Breaking News

శత్రు శాటిలైట్లపై నిఘా 

Published on Mon, 02/09/2026 - 04:39

భూతలం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలో, గాల్లో ధ్వంసంచేసే గగనతల రక్షణ వ్యవస్థలు భారత్‌కు ఉన్నాయి. అయితే మన సైనిక స్థావరాల జాడ కనిపెట్టేందుకు నింగిలో సంచరించే శత్రుదేశాల కృత్రిమ ఉపగ్రహాల జాడ పసిగట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ గతంలో భారత్‌కు లేదు. తాజాగా ఆ శక్తిసామర్థ్యాల సముపార్జనలో భారత్‌ కీలక ముందడుగువేసింది. 

హైదరాబాద్‌ కేంద్రంగా ఆరంభమైన అంకుర సంస్థ ఒకటి కొత్త తరహా పరిశోధనలు చేస్తూ ఈ అప్రమత్త వ్యవస్థ అందిపుచ్చుకుంటోంది. అంతరిక్షంలో ఒకరకంగా అతిపెద్ద ఉపగ్రహంగా పేరొందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) జాడను కనిపెట్టి ‘అజిస్టా స్పేస్‌’తన సత్తా చాటింది. కక్ష్య మార్చుకుని భారత గగనతలంపై చక్కర్లు కొడుతూ కీలక సమాచారాన్ని సేకరించే అనుమానాస్పద శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు ఈ కొత్త స్పేస్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌(ఎస్‌ఎస్‌ఏ) పరిజ్ఞానం ఎంతగానో సాయపడుతుందని అజిస్టా స్పేస్‌ పేర్కొంది. 

గుర్తు తెలియని ఉపగ్రహాల జాడను గుర్తించడంతోపాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షణ పనులను పూర్తిచేసే పరిజ్ఞానాన్నే ఎస్‌ఎస్‌ఏగా పిలుస్తారు. తాజాగా భారత్‌ మీదుగా ఐఎస్‌ఎస్‌ పయనిస్తున్న సమయంలో దాని ఫొటోలను తమ ఏఎఫ్‌ఆర్‌ సెన్సార్‌ సాయంతో సేకరించామని అజిస్టా స్పేస్‌ ప్రకటించింది. భూమి ఫొటోలు తీయడానికి బదులు ఆకాశంలో నిర్దేశిత ప్రాంతం గుండా పయనించే, నిర్దేశిత ప్రాంతంపై నిఘా పెట్టే ఉపగ్రహాలను కనిపెట్టేందుకు నాన్‌–ఎర్త్‌ ఇమేజింగ్‌(ఎన్‌ఈఐ) పనుల కోసం ఈ అంకుర సంస్థ ఒక చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. దానిపై బిగించిన ఎలక్ట్రో–ఆప్టికల్‌ కెమెరా సాయంతో ఈ ఫొటోలను తీయగలిగింది.  

అత్యంత కచ్చితత్వంతో ఫొటోలు 
ఈనెల మూడో తేదీన రెండు వేర్వేరు సందర్భాల్లో ఐఎస్‌ఎస్‌ జాడను అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అప్పుడు తీసిన ఫొటోలను విడుదలచేసింది. 300 కిలోమీటర్లు, 245 కిలోమీటర్ల దూరాల నుంచి దాని ఫొటోలను తీసింది. దాని గమనానికి సంబంధించి మొత్తం 15 ఛాయాచిత్రాలను సేకరించింది. ఎదురుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుని సూర్యకిరణాలు తీక్షంగా తగులుతున్నా, అత్యంత వేగంగా అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తున్నాసరే దాని పొజిషన్‌ను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తూ ఫొటోలు తీయడం విశేషం. 

ఫొటోల సేకరణలో తమ ట్రాకింగ్‌ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ వెల్లడించింది. 2.2 మీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీయడం గమనార్హం. అంటే ఒక్కో పిక్సెల్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఫొటో తీసే సమయానికి అది కచ్చితంగా ఎంత దూరంలో ఉందనేది తేల్సిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇంతటి కచ్చితత్వంతో ఫొటోలు తీసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం కీలక ముందుడుగుగా నిపుణులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఇతర అనుమానాస్పద ఖగోళ వస్తువులు, గ్రహశకలాలు, శత్రు శాటిలైట్ల స్థితిగతులను అంచనా వేసే శక్తిసామర్థ్యాల మెరుగుకు ప్రేరణగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు చెప్పారు. 

శాటిలైట్‌ ట్రాకింగ్‌ అల్గారిథమ్‌ను మరింతగా మెరుగుపర్చుకుంటే అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలను సముపార్జించడం త్వరలోనే సాకారమవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్‌లో తయారై, భారత్‌ నుంచి పర్యవేక్షణలో ఉన్న ఒక బుల్లి ఉపగ్రహం ఐఎస్‌ఎస్‌ ఫొటోను తీయడం ఇదే తొలిసారి అని అజిస్టా స్పేస్‌ ప్రకటించింది. ఇది భారతదేశ ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది. 

భూకక్షల్లో వేలాదిగా కృత్రిమ ఉపగ్రహాలు పోగుబడుతుండటం, పాడైన, కాలంచెల్లిన ఉపగ్రహాలు ఢీకొని అంతరిక్ష చెత్త ఎక్కువవడం, వీటి మధ్య శత్రుదేశాల ఉపగ్రహాలు భారత్‌పై నిఘా పెట్టడం వంటి భిన్న పరిస్థితుల్లో ఆకాశంపై పెద్ద నిఘా కన్ను వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పేస్‌ సిచ్యువేషనల్‌ అవేర్‌నెస్‌(ఎస్‌ఎస్‌ఏ) పరిజ్ఞానంలో అగ్రగామిగా మారడం తక్షణావసరంగా మారింది. అజిస్టా స్పేస్‌ సంస్థ ఎలక్ట్రో–ఆప్టికల్‌ పేలోడ్‌లతోపాటు శాటిలైట్‌ వ్యవస్థలు, ఇమేజ్‌–ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు, నిఘా, పర్యవేక్షణ ఉపగ్రహాలకు సంబంధించిన విడిభాగాలనూ తయారుచేస్తోంది. ఇవి పౌర, రక్షణ, వాతావరణ సంబంధ ఉపగ్రహాలకు అక్కరకొస్తాయి.                   

  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)