అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!
Breaking News
అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు
Published on Fri, 07/31/2026 - 05:48
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతిలో పేదల పట్ల చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మరోసారి బట్టబయలైంది. అమరావతి ప్రాంతంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కోరలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిల గురుమూర్తి లోక్సభలోను, మేడా రఘునాథరెడ్డి రాజ్యసభలోను గురువారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఈ మేరకు జవాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు పీఎంఏవై–అర్బన్ 2.0 కింద 61,084 ఇళ్లకు రూ.882.32 కోట్ల కేంద్ర సహాయం మంజూరైంది.
2026 జూన్ 17న జరిగిన కేంద్ర ఆమోద, పర్యవేక్షణ కమిటీ సమావేశం.. ఏపీలోని 107 పట్టణ స్థానిక సంస్థలకు మరో 12,370 ఇళ్లను రూ.185.55 కోట్ల కేంద్ర సహాయంతో ఆమోదించింది. ఈ ప్రతిపాదనల్లో ఒక్క ఇల్లు కూడా అమరావతిలో లేకపోవడం గమనార్హం. పీఎంఏవై–అర్బన్ 2.0 కింద ఇళ్ల మంజూరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు పంపే ప్రతిపాదనల ఆధారంగానే జరుగుతుందని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. దీన్నిబట్టి అమరావతిలో పేదలకు ఒక్క ఇల్లు కూడా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదన్న విషయం అధికారికంగా రికార్డుల్లో నమోదైంది.
ప్రతిపాదనలు ఎందుకు పంపలేదు?
రాష్ట్రంలోని 107 పట్టణాల్లో ఇళ్లకోసం ప్రతిపాదనలు పంపిన చంద్రబాబు ప్రభుత్వం.. రాజధాని అమరావతిలో పేదల ఇళ్లకోసం ఎందుకు ప్రతిపాదించలేదనేది ఇప్పుడు ప్రశ్న. అమరావతి ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పార్టీ వ్యక్తుల కోసమేనా? అక్కడ కార్మికులు, దినసరి కూలీలు, పేదలు, బలహీనవర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు స్థానం లేదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రజారాజధాని, అందరి రాజధాని అని కూటమి ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నప్పటికీ, వారి చర్యలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయనేది ఇప్పుడు ఈ కేంద్రం ఇచ్చిన సమాధానంతో తేటతెల్లమైంది.
రాజధానిలో పేదలకు ఇళ్లు ఉండరాదన్నది ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు. రాజధానిలో పేదలకు కనీసం సొంత ఇంటి అవకాశం కూడా కల్పించేందుకు ముందుకు రాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సమగ్ర అభివృద్ధినే విశ్వసించే ప్రభుత్వమైతే రాజధానిలో మొదట పేదలకే సొంతగూడు కల్పించేలా చర్యలు తీసుకునేది. కాదంటే, అమరావతిలో పేదల కోసం పీఎంఏవై–అర్బన్ 2.0 కింద ఒక్క ఇంటికైనా ఎందుకు ప్రతిపాదన పంపలేదన్న రాష్ట్ర ప్రజల ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
Tags : 1