మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. 101 ఖాతాలు! ప్రధాని మోదీ ప్రశంసలు
Published on Tue, 08/09/2022 - 12:06
Ravindra Jadeja- Rivaba Solanki: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ కూతురి పుట్టినరోజును పురస్కరించుకుని 101 మంది చిన్నారి తల్లులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు సిద్ధమైన జడేజా దంపతుల నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వారికి లేఖ రాశారు.
కూతురి బర్త్‌డే సందర్భంగా..
భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన రవీంద్ర జడేజా 2016, ఏప్రిల్ 17న రివాబా సోలంకిని వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2017, జూన్ 8న కుమార్తె కున్వరిబశ్రీ నిధ్యానబ జన్మించింది. ఈ క్రమంలో ఈ ఏడాది కూతురు ఐదో పుట్టినరోజు సందర్భంగా తన భార్య రివాబా 101 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరిచినట్లు జడేజా వెల్లడించాడు.
గుజరాత్‌లోని జామానగర్‌లో గల పోస్ట్ ఆఫీసులో చిన్నారుల పేరిట ఈ మేరకు ఖాతాలు తెరిచినట్లు జడ్డూ పేర్కొన్నాడు. తమకు ఈ అవకాశం దక్కినందుకు ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ అకౌంట్లలో 11000 వేల చొప్పున జడేజా దంపతులు డబ్బు డిపాజిట్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వీరిని అభినందిస్తూ లేఖ రాశారు. ఈ విషయాన్ని రవీంద్ర జడేజా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ప్రధాని లేఖను పంచుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఈ లేఖలో.. ‘‘కూతురి పుట్టినరోజు సందర్భంగా మీరు 101 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు తెరవడం గొప్ప విషయం.
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న మీరు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక జడేజా ఆట విషయానికొస్తే ఆసియా కప్-2022 టోర్నీలో ఆడే జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు.
సుకన్య సమృద్ధి యోజన
ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తెచ్చిన పథకం.. సుకన్య సమృద్ధి యోజన. బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదంతో 2015లో ప్రారంభమైంది. వడ్డీ 7.6 శాతం. కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఖాతా తెరిచిన ఏడాది నుంచి 14 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది. సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. అంతే కాదు వడ్డీకి కూడా మినహాయింపు ఉంటుంది.
పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవవచ్చు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.
చదవండి: Asia Cup 2022 India Squad: అతడిని ఎంపిక చేయాల్సింది.. నేనే గనుక సెలక్టర్ అయితే..: మాజీ కెప్టెన్
Kind words 🙏🏻 pic.twitter.com/mXjBIPYW7K
— Ravindrasinh jadeja (@imjadeja) August 8, 2022
Tags : 1