బయటే నిలబడాల్సి వచ్చింది.

జనరల్‌ మినహా అన్నీ అద్దె భవనాల్లోనే..
రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా... విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. విద్యాశాఖ పరిధిలోని జనరల్‌ గురుకులాలన్నీ శాశ్వత భవనాల్లోనే నిర్వహిస్తుండగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలకు సంబంధించిన 662 గురుకుల విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 

ఇందులో పలు పాఠశాలలకు యజమానులు తాళాలు వేశారు. అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళాలు తొలగిస్తామని స్పష్టం చేయగా... మరికొందరు మాత్రం భవనాలను ఖాళీ చేయాలని తేల్చిచెప్పారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు గేటు బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూ.215 కోట్ల బకాయిలు
ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు నెలకు సగటున రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బకాయిల మొత్తం రూ.215 కోట్లకు చేరింది. పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై సంబంధిత యజమానులు గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కాలేదు. 

ఈ నేపథ్యంలోనే అద్దె చెల్లించాలంటూ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. 63 గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలంటూ ఆయా భవనాల యజమానులు గత నెలలోనే సంబంధిత ప్రిన్సిపాళ్లకు తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల కాలేదు.

కాస్త ఉపశమనం..
గురుకుల పాఠశాలలకు తాళాలు పడే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సంబంధించిన అద్దె బకాయిల్లో కొంతమేర చెల్లించేలా చర్యలు తీసుకుంది. దాదాపు 10 నెలల బకాయిలు ఉండగా.. మూడు నుంచి నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులకు ఆర్థికశాఖ మోక్షం కలిగించింది. ఈ మేరకు నిధులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విడుదల చేసింది. 

వారు భవనాల యజమానులకు చెల్లించేందుకు గురువారం హడావుడిగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే యజమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే త్రైమాసికంలో (జూలై నెలాఖరులో) మిగిలిన బకాయిలు విడుదల చేస్తారని, అప్పటివరకు ఓపికపట్టాలని నచ్చజెప్పడంతో, చాలాచోట్ల మధ్యాహ్నం తర్వాత యజమానులు తాళాలు తీశారు.

చేసిన పనులకు బిల్లులు రాలేదని ..
– సిద్దిపేట జిల్లాలో బడికి కాంట్రాక్టర్‌ తాళం
చేర్యాల (సిద్దిపేట):పాఠశాల అభివృద్ధిలో భాగంగా రెండేళ్ల క్రితం చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ బడికి తాళం వేసిన ఘటన సిద్దిపేట జిల్లా ఆకునూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకునూరు గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండేళ్ల క్రితం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద కాంట్రాక్టర్‌ డైనింగ్‌ హాల్‌ నిర్మాణం చేపట్టి టైల్స్, విద్యుత్‌ పనులు చేశారు. 

ఇందుకు సంబంధించి రూ.8.5 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టర్‌ పలుమార్లు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ గురువారం పాఠశాల పునఃప్రారంభం రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకముందే పాఠశాల గేటుకు తాళం వేశారు. అయితే విద్యాశాఖ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నీరేష్‌ వెంటనే అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడించడంతో తాళం తీశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)