నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
SRH: ‘రోడ్ల’ మీద బౌలింగ్ చేయించడం మానుకోండి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Published on Fri, 03/28/2025 - 16:07
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ (Michael Vaughan) కీలక సూచనలు చేశాడు. ‘రోడ్ల’పై బౌలింగ్ చేయించే వైఖరికి స్వస్తి పలకాలని.. బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని హితవు పలికాడు. మేటి బౌలర్లు జట్టులో ఉన్నా.. బౌలింగ్ కోసం స్పెషలిస్టు బ్యాటర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సన్‌రైజర్స్ తమ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సొంత మైదానం ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, రాయల్స్ కూడా అంత తేలికగ్గా తలవంచలేదు. 242 రన్స్ చేసింది.
రైజర్స్‌కు చేదు అనుభవం
ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం రైజర్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఉప్పల్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో కమిన్స్ బృందం 190 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు.. రైజర్స్ బ్యాటింగ్ పవర్ రుచిని వారికే చూపిస్తూ.. ఆట అంటే ఇట్టా ఉండాలి అన్నట్లుగా లక్నో స్టార్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ పవర్ హిట్టర్‌ను కట్టడి చేయాలని రైజర్స్ బౌలర్లు ఎంతగా కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. 26 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. ఆఖరికి కమిన్స్ అద్భుత బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఎట్టకేలకు సన్‌రైజర్స్‌కు బ్రేక్ దొరికింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 16.1 ఓవర్లలోనే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.
Raining sixes in Hyderabad... but by #LSG 🌧
Nicholas Pooran show guides LSG to 77/1 after 6 overs 👊
Updates ▶ https://t.co/X6vyVEvxwz#TATAIPL | #SRHvLSG | @LucknowIPL pic.twitter.com/K2Dlk5AXQw— IndianPremierLeague (@IPL) March 27, 2025
400కు పైగా పరుగులు
ఇక తొలి రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ బ్యాటర్ల గురించి పక్కనపెడితే.. బౌలర్లు మాత్రం బాధితులుగా మిగిలిపోయారు. మహ్మద్ షమీ, కమిన్స్, హర్షల్ పటేల్, ఆడం జంపా.. ఇలా జట్టులోని బౌలింగ్ విభాగం అంతా కలిసి ఇప్పటికే 400 (242, 193)కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.
కాగా లక్నోతో మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కూడా బౌలింగ్‌కు రావడం గమనార్హం. అతడు ఒకే ఒక్క బంతి వేయగా ప్రత్యర్థి బ్యాటర్ ఫోర్ బాదాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఆర్‌హెచ్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి.
తమ బౌలర్లు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్లు రోడ్లమీద బౌలింగ్ చేస్తున్నారు. జంపా ఆటను నాశనం చేశారు. షమీ ఓవర్‌కు 12 పరుగుల చొప్పున ఇచ్చాడు. అందుకే సన్‌రైజర్స్ జాగ్రత్త పడాలి.
రోడ్ల మీద బౌలింగ్ చేయించడం మానుకోండి
సొంత మైదానంలో రోడ్ల మీద బౌలింగ్ చేయించే పనులు మానుకోవాలి. ఇది ఇలాగే కొనసాగితే వేరే వేదికలపై మీ బౌలర్లు రాణించలేరు. అప్పటికే వాళ్లు ఆత్మవిశ్వాసం కోల్పోయి.. వేరే చోట బౌలింగ్ చేయాలంటే భయపడిపోయే స్థితికి వస్తారు’’ అని వాన్ చురకలు అంటించాడు.
ఇక లక్నోతో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో బ్యాటింగ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నాకు తెలిసి కమిన్స్‌కు కొత్త బౌలర్ దొరికి ఉంటాడు. వాళ్లు సొంత గ్రౌండ్‌లో ఐదో మ్యాచ్ ఆడే సరికి ఇషాన్ కిషన్ మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వస్తదేమో!.. ఎందుకంటే మిగతా బౌలర్లు ..‘ఈ రోడ్ల మీద మేము బౌలింగ్ చేయలేము అని చేతులెత్తేస్తారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకు వాన్ వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: BCCI: అతడికి ఈసారి టాప్ గ్రేడ్.. తొలిసారి వీళ్లకు వార్షిక కాంట్రాక్టులు!
Tags : 1