Breaking News

అంబేడ్కర్‌ భావజాలమే ఆదర్శం

Published on Sun, 05/18/2025 - 05:18

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ భావజాలమే నాకు ఆదర్శం. ఆయన మార్గమే నన్ను సీజేఐగా నిలబెట్టింది’’అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ తెలిపారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) శనివారం ఘనంగా సన్మానించింది. యువ న్యాయవాది నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగేదాకా తన న్యాయ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను సీజేఐ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్నతనంలో నాకు ఆర్కిటెక్ట్‌ కావాలనే కోరిక ఉండేది. 

కానీ అంబేడ్కర్‌ ఆశయ సాధన, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకతను తండ్రి సూచించడంతో న్యాయ వృత్తిని ఎన్నుకున్నా. న్యాయమూర్తిగా అవకాశం వచి్చనప్పుడు స్వీకరించాలా వద్దా అన్న మీమాంసలో పడ్డా. న్యాయవాదిగానే కొనసాగితే ఎంతో డబ్బు సంపాదించవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. అది నిజమే అయినా న్యాయమూర్తిగా అంబేడ్కర్‌ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లి సామాజిక, ఆర్థిక న్యాయ సాధనకు కృషి చేయొచ్చని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఆయన మాటలకు కట్టుబడి న్యాయమూర్తిగా మారాను. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడెంతో సంతోషిస్తున్నా’’అని చెప్పారు. 

ఖాళీలను భర్తీ చేయాలి 
న్యాయ నియామకాల్లో వైవిధ్యం పెరగాల్సిన అవసరాన్ని జస్టిస్‌ గవాయ్‌ నొక్కిచెప్పారు. ఆ పదవులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి మహిళలను వీలైనంత ఎక్కువగా సిఫార్సు చేయాలని హైకోర్టులకు సూచించారు.‘‘ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడా మాట్లాడాను. జడ్జి నియామకాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు వారి హైకోర్టుల్లో లేని పక్షంలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న ప్రతిభావంతుల నుంచి ఎంపిక చేసుకోవాలని సూచించాను. ఈ విషయంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాం కూడా’’అని వెల్లడించడంతో ఆహూతులు చప్పట్లతో అభినందించారు.   

వాగ్దానాలు నా నైజం కాదు 
సీజేఐ అయ్యాక చాలా మీడియా సంస్థలు తన ఇంటర్వ్యూ అడుగుతున్నట్టు జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు. ‘‘కానీ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడే కాదు, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుంచీ మీడియాకు దూరంగానే ఉండేవాడిని. మీడియా అంటే నాకేమీ భయం లేదు. కానీ నాకు సిగ్గు చాలా ఎక్కువ’’అని చెప్పి నవ్వులు పూయించారు. ‘‘అదీగాక ముందుగానే వాగ్దానాలు చేయడం నాకిష్టముండదు. అప్పట్లో ఇంటర్వ్యూల్లో అన్ని చెప్పాడు, చివరికి వాటిలో ఒక్కటీ చేయలేదని మీడియా మిత్రులే విమర్శించే ప్రమాదముంది. కనుక ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు నన్ను వాళ్లు క్షమిస్తారనే ఆశిస్తున్నా’’అంటూ చమత్కరించారు.

ప్రొటోకాల్‌ పక్కన పెట్టి మరీ జస్టిస్‌ త్రివేదికి సీజేఐ వీడ్కోలు 
→ చాంబర్‌కు వెళ్లి మరీ తోడ్కొని వచ్చారు 
→ వెల్లడించిన జస్టిస్‌ విశ్వనాథన్‌  
జస్టిస్‌ గవాయ్‌ వినమ్రత, నాయకత్వ లక్షణాలు సాటిలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ అన్నారు. శుక్రవారం రిటైరైన సహచర న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేదికి ప్రొటోకాల్‌ను పక్కన పెట్టిన మరీ ఘనంగా వీడ్కోలు పలికిన తీరే అందుకు గొప్ప నిదర్శనమన్నారు. ‘‘ప్రొటోకాల్‌ ప్రకారం ధర్మాసనం కార్యకలాపాలు ముగిశాక మధ్యాహ్నం 1.30 సమయంలో ఇతర న్యాయమూర్తులంతా సుప్రీంకోర్టు ఆవరణలోకి వచ్చి రిటైరయ్యే న్యాయమూర్తికి సాదరంగా వీడ్కోలు పలుకుతారు.

 జస్టిస్‌ త్రివేది విషయంలో మాత్రం సీజేఐ ఎవరూ ఊహించని పని చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న తన చాంబర్‌ నుంచి రెండు అంతస్తులు ఎక్కి మరీ స్వయంగా జస్టిస్‌ త్రివేది చాంబర్‌లోకి వెళ్లి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. దాంతో మేం కూడా ఆయన్ను అనుసరించాం. సీజేఐ సారథ్యంలో అందరమూ కలిసి ఆమెను కోర్టు ప్రాంగణం దాకా సాదరంగా తోడ్కొని వచ్చాం. గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో ఘనంగా వీడ్కోలు పలికాం. ఇది నా దృష్టిలో అత్యంత అర్థవంతమైన వీడ్కోలు’’అని చెబుతూ జస్టిస్‌ విశ్వనాథన్‌ భావోద్వేగానికి లోనయ్యారు.  
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)