మమతా బెనర్జీకి బంపర్‌ ఆఫర్‌..!

Published on Fri, 06/05/2026 - 07:16

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్టీలో చీలికతో కుంగిపోయిన మమతా బెనర్జీకి ఇప్పుడు అనూహ్యమైన అండ లభించింది. ఒకప్పుడు తనపై కుట్రలు పన్నాడని, బీజేపీతో చేతులు కలిపాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసిన నేతే.. ఇప్పుడు మమతా బెనర్జీ కోసం తన ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌కతాలోని భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం అసెంబ్లీ సభ్యురాలు కాదు. మళ్లీ సభలో అడుగుపెట్టాలంటే ఏదైనా ఉప ఎన్నికలో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె నందిగ్రామ్‌(సువేందు పోటీ చేసిన రెండో స్థానం.. రాజీనామా కూడా చేశారు) నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు కూడా పెరుగుతుండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురై.. ప్రస్తుతం ‘ఆమ్‌ జనతా ఉన్నయన్‌ పార్టీ’ (ఏజేయూపీ)ని నడిపిస్తున్న హుమాయున్‌ కబీర్‌ సంచలన ప్రకటన చేశారు. ముర్షిదాబాద్‌ జిల్లాలోని నవడా, రెజీనగర్‌ స్థానాల నుంచి గెలిచిన ఆయన.. అవసరమైతే రెజీనగర్‌ సీటుకు రాజీనామా చేసి మమతా బెనర్జీని అక్కడి నుంచి అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.

“మమతా బెనర్జీ నన్ను సంప్రదిస్తే రెజీనగర్‌ నుంచి ఆమెను అసెంబ్లీకి పంపగలను. నందిగ్రామ్‌లో పోటీ చేస్తే ఆమె గెలుపు కష్టమే. కానీ నా నియోజకవర్గంలో ఆమె విజయాన్ని నేను ఖాయం చేస్తా” అని కబీర్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు, “నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మమతా బెనర్జీయే. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి నన్ను బాధిస్తోంది” అంటూ తన విధేయతను కూడా చాటుకున్నారు.

హుమాయున్‌ కబీర్‌పై టీఎంసీ గతంలో చేసిన ఆరోపణలు చిన్నవి కావు. బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు భారీ మొత్తంలో నిధులు స్వీకరించాడని, రాజకీయ కుట్రలో భాగస్వామి అయ్యాడని తృణమూల్‌ కాంగ్రెస్‌ స్టింగ్‌ వీడియోలు విడుదల చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదాల కారణంగానే ఎంఐఎం కూడా ఆయనతో పొత్తును తెంచుకుంది. అయితే కబీర్‌ మాత్రం అవన్నీ కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన వీడియోలేనని కొట్టిపారేశారు.

అయినప్పటికీ, తనపై టీఎంసీ చేసిన ఆరోపణలు, బహిష్కరణ, రాజకీయ దాడులను పక్కనబెట్టి అదే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సహాయం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

హుమాయున్‌ కబీర్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి. టీఎంసీతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం కొనసాగిన ఆయన, తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కబీర్‌.. గత ఏడాది ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు నమునాతో మసీదు నిర్మిస్తానన్న వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

ఇదిలా ఉండగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది. 58 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించినప్పటికీ, మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలని పలువురు స్పష్టం చేశారు. తమ వ్యతిరేకత అభిషేక్‌ బెనర్జీపైనే తప్ప మమతాపై కాదని పేర్కొన్నారు. ఆమెను కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అవసరమైతే తిరుగుబాటు శిబిరంలో కొనసాగడంపైనా పునరాలోచిస్తామని హెచ్చరించారు.

ఒకవైపు సొంత పార్టీ తిరుగుబాటు వర్గం "మమతనే మా సుప్రీం లీడర్‌" అంటూ గళమెత్తుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుమాయున్‌ కబీర్‌ తన ఎమ్మెల్యే సీటునే ఆఫర్‌ చేయడం బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాటను ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)