Breaking News

లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కా

Published on Mon, 06/03/2024 - 04:14

సాక్షి, అమరావతి: పేదలకు, పెత్తందారులకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరుగా దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం ఖాయమని... ఏ లెక్కన చూసుకున్నా మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం పక్కా అని అధిక శాతం జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చిచెప్పాయి. 

రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఓట్లతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇవన్నీ స్పష్టం చేశాయి. దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌కు చెందిన టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీ 14 లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంటుందని.. ఎన్‌డీఏ కూటమి 48 శాతం ఓట్లతో 11 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని వెల్లడయింది. 

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తరహాలోనే దేశ వ్యాప్తంగా విస్తృత యంత్రాంగం ఉన్న దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌... రాష్ట్రంలో 15–17 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని.. ఎన్‌డీఏ కూటమి 8–9 లోక్‌సభ స్థానాలకు పరిమితం అవుతుందని తన ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తేల్చిచెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 వంటి మీడియా సంస్థలు, సెఫాలజిస్టులు, ఆరా వంటి ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థలు నిర్వహించిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమయింది. 

బీజేపీ భజన చేసే జాతీయ మీడియా ఎగ్జిట్‌ పోల్స్‌ తద్భిన్నం.. 
బీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, జీన్యూస్‌.. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న నెట్‌వర్క్‌లోని సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 వంటి రెండు మూడు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని తేల్చడం గమనార్హం. రాజధాని అంశంతోపాటు స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో సానుభూతి వచి్చందని.. అదే ఎన్‌డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని ఆ సంస్థలు విశ్లేషించాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఇటు వైఎస్సార్‌సీపీగానీ అటు ఎన్‌డీఏగానీ రాజధాని అంశాన్ని ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. 

ఇక స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా చిన్నపాటి బంద్‌లు గానీ, ర్యాలీలు గానీ, నిరసనలు గానీ జరగనేలేదు. తప్పు చేశాడు కనక అరెస్టయ్యాడనే రీతిలో జనం స్పందించారు. దీంతో హైదరాబాద్‌లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూపన్లు ఇచ్చి మరీ ‘ఐటీ ఉద్యోగుల’ పేరిట స్థానికంగా ఒక ఈవెంట్‌లా నిరసన కార్యక్రమం చేశారు. అలాంటిది ఈ రెండు అంశాలూ ప్రభావం చూపిస్తున్నాయని, అందుకే కూటమి గెలుస్తోందని ఈ జాతీయ ఛానెళ్లు చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్లూ తప్పవుతుందని రాష్ట్ర వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు.  

కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? 
విచిత్రమేంటంటే ‘ఇండియా టుడే– మై యాక్సిస్‌’ సంస్థ శనివారంనాడు దేశవ్యాప్త ఎగ్జిట్‌పోల్స్‌ను వెలువరించింది. దీన్లో బీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని చేర్చటమే లక్ష్యంగా ఒకో రాష్ట్రంలో స్వీప్‌ అంటూ ముందుకు వెళ్లిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పైపెచ్చు రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీకి 2 నుంచి 4 లోక్‌సభ స్థానాలు వస్తాయని మాత్రమే చెప్పిన ఇండియా టుడే సంస్థ... ఆ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ గుర్తును కూడా ఆప్‌ గుర్తయిన చీపురుగా చూపించింది. విశేషమేంటంటే దీన్నే తెలుగుదేశం పార్టీ తన ట్విటర్‌ ఖాతాలోనూ పోస్ట్‌ చేసుకుంది. 

మరి పార్టీ గుర్తు విషయంలో కూడా జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మేదెలా? ఇక కొన్ని రాష్ట్రాల విషయంలోనైతే కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అక్కడ వాస్తవంగా ఉన్న మొత్తం స్థానాలకన్నా ఎక్కువ స్థానాలు ఎన్‌డీఏ గెలుస్తుందని చూపించటాన్ని ఇప్పటికే ట్విటర్లో పలువురు ట్రోల్‌ చేస్తున్నారు కూడా. ఇదే ఇండియాటుడే–  మై యాక్సిస్‌ సంస్థ 2021లో బెంగాల్లో చేసిన ఎగ్జిట్‌పోల్స్, 2023లో ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ పూర్తిగా రివర్సయ్యాయనేది ఇక్కడ గమనార్హం. 

నిజానికి ఈ సర్వేను ప్రసారం చేస్తున్నపుడు ‘ఇండియాటుడే’ ఛానెల్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సర్వే ఫలితాలతో విభేదించారు కూడా. తాను ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్ర స్థాయిలో పర్యటించానని, సర్వేలో చెప్పినట్లుగా పరిస్థితులు అక్కడ లేవని పేర్కొన్నారు. గ్రామీణ, మహిళా ఓటర్లు పూర్తిగా వైఎస్సార్‌ సీపీవైపే ఉన్నారని, అది తన పర్యటనలో కనిపించిందని సర్దేశాయ్‌ చెప్పగా... చంద్రబాబు నాయుడి అరెస్టు పట్ల జనంలో సానుభూతి పెల్లుబుకిందని, అదే కూటమి విజయానికి కారణమవుతోందని ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన ప్రదీప్‌ గుప్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు. 

తాజాగా బీజేపీ కూటమికి దేశంలో అత్యంత భారీగా స్థానాలు వస్తాయని పేర్కొన్న జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో చిత్రవిచిత్రమైన తప్పులు కనిపించాయి. ఇండియాటుడే గ్రూప్‌లోని ఆజ్‌ తక్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో తమిళనాడులో కాంగ్రెస్‌ 9 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ 13–15 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని తేల్చడంతో చర్చలో పాల్గొన్న వారే విస్తుపోయారు. రాజస్థాన్‌లో ఉన్నదే 25 లోక్‌సభ స్థానాలైతే.. ఆ రాష్ట్రంలో 33 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో టుడేస్‌ చాణక్య వెల్లడించడం గమనార్హం. 

జార్ఖండ్‌లో సీపీఐ (ఎంఎల్‌) ఒక స్థానంలో పోటీ చేస్తే.. రెండు నుంచి మూడు స్థానాల్లో ఆపార్టీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించింది. హర్యానాలో ఉన్నదే 10 లోక్‌సభ స్థానాలైతే 16–19 స్థానాల్లో ఎన్‌డీఏ విజయం సాధిస్తుందని జీన్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో తేల్చడం విస్మయకరమే. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నవే నాలుగు లోక్‌సభ స్థానాలైతే.. అక్కడ ఎన్‌డీఏ 6–8 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీన్యూస్‌ తేల్చింది. విశేషమేంటంటే ఈ సంస్థలన్నీ రాష్ట్రంలో కూటమికే మెజారిటీ లోక్‌సభ స్థానాలు దక్కుతున్నాయని చెప్పాయి. 

లోతుగా పరిశీలించినట్లయితే ఈ జాతీయ మీడియా సంస్థలకు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి యంత్రాంగమూ లేదు. వీటిలో చాలావరకూ ప్రజల అభిప్రాయాన్ని ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌ కాల్స్‌ ద్వారా తెలుసుకుని.. వాటినే ఎగ్జిట్‌ పోల్స్‌గా వెల్లడించాయి. గ్రామీణ ఓటర్లు, మహిళలు, వైఎస్సార్‌ సీపీకి ఎప్పుడూ అండగా ఉండే బలహీనవర్గాలు ఇలాంటి సర్వేల్లో పాల్గొనే అవకాశం తక్కువ. దీన్ని బట్టి చూస్తే.. ఈ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌... జూన్‌ 4న పూర్తి స్థాయిలో తిరగబడతాయని స్పష్టంగానే చెప్పొచ్చు. 


వైఎస్సార్‌సీపీ ఓడిపోయే అవకాశమే లేదు..
రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరిశ్రమలను తెస్తూ... గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ... ఐదేళ్లుగా కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలను జనం పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో రుజువయింది. అర్హతే ప్రమాణికంగా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో 60 శాతానికి పైగా వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలుస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. 

గ్రామీణ ప్రాంత ప్రజలు.. మహిళల్లో వైఎస్సార్‌సీపీకి అత్యంత ఆదరణ ఉందని.. ఇదే ఆపార్టీ విజయానికి బాటలు వేస్తుందని ఇవే జాతీయ మీడియా సంస్థలు గతంలో విశ్లేషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం ఓట్లు పోల్‌ కావడం.. మహిళలు ఎన్‌డీఏ కూటమి కంటే వైఎస్సార్‌సీపీకి 12 శాతం అధికంగా వేశారని.. ఇది ఆపార్టీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని ఆరా మస్తాన్, చాణక్య పార్ధదాస్‌లు కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే తాము ఓడిపోయే అవకాశమే లేదని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.  

కౌంటింగ్‌ నాడు అక్రమాలకు తెగబడటానికే! 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వస్తుండటంతో పలువురు సెఫాలజిస్టులను చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ బెదిరించినట్లు వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సర్వే సంస్థ లోకేశ్‌ బెదిరింపులను తట్టుకోలేక... ఫలితాలను అట్నుంచి ఇటు మార్చి కూటమి గెలుస్తున్నట్లుగా ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ రెండ్రోజుల్లో తేలే ఫలితాల కోసం చినబాబు– చంద్రబాబు ఎందుకు ఇంతలా బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశాన్ని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. 

తామే గెలుస్తున్నామనే భ్రమలు కల్పించటం ద్వారా వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌లో నిరుత్సాహాన్ని నింపి... కౌంటింగ్‌ రోజున అవసరమైతే వారిని ప్రలోభపెట్టో, బెదిరించో తమ పబ్బం గడుపుకోవాలనేది తండ్రీ కొడుకుల ఆలోచనగా చెబుతున్నారు. ఈసీ ఎలాగూ తమకే సహకరిస్తుంది కనక ఎలాంటి దారుణాలకైనా వెనకాడకూడదన్నది వీళ్ల ఆలోచనగా చెబుతున్నారు. అయితే పురిట్లోనే సంధికొట్టినట్లు చాలామంది సెఫాలజిస్టులు వీరి బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్‌సీపీ గెలుస్తున్నదని చెప్పటం ‘బాబు’లిద్దరికీ మింగుడుపడటం లేదు.  

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)