Breaking News

బెంగళూరు బ్రహ్మాండంగా...

Published on Sun, 05/04/2025 - 01:20

బెంగళూరు: కోహ్లి ఉన్న బెంగళూరు, ధోని ఆడుతున్న చెన్నై మధ్య మ్యాచ్‌ ఎలా జరిగితే బాగుంటుందో అలా జరిగిందీ మ్యాచ్‌. పెద్ద స్కోర్లు... మెరుపు ఇన్నింగ్స్‌లు, ఆఖరి ఓవర్‌ ఉత్కంఠ ఇవన్నీ కలగలిపి ప్రేక్షకులకు క్రికెట్‌ విందు ఇచ్చిన ఐపీఎల్‌ పోరులో యశ్‌ దయాళ్‌ ఆఖరి 3 బంతులే చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించాయి. 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన చెన్నైకి యశ్‌ చెక్‌ పెట్టి 3 సింగిల్సే ఇవ్వడం విశేషం. ఒత్తిడిని జయించిన అతని బౌలింగే చివరకు బెంగళూరును 2 పరుగుల తేడాతో గెలిపించింది. 

ముందుగా ఆర్‌సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఉప్పెనల్లే ఉరిమాడు. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), జాకబ్‌ బెథెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి ఓడింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)  పోరాడారు.

బెథెల్, కోహ్లిల ‘పవర్‌’ ప్లే 
బెంగళూరు ఓపెనర్లు బెథెల్, కోహ్లి మెరుపులు మెరిపించడంతో ‘పవర్‌ ప్లే’ పరుగెత్తిపోయింది. ఇద్దరి జోరుకు 4.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. 6 ఓవర్లలో 73/0 స్కోరు చేసింది. బెథెల్‌ 28 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 97 పరుగులు జతచేశారు. ఆ తర్వాత కోహ్లి 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.  

ఒకే ఓవర్లో 33 పరుగులు... 
18 ఓవర్లలో స్కోరు 159/5. ఆ తర్వాత ఒకే ఒక్కడి వీరబాదుడుతో స్టేడియమంతా ఊగిపోయింది. ఖలీల్‌ వేసిన 19వ ఓవర్లో ప్రతీ బంతిని దంచికొట్టిన షెఫర్డ్‌ 4 సిక్స్‌లు, 2 బౌండరీలతో 32 పరుగులు (6, 6, 4, 6, 6 నోబాల్, 0, 4) బాదేశాడు. నోబాల్‌తో కలిపి మొత్తం 33 పరుగులు వచ్చాయి. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో కూడా షెఫర్డ్‌ దంచుడుకు 4, 0, 4, 6, 6లతో 21 పరుగులు వచ్చాయి. ఈ రెండు ఓవర్లలోనే 54 పరుగులు వచ్చాయి. 

చెన్నై శరవేగంగా... 
సూపర్‌కింగ్స్‌ పరుగుల వేట మూడో ఓవర్‌ నుంచి ఊపందుకుంది. భువనేశ్వర్‌ నాలుగో ఓవర్లో ఆయుశ్‌ 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 26 పరుగులు వచ్చాయి. 4.1 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. స్వల్ప వ్యవధిలో షేక్‌ రషీద్‌ (14), స్యామ్‌ కరన్‌ (5) అవుటైనా... ఆయుశ్‌కు జడేజా జతయ్యాక చెన్నై శరవేగంగా  లక్ష్యం వైపు సాగిపోయింది. 25 బంతుల్లోనే ఆయుశ్‌ ఫిఫ్టీ పూర్తయ్యింది. 29 బంతుల్లో అతని అర్ధసెంచరీ సాధించాడు. 

ఆయుశ్‌ జోరుకు ఇన్‌గిడి కళ్లెం వేయగా, మరుసటి బంతికి బ్రెవిస్‌ (0) ఎల్బీ అయ్యాడు. అక్కడినుంచి ఫలితం ఇరు జట్లతో దోబూచులాడింది. యశ్‌ దయాళ్‌ 2 సింగిల్స్‌ ఇచ్చి ధోని (12)ని అవుట్‌ చేశాడు. శివమ్‌ దూబే (8 నాటౌట్‌) వచ్చీ రాగానే సిక్సర్‌ బాదాడు. నోబాల్‌ కావడంతో అదనంగా మరో పరుగు, ఓ బంతి కలిసొచ్చినా...దయాళ్‌ ఆఖరి 3 బంతుల్ని అద్భుతంగా వేయడంతో దూబే, జడేజాలు సింగిల్స్‌ మాత్రమే తీయగలిగారు. 

స్కోరు వివరాలు 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెథెల్‌ (సి) బ్రెవిస్‌ (బి) పతిరణ 55; కోహ్లి (సి) అహ్మద్‌ (బి) స్యామ్‌ కరన్‌ 62; పడిక్కల్‌ (సి) జడేజా (బి) పతిరణ 17; పటిదార్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) పతిరణ 11; జితేశ్‌ (సి) బ్రెవిస్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 7; టిమ్‌ డేవిడ్‌ నాటౌట్‌ 2; షెఫర్డ్‌ నాటౌట్‌ 53; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 213.  వికెట్ల పతనం: 1–97, 2–121, 3–144, 4–154, 5–157. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–65–0, అన్షుల్‌ 3–0–25–0, నూర్‌ 4–0–26–1, జడేజా 3–0–26 –0, కరన్‌ 3–0–34–1, పతిరణ 4–0–36–3. 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ఆయుశ్‌ (సి) కృనాల్‌ (బి) ఇన్‌గిడి 94; రషీద్‌ (సి) షెఫర్డ్‌ (బి) కృనాల్‌ 14; కరన్‌ (సి) జితేశ్‌ (బి) ఇన్‌గిడి 5; జడేజా నాటౌట్‌ 77; బ్రెవిస్‌ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 0; ధోని (ఎల్బీ) (బి) దయాళ్‌ 12; దూబే నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–51, 2–58, 3–172, 4–172, 5–201 బౌలింగ్‌: కృనాల్‌ 3–0–24–1, భువనేశ్వర్‌ 4–0–55–0, దయాళ్‌ 4–0–41–1, ఇన్‌గిడి 4–0–30–3, సుయశ్‌ 4–0–43–0, షెఫర్డ్‌ 1–0–18–0.  

ఆలస్యంగా అప్పీల్‌ చేసి... 
అద్భుతంగా ఆడుతున్న ఆయుశ్‌ వెనుదిరిగిన తర్వాత డెవాల్డ్‌ బ్రెవిస్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. విజయానికి 22 బంతుల్లో 42 పరుగులు కావాలి. దూకుడుకు మారుపేరైన బ్రెవిస్‌ చెలరేగితే చెన్నై గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయి. ఇన్‌గిడి వేసిన బంతి అతని ప్యాడ్స్‌కు తాకడంతో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు.

సందేహంగా ఉండటంతో వెంటనే అతను ‘రివ్యూ’ కోరాల్సింది. కానీ సింగిల్‌ కూడా పూర్తి చేసిన అతను ఆ తర్వాత కాస్త ఆలోచించి ‘రివ్యూ’ కోసం సైగ చేశాడు. కానీ అప్పటికే నిర్ణీత 15 సెకన్లు పూర్తి అయిపోయాయి. దాంతో అంపైర్‌ నితిన్‌ మేనన్‌ ఆ రివ్యూను తిరస్కరించాడు. అయితే తర్వాతి రీప్లేలో అది ‘అంపైర్స్‌ కాల్‌’గా చూపించింది. అంటే రివ్యూ తీసుకున్నా బ్రెవిస్‌ అవుటయ్యేవాడే!  

14  అర్ధ సెంచరీకి షెఫర్డ్‌ తీసుకున్న బంతులు. ఐపీఎల్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ. గతంలో యశస్వి జైస్వాల్‌ 13 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా... కేఎల్‌ రాహుల్, ప్యాట్‌ కమిన్స్‌ కూడా 14 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నారు. 

62 ఐపీఎల్‌లో కోహ్లి అర్ధ సెంచరీల సంఖ్య. వార్నర్‌ (62)తో సమంగా అగ్రస్థానానికి చేరాడు.  

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X రాజస్తాన్‌  
వేదిక: కోల్‌కతా
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 
పంజాబ్‌ X లక్నో 
వేదిక: ధర్మశాల 
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)