Breaking News

రంజీల్లో ‘స్టార్స్‌’ వార్‌!

Published on Tue, 01/28/2025 - 05:51

ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్‌ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్‌కు సిరాజ్‌ పేస్‌ తోడైతే... కేఎల్‌ రాహుల్‌ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్‌రౌండ్‌ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్‌లేనా? రసవత్తర మ్యాచ్‌లు కావా? కచ్చితంగా అవుతాయి. 

తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్‌ పండగే! చూస్తుంటే గంభీర్‌ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి.   

న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్‌ మ్యాచ్‌లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్‌కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్‌ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్‌ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్‌ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. 

అందులో కింగ్‌ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్‌ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్‌ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ ధ్రువీకరించారు. 

కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ (ప్రస్తుత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోచ్‌)తో కలిసి బ్యాటింగ్‌లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్‌గా బ్యాటింగ్‌ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన రిషభ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్‌ మెషిన్‌’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్‌ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. 

హైదరాబాద్‌ పేస్‌కా బాస్‌... సిరాజ్‌ 
జస్‌ప్రీత్‌ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్‌ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్‌ ఇప్పుడు హైదరాబాద్‌ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ బరిలోకి దిగుతున్నాడు. నాగ్‌పూర్‌ ట్రాక్‌ పేస్‌కు అవకాశమిచ్చే వికెట్‌. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్‌ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్‌... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.  

జడేజా వరుసగా రెండో మ్యాచ్‌ 
ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ ఆడిన స్టార్, సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్‌లో అతని ఆల్‌రౌండ్‌ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్‌ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్‌తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్‌ను హిట్టర్‌ రియాన్‌ పరాగ్‌ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్‌ ఐపీఎల్‌ ద్వారానే అందరికంటా పడ్డాడు.   

ఫిట్‌నెస్‌తో రాహుల్‌ రెడీ 
కర్ణాటక తరఫున ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే కేఎల్‌ రాహుల్‌ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్‌ ఓపెనర్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్‌ చివరి సారిగా 2020లో బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్స్‌ మ్యాచ్‌ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్‌ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్‌ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్‌ పడిక్కల్, సీమర్‌ ప్రసిధ్‌ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.  

రోహిత్, జైస్వాల్, అయ్యర్‌ గైర్హాజరు 
ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్‌లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు 
అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి.   
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)