బొల్లినేని శ్రీనివాస గాందీపై క్రిమినల్‌ కేసు

Published on Fri, 07/10/2026 - 01:06

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో (ఈడీ) పని చేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై అకారణంగా దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లినేని శ్రీనివాస గాందీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయనపై సీబీఐ, ఈడీలతో పాటు పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీ సహా ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఏడుగురిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు నమ్మక ద్రోహం ఆరోపణలతో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. 

నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన పీటీ నారాయణరాజు ఫిర్యాదు మేరకు ఈ కేసు రిజిస్టర్‌ అయినప్పటికీ నేరం కేపీహెచ్‌బీ కాలనీలోని మై ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా కార్యాలయం కేంద్రంగా సాగడంతో దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌ ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌కు (ఈఓడబ్ల్యూ) బదిలీ చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

సందేహం తీర్చమనడమే పాపమైంది.. 
వ్యాపారి అయిన పీటీ నారాయణరాజు తన స్నేహితుడికి జీఎస్టీకి సంబంధించిన సందేహం ఉండటంతో జీఎస్టీ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో గాంధీ తన నిర్మాణ రంగ వ్యాపారం వివరాలను రాజుకు వివరించి, తాను ఏర్పాటు చేయబోయే భాగస్వామ్య సంస్థలో చేరాలని కోరాడు. నిర్మాణ రంగంలో తన అనుభవాన్ని వివరించడంతో రాజు అంగీకరించారు.

ఈ క్రమంలో 2021 జూలై 21న కేపీహెచ్‌బీలోని ఉమామహేశ్వరి ప్లాజాలో మై ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా పేరిట భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో కె.విజేత 9 శాతం, జి.రాజ్‌కుమార్‌ 33 శాతం, కె.విద్యుల్లత 25 శాతం, వీటి రాజశేఖర్‌ బాబు, నారాయణరాజు 9 శాతం చొప్పున, ఎన్‌.రాజశేఖర్‌ 15 శాతం వాటాలు కలిగి ఉన్నారు. ఒప్పందం ప్రకారం జి.రాజ్‌కుమార్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించగా, జి.రాజ్‌కుమార్, నారాయణ రాజు సంస్థ తరఫున సంతకాలు చేసే అధికారం పొందారు. 

అన్ని పత్రాలు గాంధీ అధీనంలోకి.. 
మై ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా స్థాపించిన కొన్నాళ్లకే బొల్లినేని శ్రీనివాస గాంధీతో ఆర్థిక వివాదాలు తలెత్తడంతో రాజశేఖర్‌ సంస్థ నుంచి వైదొలిగారు. 2022 ఫిబ్రవరి 1న భాగస్వామ్య సంస్థను పునర్వ్యవస్థీకరించి, బి.పవన నిషితను కొత్త భాగస్వామిగా చేర్చారు. ఈ పునర్వ్యవస్థీకరణలో కూడా జి.రాజ్‌కుమార్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా కొనసాగారు. కాగా సంస్థకు సంబంధించిన పాత ఒప్పందాలు, అవగాహన పత్రాలను శ్రీనివాస గాంధీ తన అ«దీనంలోకి తీసుకున్నారు.

అనంతరం కొత్త ఒప్పందాలు, ఎంఓయూలపై సంతకాలు చేయాలని నారాయణరాజుని కోరారు. రాజు బ్యాంకు లావాదేవీల వివరాలు కోరగా.. అన్ని ఆర్థిక లావాదేవీలు సక్రమంగానే జరుగుతున్నాయంటూ గాంధీ నమ్మబలికారు. ఆయన కుటుంబసభ్యులే మెజారిటీ వాటాదారులుగా ఉండటంతో ఆ మాటలను నమ్మిన నారాయణరాజు మిన్నకుండిపోయారు. 

నిధులు ఉన్నా హెచ్‌ఎండీఏకు చెల్లించకుండా... 
అదే ఏడాది మై ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి భవన అనుమతి ఫీజుగా రూ.6,74,90,827 చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఐదు విడతల్లో చెల్లించేందుకు అవకాశం ఉందని లేఖ వచ్చింది. అప్పటికి సంస్థ ఖాతాలో తగిన నిధులు ఉన్నప్పటికీ, ఆ మొత్తాన్ని హెచ్‌ఎండీఏకు చెల్లించేందుకు బొల్లినేని, ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆ నిధుల్ని తమ కుటుంబ సంస్థలకు మళ్లించే ప్రయత్నం చేశారు. దీంతో వారి అసలు ఉద్దేశం ఫ్లాట్ల నిర్మాణం కాదని, వినియోగదారులను మోసం చేయడమేనని నారాయణరాజు గ్రహించారు.

అనంతరం జి.రాజ్‌కుమార్‌ ఆ సంస్థలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపును గుర్తించినప్పటికీ ఇతర భాగస్వాములకు చెప్పకుండా 2024 మార్చి 6న బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో అదే రోజు మై ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా సంస్థను మరోసారి పునర్వ్యవస్థీకరించిన గాందీ.. బి.శిరీష, కె.విజిత, కె.విద్యుల్లత, రాజశేఖర్‌ బాబు, నారాయణరాజు, బి. పవన నిషిత, ఐ.సత్యజిత్, సాయికృష్ణ వర్మ, రాధిక, బి.సాయి మానస్వితలను భాగస్వాముల్ని చేశారు.

ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంచి...
ఈసారి విజిత, నారాయణ రాజు మేనేజింగ్‌ పార్ట్‌నర్స్‌గా నియమితులయ్యారు. నారాయణరాజుతో పాటు సత్యజిత్, వర్మ సంతకాలు చేసే అధికారం పొందగా, బ్యాంకు కార్యకలాపాల బాధ్యత పవన నిషిత, రాజశేఖర్‌ బాబుకు అప్పగించారు. అయితే నారాయణరాజును కేవలం నిర్మాణ పనులు చూసుకోవడం, ఒప్పందాలపై సంతకాలు చేయడానికే పరిమితం చేసిన గాంధీ.. ఆర్థిక వ్యవహారాలు, వినియోగదారులతో లావాదేవీలు, బ్యాంకు కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. ఆ బాధ్యతల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

2025 మార్చి నుంచి సంస్థ ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వాలని నారాయణరాజు పలుమార్లు కోరినా బొల్లినేని తప్పించుకున్నారు. 2025 నవంబర్‌ 16 నుంచి వాట్సాప్‌ సందేశాలు, ఈ–మెయిళ్ల ద్వారా భాగస్వాముల పెట్టుబడులు, వినియోగదారులకు తిరిగి చెల్లించిన మొత్తాలు, కొనుగోలుదారుల వివరాలు ఇవ్వాలని, భాగస్వాముల సమావేశం నిర్వహించాలని పదేపదే కోరినా స్పందించలేదు.  

నిధుల మళ్లింపును గుర్తించిన నారాయణరాజు
అనుమానం వచ్చిన నారాయణరాజు సంస్థ బ్యాంకు స్టేట్‌మెంట్లు సంపాదించి పరిశీలించారు. 2020–2022 మధ్య పెట్టుబడిదారుల నిధులు శ్యమంతక ఇన్‌ఫ్రాకు మళ్లించినట్లు, అలాగే శ్యమంతక ప్రొఫైల్స్‌ సంస్థకు కూడా భారీ మొత్తాలు బదిలీ చేసినట్లు గుర్తించారు. 2025 డిసెంబర్‌లో దేవదాసు బుడం, జోస్యుల సుధాకర్, యు.వీరాంజనేయ ప్రసాద్, కందకాని రాజేంద్ర కుమార్, దాసరి మూర్తి, శ్రీనివాస్‌ డి. నాయక్, లక్ష్మీ భవాని తాటినేని, మహీధర్‌ దేవరపల్లి, టి.సతీష్‌ బాబు, సంతోష్‌ ఎర్రం, శ్వేతా కిషోర్, రామదాసు రాంపల్లి తదితర వినియోగదారులు కంపెనీ పేరు లేకుండా చెక్కులు ఇవ్వడంతో పాటు నగదు కూడా చెల్లించినట్లు నారాయణ తెలుసుకున్నారు. 

గాందీ, ఆయన కుటుంబ సభ్యులు ఆ చెక్కులపై శ్యమంతక ఇన్‌ఫ్రా పేరు రాసి ఆ ఖాతాల్లో జమ చేసి, ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లు, నగదు మొత్తాలను కూడా కంపెనీ ఖాతాల్లో చూపకుండా వ్యక్తిగత ఆదాయంగా మార్చుకున్నారని నారాయణ రాజు తన ఫిర్యాదులో ఆరోపించారు.  

నిధుల మళ్లింపు దాచిపెట్టి.. 
నారాయణరాజు, ఆయన భార్య, కుమారుడు, రాజశేఖర్‌ బాబు ఈ ఏడాది సంక్రాంతి రోజున శ్రీనివాస గాంధీ ఇంటికి వెళ్లి నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై ప్రశ్నించారు. అప్పటికీ నిధుల మళ్లింపు విషయం దాచి పెట్టిన గాంధీ కొన్ని ఎంఓయూలపై నారాయణరాజు, రాజశేఖర్‌ బాబుతో సంతకాలు చేయించారు. దీంతో వినియోగదారులు ఫ్లాట్లు లేదా డబ్బు తిరిగి ఇవ్వాలని వీరిని అడిగే పరిస్థితి వచ్చింది.

బొల్లినేని శ్రీనివాస గాందీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పథకం ప్రకారం తనను ఆర్థికంగా నష్టపరిచారని నారాయణ రాజు పేర్కొన్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించగా వారు భాగస్వామ్య ఒప్పందంలో 70 శాతం వాటాదారులుగా చూపించినప్పటికీ, ఆ మేరకు పెట్టుబడులు పెట్టలేదని, బదులుగా భారీ మొత్తాలను తమ కుటుంబ సంస్థలకు మళ్లించారని ఆరోపించారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)