More

Republic Day 2022: గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. ప్రధాని ప్రాణాలకు ప్రమాదం!

19 Jan, 2022 08:07 IST

రిపబ్లిక్‌ డేపై ఉగ్ర కన్ను 

ప్రధాని మోదీ లక్ష్యంగా డ్రోన్లతో దాడులు జరిగే చాన్స్‌

ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరిక 

న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్ని భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రతినిధులు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రమూకలతోనే ముప్పు పొంచి ఉందని, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరపడానికి ఉగ్ర సంస్థలు పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు తొమ్మిది పేజీల నివేదికని కేంద్రానికి పంపారు.  డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు  హాట్‌ ఎయిర్‌ బెలూన్లు, పారాగ్లైడ్, యూఏవీలను రాజధాని పరిధిలో నిషేధించినట్టుగా మంగళవారం ఢిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ ఆస్తానా చెప్పారు.  డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థలను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదనపు భద్రత కోసం అత్యంత ఎల్తైన భవంతులపై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు.  

వేడుకలపై కోవిడ్‌ ఎఫెక్ట్‌  
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారీ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది 5,000–8,000 మందికి మాత్రమే వేడుకలకు అనుమతించాలని భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక అతిథులెవరూ లేకుండానే వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారికే వేడుకలకి హాజరవడానికి అనుమతి ఉంటుంది. చిన్నారుల్ని వేడుకలకి దూరంగా ఉంచనున్నారు. ఈసారి పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు బదులుగా 10.30కి వేడుకలు మొదలవుతాయి. రాజ్‌పథ్‌లో 10 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.  

చదవండి: జంతువులపై ‍ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది

శకటాల ఎంపిక నిపుణుల కమిటీదే : రాజ్‌నాథ్‌ 
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ శకటాల ప్రదర్శనకు ఈ ఏడాది అనుమతి లభించకపోవడంపై వివాదం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు ఉద్దేశపూర్వకంగానే తమ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చేస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్, మమతలకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 29 ప్రతిపాదనలు వస్తే 12 మాత్రమే ఆమోదం పొందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ థీమ్‌పై శకటాన్ని రూపొందిస్తే తిరస్కరించారంటూ ఘాటుగా విమర్శించిన మమతకు బదులిస్తూ నేతాజీకి నివాళిగా ఆయన జయంతి జనవరి 23 నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు.     
చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్‌ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Madhya Pradesh election 2023: రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం

దళిత అధికారిని కొట్టిన వ్యక్తికి టికెట్టా?

Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు

స్క్రీన్‌కు అతుక్కుంటే ప్రమాదమే!

Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్‌ టాప్‌