Breaking News

PBKS Vs RCB: ఫైనల్‌ వేటలో...

Published on Thu, 05/29/2025 - 01:18

ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్‌ ఫైనల్‌ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గురువారం క్వాలిఫయర్‌–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరాయి. 

లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ కింగ్స్‌ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్‌... తుదిపోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 

ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్‌ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. 

టాప్‌–3పైనే ఆశలు... 
ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్‌ సలహాలు... లోపల శ్రేయస్‌ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్‌ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ వస్తున్న శ్రేయస్‌ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్‌ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. 

ఇన్‌గ్లిస్‌ మంచి టచ్‌లో ఉండగా... నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్‌ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో  అర్ష్ దీప్ సింగ్, కైల్‌ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్‌ రాకతో స్పిన్‌ విభాగం పటిష్టమైంది. 

విరాట్‌పై పెను భారం 
లీగ్‌ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్‌ కోహ్లి... 18వ సీజన్‌లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్‌... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 

తన వికెట్‌ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్‌ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్‌ అగర్వాల్, రజత్‌ పాటీదార్, జితేశ్‌ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్‌ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. 

గాయం కారణంగా టిమ్‌ డేవిడ్‌ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఫినిషర్‌ పాత్ర పోషించనున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించిన జోష్‌ హాజల్‌వుడ్‌ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్‌తో కలిసి అతడు పేస్‌ భారాన్ని మోయనుండగా... సుయాశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. 

తుది జట్లు (అంచనా) 
పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ (కెప్టెన్ ), ప్రియాన్ష్  ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్,  అర్ష్ దీప్, చాహల్‌. 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, జితేశ్, కృనాల్‌ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్‌ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్‌ శర్మ.  

పిచ్, వాతావరణం 
ముల్లాన్‌పూర్‌ మైదానంలో ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.   

ఐపీఎల్‌లో నేడు (క్వాలిఫయర్‌ –1)
పంజాబ్‌ X  బెంగళూరు
వేదిక: ముల్లాన్‌పూర్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)