Nepal Floods: ప్రియ అధికారి ఎవరు? 6 రోజులు.. 100 మిషన్లు..
Breaking News
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
Published on Sat, 06/06/2026 - 07:11
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి, సామాజిక కార్యకర్త లతా రజనీకాంత్ సరికొత్త పంథాలో ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. ‘తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు– అభివృద్ధి కోసం’ నినాదంతో ‘మక్కల్ మేడై’(ప్రజా వేదిక) పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని, సంఘాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సందేశంలో ఈ వేదిక లక్ష్యాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.
తమిళనాడు రాష్ట్రంపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరూ, సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న వారు ఈ వేదికపైకి రావాలని లతా రజనీకాంత్ పిలుపునిచ్చారు. తమ ‘మక్కల్ మేడై’ ఉద్యమంలో సామాన్యులంతా భాగస్వాములు కావచ్చన్నారు. మంచి ఆలోచనలు, దేశం కోసం శ్రమించే గుణం ఉన్న ఎవరైనా తమను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. సమాజంలో విభిన్న రంగాల్లో రాణించిన, అనుభవజ్ఞులైన సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు విలువైన అనుభవాలను, సలహాలను అందించాలని ఆమె కోరారు.
తమిళనాడు శ్రేయస్సు కోసం, సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పని చేయవచ్చని సూచించారు. రాష్ట్రం కోసం అంకితభావంతో పనిచేసే సమర్థులైన స్థానిక నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో లతా రజనీకాంత్ స్థాపించిన ఈ సరికొత్త సామాజిక వేదిక ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లోనే లత ఈ వేదికను ప్రకటించడం గమనార్హం. అంతకుముందు, రజనీకాంత్‌తో అన్నామలై సమావేశమవడం కూడా తమిళనాట ఆసక్తికరంగా మారింది.
Tags : 1