ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్
Breaking News
కేఎల్ రాహుల్ అద్భుత శతకం
Published on Mon, 02/09/2026 - 15:16
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది.
325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్‌లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్ రవిచంద్రన్‌తో పాటు రాహుల్ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ను కర్ణాటకవైపు మళ్లించింది.
స్మరణ్ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్ పాటిల్ (31 నాటౌట్) స్మరణ్‌కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్‌తో తలపడుతుంది.
కర్ణాటకతో మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్ హెర్వాద్కర్ (60) ఒక్కడే రాణించాడు.
అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్ అగర్వాల్ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్ అవస్తి, తుషార్ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు.
ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ ఆనంద్ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్ కోటియన్ (48 నాటౌట్), తుషార్ దేశ్‌పాండే (47), ముషీర్ ఖాన్ (49), యశస్వి జైస్వాల్ (36), అఖిల్ హెర్వాద్కర్ (33), సిద్దేశ్ లాడ్ (25), సూర్యాంశ్ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, కావేరప్ప తలో 2, శిఖర్ షెట్టి 3, ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు.
Tags : 1