Breaking News

1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే 

Published on Thu, 05/29/2025 - 01:52

న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్‌ రూమ్‌ నిండా నోట్ల కట్టలే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో భారీగా నగదు వెలుగు చూసిన ఉదంతంపై సుప్రీంకోర్టు కమిటీ పేర్కొన్న అంశాలివి! గత మార్చి 14న ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో అగ్నిప్రమాదం సంభవించడం, పోలీసులకు, మంటలార్పుతున్న సిబ్బందికి స్టోర్‌ రూమ్‌లో భారీ సంఖ్యలో కాలిపోయిన నోట్లకట్టలు కనిపించడం తెలిసిందే. 

ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో జస్టిస్‌ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆయన్ను విధులకు దూరం పెట్టడమే గాక ఆరోపణలపై విచారణకు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక న్యాయమూర్తితో నాటి సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కమిటీ నియమించారు. అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు.

 జస్టిస్‌ వర్మ వివరణను కూడా జతచేశారు. కమిటీ నివేదికలోని అంశాలను ఇండియాటుడే వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కమిటీ నిర్ధారించింది. స్టోర్‌ రూములో భారీ సంఖ్యలో లెక్కచూపని నోట్ల కట్టలు బయటపడటం నిజమేనని పేర్కొంది. ‘‘అదంతా లెక్కచూపని డబ్బే. అదెక్కడిదో చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జస్టిస్‌ వర్మదే. 

కానీ ఆ డబ్బుకు ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు. పైగా నోట్లకట్టలతో తనకు ఏ సంబంధమూ లేదని, అదంతా ఎవరో కుట్రపూరితంగా చేసిన పని అని చెప్పుకొచ్చారు’’ అని కమిటీ పేర్కొంది. ‘‘జస్టిస్‌ వర్మపై అభియోగాలు నిజమే అనేందుకు సరిపడా ఆధారాలు లభించాయి. 

ఈ అభియోగాలు ఆయన్ను అభిశంసించాల్సినంత తీవ్రమైనవి’’ అని స్పష్టం చేసింది. నివేదిక నేపథ్యంలో రాజీనామా చేయాల్సిందిగా కోరగా జస్టిస్‌ వర్మ నిరాకరించడం, దాంతో ఆయనను అభిశంసించాలంటూ కేంద్రానికి జస్టిస్‌ ఖన్నా సిఫార్సు చేయడం తెలిసిందే. అందుకోసం చట్టపరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

నివేదిక ఏం చెప్పిందంటే... 
‘‘అగ్నిప్రమాదం జరిగిన రాత్రి జస్టిస్‌ వర్మ నివాసంలో ఆయన కూతురితో పాటు మొత్తం 17 మంది ఉన్నారు. డబ్బు దొరికిన స్టోర్‌ రూమ్‌ పూర్తిగా జస్టిస్‌ వర్మ, ఆయన కుటుంబం నియంత్రణలోనే ఉంది. ప్రమాద సమయంలో దానికి లాక్‌ చేసి ఉంది. జస్టిస్‌ వర్మ, ఆయన కుటుంబానికి తప్ప ఇంకెవరూ దాన్ని తెరిచే అవకాశమే లేదు. పైగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఎవరో బయటినుంచి స్టోర్‌ రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం కూడా లేదు. నోట్ల కట్టలు స్టోర్‌ రూమ్‌ నిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి గది పొడవునా కనీసం అడుగున్నర ఎత్తున పరుచుకుని ఉన్నట్టు తుగ్లక్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. 

గదిలోని షెల్ఫ్‌ మీద సగం కాలిపోయిన నోట్లు కూడా అడుగున్నర ఎత్తున ఉన్నాయని చెప్పారు. గదిలో స్విచ్‌బోర్డు సమీపంలో ఉన్న మద్యం సీసాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. కాలిపోయిన నోట్ల కట్టలను వెంటనే గది నుంచి తొలగించేందుకు సిబ్బంది ప్రయతి్నంచారు. అగ్నిప్రమాదం గురించి జస్టిస్‌ వర్మకు ఆయన పీఏ రాజేందర్‌సింగ్‌ కర్కీ తొలుత సమాచారమిచ్చారు. ఆ రాత్రంతా ఆయనకు కాల్స్‌ చేస్తూ, ఎప్పటికప్పుడూ సమాచారమిస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా నేరం జరిగినట్టు రుజువుల్లేవనే, జస్టిస్‌ వర్మ అందుబాటులో లేరనే కారణంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష, ఎల్రక్టానిక్‌ సాక్ష్యాల ఆధారంగా జస్టిస్‌ వర్మపై అభియోగాలు నిజమేనని కమిటీ నిర్ధారణకు వచ్చింది.’’

ఇప్పుడేం జరుగుతుంది? 
జస్టిస్‌ వర్మ అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆ మేరకు సీజేఐ ఖన్నా చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలే రాజ్యసభ చైర్మన్‌కు, లోక్‌సభ స్పీకర్‌కు పంపినట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓ కమిటీ వేస్తారు. దాని నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఓటింగ్‌లో అభిశంసన తీర్మానం నెగ్గితే జస్టిస్‌ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.  
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు