Breaking News

నట సాహస మణిమకుటం 'శ్రీకృష్ణ పాండవీయం'

Published on Sun, 01/18/2026 - 09:32

తెలుగు సినిమా మాట నేర్చిననాటి నుంచి వెండితెరపై పురాణకథలు ప్రేక్షకులకు కొత్త కావు. అయితే, మాటల్లో కొంటెతనం – చేతల్లో చాతుర్యం – మనసంతా పాండవ పక్షపాతం – నడకలో, చూపులో లలిత లావణ్యం నిండిన శ్రీకృష్ణ పాత్ర ఒకటి. అహంకార జనిత దర్పం, అధికార జనిత మదోన్మత్తత, ఆభిజాత్యం నిండిన నడక – నడత, పరాభవ దగ్ధ మానసుడైన మత్సరగ్రస్థ మానిషి సుయోధన పాత్ర వేరొకటి. పరస్పరం పూర్తి విభిన్నమైన ఈ నాయక – ప్రతినాయక పాత్రలను రెంటినీ ఒకే నటుడు ఒకే చిత్రంలో ధరించేందుకు సాహసిస్తే? అత్యంత శ్రద్ధ, అపారమైన అధ్యయనంతో అనితర సాధ్యంగా ఆ పాత్రలకు ప్రాణం పోస్తే? ఖర్చుకు వెనుకాడకుండా ఆ కళాతపస్సుకు నిర్మాత – దర్శకుడిగా తన ఆలోచనల అంతర్నేత్రంతో అద్భుతంగా నిర్దేశకత్వం వహిస్తే? ఎన్టీఆర్‌ తన శక్తియుక్తులను ధారపోసి చేసిన ఆ అపురూప సినీసృష్టి విన్యాసం... ‘శ్రీక్రిష్ణ పాండవీయం’. సరిగ్గా 60 ఏళ్ళ క్రితం 1966 జనవరి 13న విడుదలైన ఆ చిత్రం ఎన్టీఆర్‌ నటన – నిర్దేశకత్వాలకు మకుటాయమానం. ఆయన బహుముఖ ప్రజ్ఞకు వెండితెర దర్పణం. అందుకే, తెలుగు పౌరాణిక సినిమాల్లో అది ఈనాటికీ అత్యంత ప్రత్యేకం. ఎన్టీఆర్‌ స్వర్గస్థులై ఈ జనవరి 18తో 30 ఏళ్ళు నిండిన వేళ... ఇది ఆ మరపురాని సినీ విశేషాల సమాహార కథనం. 

పదిమందికీ తెలిసిన పురాణకథనైనా పకడ్బందీ స్క్రీన్‌ప్లే రాసి, నట – సాంకేతిక నైపుణ్యంతో తెరపై రసప్లావితంగా కళ్ళకు కడితే దానికి వచ్చే స్పందనే వేరు. ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో జరిగింది అక్షరాలా అదే! నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అన్ని పాత్రలకూ ఎన్టీఆర్‌ సమన్యాయం చేసిన సమయం అది. నట, సాంకేతిక నిపుణుల ప్రతిభ సమపాళ్ళలో సంగమించిన సందర్భం అది. అందుకే, ఆ చిత్రం... పండిత పామర జనరంజకమైన వెండితెర పురాణమైంది. సమష్టి కృషితో రూపొందిన ఉదాత్త కళాఖండమైంది. పౌరాణిక చిత్ర రూపకర్తలకు నేటికీ సినీ పాఠ్యగ్రంథమైంది.  

కళాతృష్ణతో... సుయోధన పాత్రకు శ్రీకారం!  
‘పాండవీయం’ రావడానికి ముందే ఆ సమీప కాలంలో తెలుగు తెరపై ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘బభ్రువాహన’, ‘ప్రమీలార్జునీయం’, ‘వీరాభిమన్యు’ లాంటి మహాభారత గాథలు తెరకెక్కాయి. ప్రజాదరణ పొందాయి. ‘పాండవ వనవాసం’ (1965)లో భీముడిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా ఎస్వీఆర్‌ ఢీ అంటే ఢీ నటన ప్రదర్శించారు. ఆ తర్వాత తనదైన శైలిలో దుర్యోధన పాత్రను అపూర్వ రీతిలో పోషించి, నటుడిగా తన కళాతృష్ణ తీర్చుకోవాలని ఎన్టీఆర్‌ భావించారు. అదిగో... అలా ‘పాండవీయం’కి బీజం పడింది. భారీ వ్యయంతో వచ్చిన సమకాలీన చిత్రాలు ‘నర్తనశాల’ (1963), ‘పాండవ వనవాసం’, ‘వీరాభిమన్యు’ (1965)లకు సెట్టింగుల మొదలు చిత్రీకరణ దాకా ఎక్కడా తీసిపోకుండా నయన మనోహరంగా, జనరంజకంగా ‘పాండవీయం’ రూపొందించారు ఎన్టీఆర్‌. చిత్రమేమంటే, ‘పాండవీయం’ ఘనవిజయం తర్వాత ఎస్వీఆర్‌ సైతం దుర్యోధన పాత్ర ధరిస్తూ, స్వీయ నిర్మాణ – దర్శకత్వంలో ‘కురుసార్వభౌమ సుయోధన చక్రవర్తి వీరగాథ’ను ‘రారాజు’ పేరిట సినిమాగా తీస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. కానీ, ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చనేలేదు.  

డైరెక్టర్‌గా... తెరపై తొలిసారి పేరు! 
నిజానికి, ఎన్టీఆర్‌ దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రం ‘శ్రీక్రిష్ణ పాండవీయం’. అయితే, తెరపై టైటిల్స్‌లో దర్శకుడిగా ఆయన పేరు తొలిసారి కనిపించింది మాత్రం ఈ చిత్రంతోనే! అంతకు ముందే, ‘సీతారామ కల్యాణం’ (1961), ‘గులేబకావళి కథ’ (1962) చిత్రాలకు దర్శకత్వం వహించినా... ఈ సినిమాకే ఆయన తొలిసారిగా డైరెక్టర్‌గా తన పేరు వేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, పెద్దల బలవంతాన వేసుకోవాల్సి వచ్చింది. దాని వెనుక ఆసక్తిగొలిపే ఓ జరిగిన కథ ఉంది. నిజానికి, ఎన్టీఆర్‌ రాముడిగా, ఎస్వీఆర్‌ రావణుడిగా ‘సీతారామ కల్యాణం’ చిత్రానికి ఆయన గురువు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించాలి. కానీ, ఆ సొంత సినిమాలో రావణుడి పాత్ర ధరించాలని ఎన్టీఆర్‌ ముచ్చటపడ్డారు. కె.వి. రెడ్డి ససేమిరా అన్నారు. ఆయన దర్శకత్వం వహించననడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధ్యతలు తానే తీసుకొని, అనుకున్నట్టుగా నటుడిగా తన కళా తృష్ణ తీర్చుకోవడమే కాక, ఇటు దర్శకుడిగానూ నిరూపించుకున్నారు.


ఆ తర్వాత నిర్మించిన ‘గులేబకావళి కథ’తో దర్శకుడిగా తాను వన్‌ ఫిల్మ్‌ వండర్‌ను కాదని ఎన్టీఆర్‌ చాటారు. డైరెక్టర్‌గా టైటిల్‌ కార్డ్‌ మాత్రం వేసుకోలేదు. ఆ రెండు చిత్రాలూ సూపర్‌హిట్టే. ముచ్చటగా మూడోసారి చేస్తున్న ‘పాండవీయం’ ప్రయోగానికి కూడా డైరెక్టర్‌ పేరు లేకుండానే ఎన్టీఆర్‌ ముందుకు సాగారు. అప్పట్లో ‘సౌతిండియన్‌ ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌’కు ప్రెసిడెంట్‌...∙ప్రముఖ తెలుగు దర్శకుడు పి. పుల్లయ్య. ఇలా దర్శకుడి పేరు లేకుండా సినిమాలు రావడం ఒక రకంగా దర్శకత్వ శాఖకే అగౌరవమని తోటి దర్శక సభ్యులందరూ భావించారు. పుల్లయ్య వెళ్ళి ఆ మాటే ఎన్టీఆర్‌తో అన్నారు. ఏ పనినీ తక్కువ చేయాలన్నది తన భావన కాదంటూ సవినయంగా తన మనోభిప్రాయం వివరించిన ఎన్టీఆర్, పెద్దల మాటను గౌరవిస్తూ ఇక అప్పటి నుంచి దర్శకుడిగా తన పేరు వేసుకోసాగారు. అలా ‘పాండవీయం’తో ఆయనకు దర్శకుడి టైటిల్‌ కార్డ్‌ వచ్చింది. అలాగే, స్క్రీన్‌ప్లే రచనకు అంతకు ముందు దాకా పలువురు ‘సినేరియో’, ‘స్క్రీన్‌ప్లే’, కె.వి. రెడ్డి లాంటి వారు ‘సినిమా అనుకరణ’ లాంటి టైటిల్స్‌ వాడుతున్నా, ఎన్టీఆర్‌ తన భాషాభిమానంతో దానికి ‘చిత్రానువాదం’ అనే పదం ఖాయం చేసి, టైటిల్స్‌లో వేశారు.


మొదటిసారిగా ‘రామకృష్ణ’ నామం!  
ఎన్టీఆర్‌ అప్పటి దాకా ‘ఎన్‌.ఏ.టి.’ పతాకంపై సినిమాలు తీస్తూ వచ్చారు. అయితే, ఈ సినిమాకు కొంతకాలం ముందే ఆయన కుమారుడు రామకృష్ణ దురదృష్టవశాత్తూ మరణించారు. కొడుకు చనిపోయాక ఎన్టీఆర్‌ నిర్మించిన తొలి సినిమా ‘పాండవీయ’మే! అందుకే, చిత్ర నిర్మాణసంస్థ పేరులో తొలిసారిగా ‘రామకృష్ణ’ అని చేర్చారు. అలా ‘రామకృష్ణ – ఎన్‌.ఏ.టి. కంబైన్‌’ అన్న పతాకంపై ‘పాండవీయం’ నిర్మాణమైంది. ఆ తరువాతి కాలంలో క్రమంగా ‘రామకృష్ణా సినీ స్టూడియోస్‌’, ‘రామకృష్ణా హార్టీకల్చర్‌ స్టూడియో’ లాంటి సంస్థల స్థాపన, ఆ బ్యానర్లపై ఎన్టీఆర్‌ పలు చిత్ర నిర్మాణాలు జరపడం తెలిసిందే.

భారత, భాగవతాల మేలి మేళవింపు
లక్క ఇంటి దహనం నుంచి శిశుపాల వధ దాకా తెరపై చూపించే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ కథ కూడా చిత్రమైన వెండితెర వంటకం. భారతం, భాగవతం... రెంటినీ తీసుకొని, వాటిలోని ప్రధాన ఘట్టాలను కలిపి తీసిన సక్సెస్‌ఫుల్‌ సినిమా స్క్రిప్ట్‌. దుష్టచతుష్టయం కుట్ర ఫలితంగా వారణాసిలో పాండవుల నివాసమైన లాక్షా గృహ (లక్క ఇంటి) దహనం, ఏకచక్రపురంలో బకాసుర వధ, హిడింబాసుర వధ, హిడింబి – భీమసేనుల కల్యాణం, ద్రౌపదీ స్వయంవరం, జరాసంధ వధ, శిశుపాల వధ లాంటి ఆసక్తికరమైన మహాభారత ఘట్టాలు ఇందులో ఉన్నాయి.

అదే సమయంలో భాగవతంలోని అద్భుతమైన రుక్మిణీ కల్యాణమూ సినిమాలో గుదిగుచ్చారు. తెలుగునాట ఇంటింటికీ సుపరిచితమైన పోతన భాగవతంలోని రుక్మిణీ కల్యాణ ఘట్టం ఓ పొయెటిక్‌ క్లాసిక్‌. దాన్ని అంతే అద్భుతంగా, యథాతథంగా పోతన పద్యాలతోనే ‘పాండవీయం’లో తెరపైకి తెచ్చారు ఎన్టీఆర్‌. అలా తాను అద్భుతమైన నటుడినే కాక అభిరుచి గల రసజ్ఞుడైన దర్శకుడినని కూడా నిరూపించుకొన్నారు. అంతేకాక భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు... అయిదుగురూ ఒకే నక్షత్రంలో జన్మించారంటూ, వారి మరణ రహస్యగాథను ‘పంచభీమ ప్రహనం’గా ఆసక్తికరంగా చెప్పారు. అలాగే, రాజసూయ యాగం – మయసభ ఘట్టం లాంటి వాటిని తెలుగుతెరపై అపూర్వంగా తెరపై చూపించిన సినిమా కూడా ఇదే! బహుశా ఇన్ని ప్రధాన భారత కథలను ఒకే సినిమాలో బిగి చెడకుండా చూపించిన తొలి బృహత్తర ప్రయత్నం ఇది.  


ఆయనే హీరో... ఆయనే విలన్‌...
ఇటు హీరో, అటు విలన్‌... రెండు పాత్రలూ ఒకే సినిమాలో ఒకే నటుడు పోషించి, మెప్పించడం సాంఘిక సినిమాల్లో సైతం పెను సవాలు. అలాంటిది ఇక, పౌరాణికాల్లో అయితే వేరే చెప్పేదేముంది? అలాంటి క్లిష్టమైన సవాలును స్వయంగా భుజానికెత్తుకొని ఒక రకంగా ఒంటి చేతితో ఎన్టీఆర్‌ చేసిన మ్యాజిక్‌ ‘పాండవీయం’. కథానుసారం పాండవుల్ని నామరూపాలు లేకుండా చేయాలనుకొనే ప్రతినాయక పాత్ర సుయోధనుడు. వారిని ఎలాగైనా కాపాడే పనిలో ఉండే నాయక పాత్ర శ్రీకృష్ణుడు. అలా ఈ కథంతా హీరో వర్సెస్‌ విలన్‌ వ్యవహారం. పౌరాణికాల్లో ఈ రెండు పాత్రలూ పోషించిన నటుడు ఎవరూ లేరు. అలాంటిది... ఈ రెండు పాత్రలూ ఒకే సినిమాలో వేసి, ఒప్పించి, జనాన్ని మెప్పించడం, అదే సమయంలో అనుపమాన దర్శకత్వ ప్రతిభ చూపడం ఒక్క ఎన్టీఆర్‌కే చెల్లింది. అది ఒక్క ‘పాండవీయం’కే జరిగింది.

కెరీర్‌ బెస్ట్‌ పాత్రల్లో ఒకటిగా...
మూడు దశాబ్దాల పైచిలుకు ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ను విశ్లేషిస్తే... సుయోధన పాత్రపోషణ నటుడిగా ఆయన కృషిలో కలికితురాయి. ముఖ్యంగా, ‘పాండవీయం’లోని ఆ పాత్ర కోసం ఆయన పురాణాలను సైతం శోధించారు. అంతకు మునుపటి చిత్రాల్లోని దుర్యోధన పాత్రకు భిన్నంగా ప్రత్యేకమైన వేష భూషణాలు, పాము పడగలతో తీర్చిదిద్దిన ఆ ప్రత్యేక కిరీటం – గద, నెన్నొసట దిద్దిన నాగతిలకం, నటనలో తనదైన శైలి, దైహిక భాష, సంభాషణోచ్చారణతో ఆ పాత్రను చిరంజీవిని చేశారు. ముఖ్యంగా, నర్తకీమణుల స్వాగత గీతంలో అధికార దర్పంతో గంభీరంగా అడుగులు వేస్తూ సాగే సుయోధన పాత్ర పరిచయ ఘట్టం అద్భుతం. అలాగే, మయసభ పరాభవాగ్నితో దగ్ధమానసుడైన శతసోదర పరీవృత సుయోధనుడిగా ఎన్టీఆర్‌ అభినయం అపూర్వం. ఒక రకంగా కథానాయక పాత్ర తరహా ఇమేజ్‌ను దానికి సంతరించిపెట్టారు. అందుకే, ఎన్టీఆర్‌ సంతానం పురందేశ్వరి, నటుడు బాలకృష్ణ సహా ఎన్టీఆర్‌ వీరాభిమానులకు సైతం ఆల్‌టైమ్‌ ఫేవరిట్‌గా ఆ పాత్ర, ఈ ‘పాండవీయం’ చిత్రం నిలిచాయి. ‘పాండవీయం’ తర్వాత ఎన్టీఆర్‌ మళ్ళీ తన సొంత చిత్రాలు ‘దానవీరశూర కర్ణ’ (1977), ‘శ్రీమద్విరాట పర్వం’ (1979)లో మాత్రమే అభిమానధనుడైన సుయోధనుడి పాత్ర పోషించారు. అలాగే, స్వీయ దర్శకత్వంలోని సాంఘిక చిత్రం ‘చండశాసనుడు’ (1983)లో సైతం సినిమా ఆరంభంలో వచ్చే ఓ అంతర్నాటకంలో ఆ పాత్ర ధరించి, కొద్దిసేపు కనువిందు చేశారు.

ప్రజల మనసు గెలిచిన పురాణ సుయోధనుడు
నెగిటివ్‌ ఛాయలున్న పురాణపాత్రను తీసుకొని, అలాంటి పాత్రకు సైతం ఒక హీరో వర్షిప్‌ వచ్చేలా, అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా తీర్చిదిద్దడం అసాధారణ విన్యాసం. ఎవరెన్ని విమర్శలు చేసినా లెక్కచేయకుండా అతి కష్టమైన ఆ ఫీట్‌ను వెండితెరపై ఒకటికి రెండుసార్లు అనాయాసంగా చేశారు ఎన్టీఆర్‌. ‘సీతారామ కల్యాణం’లో రావణ పాత్ర, ‘పాండవీయం’ – ‘దానవీరశూర కర్ణ’ల్లో సుయోధన పాత్రలు అందుకు మచ్చుతునక. మహాభారతంలోని దుర్యోధనుడి పాత్రను... ఆభిజాత్యం, ఔద్ధత్యం, మైత్రీభావం నిండిన సుయోధనుడిగా తెరపై చూపి, ప్రేక్షకులను ఆ పాత్రతో ప్రేమలో పడేలా చేయడం ఎన్టీఆర్‌కే చెల్లింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే – సుయోధన పాత్రలోని ఆయన ‘కర్ణ’ డైలాగులు నేటి సోషల్‌ మీడియా యుగంలోనూ సూపర్‌హిట్టే! ‘జెన్‌ జీ’ తరం ఫోన్లలోనూ పాపులర్‌ రింగ్‌టోన్లే!! అలాగే, తెలుగునాట అనేక చోట్ల ఎన్టీఆర్‌ వేసిన శ్రీకృష్ణాది దైవపాత్రలే కాదు... చివరకు సుయోధనుడి పాత్ర సైతం వీధుల్లో విగ్రహాల రూపంలో నిలిచింది. ఒక ప్రతినాయక పాత్రను అంతలా ప్రేమాస్పదం చేయడం అక్షరాలా ఆ పాత్రకు ప్రాణం పోసిన నట, దర్శకుడిగా ఎన్టీఆర్‌ గొప్పదనం.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం...
‘శ్రీక్రిష్ణ పాండవీయం’ చిత్ర నిర్మాణాన్ని ఎన్టీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో కలసి అత్యుత్తమ స్థాయి చిత్ర రూపకల్పన కోసం శ్రమించారు. సినీ రచనా పితామహుడు, పౌరాణిక గాథా రచనల్లో సిద్ధహస్తులైన సముద్రాల సీనియర్‌ (సముద్రాల రాఘవాచార్య) ఈ చిత్ర రచన చేశారు. పౌరాణిక కథకూ, పాత్రోచిత సంభాషణలకూ తగ్గట్టుగా శబ్దపాటవం చూపారు. పాండితీ భావుకంగా అద్భుతమైన సంభాషణలు సమకూర్చారు. రసస్ఫూర్తి నిండిన కొన్ని పద్యాలు, పాటలు కూడా అందించారు. ‘నర్తనశాల’కు పనిచేసి, అంతర్జాతీయంగా ‘జకార్తా ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో అవార్డు అందుకున్న సీనియర్‌ కళాదర్శకుడు టి.వి.ఎస్‌. శర్మ ‘పాండవీయం’కు పనిచేశారు. కళ్ళు చెదిరే సెట్లు, కళాత్మకత ఉట్టిపడే మౌల్డింగులు, కిరీటాలు, వేష భూషణాలు సిద్ధం చేశారు. కురుసభ, మయసభ, రాజసూయ సభలను నేత్రపర్వంగా రూపొందించి, అబ్బురపరిచారు. అందుకే, ‘పాండవీయం’ అంతకు మునుపటి పౌరాణిక చిత్రాల కన్నా భారీగా కనిపిస్తుంది. అలాగే, తాంత్రిక ఛాయాగ్రహణంలో సిద్ధహస్తుడైన రవికాంత్‌ నగాయిచ్‌ ఈ సినిమా పూర్తి చిత్రీకరణ బాధ్యతను స్వీకరించారు. ప్రతి సన్నివేశాన్నీ కనువిందు చేశారు.

రెండు విభిన్న పాత్రలు ధరిస్తూ, దర్శకత్వం వహించడాన్ని ఎన్టీఆర్‌ సైతం గర్వకారణమైన అంశంగా భావించారు.  సినిమాను భారీయెత్తున నిర్మించడమే కాక, ‘‘మీ అభిమాన నటుడు రెండు విభిన్న పాత్రలు నటించి, దర్శకత్వం నిర్వహించి, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే నూతనాధ్యాయం సృష్టించిన మహత్తర కళాఖండం’’ అంటూ ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఎప్పటిలా కాక పబ్లిసిటీ సైతం భారీగా చేశారు. మునుపెన్నడూ లేని రీతిలో పూర్తి పేజీ ప్రకటనలతో, విడుదల రోజు సైతం జనంలో ఆసక్తి రేపారు. (ఆ తరువాత కొంతకాలానికి మళ్ళీ ‘శ్రీకృష్ణసత్య’కు ఎన్టీఆర్‌ ఇలా భారీ పబ్లిసిటీ చేశారు). కళాదర్శకుడు టి.వి.ఎస్‌. శర్మ బృందమే ‘పాండవీయం’ పబ్లిసిటీకి సైతం పనిచేసింది. చక్కటి డిజైన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నేటికీ వినిపించే నాటి పాటలు...
ఎన్టీఆర్‌కు చిరకాల సన్నిహితుడైన టి.వి. రాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తే, కొసరాజు – సి. నారాయణరెడ్డి సాహిత్యం సమకూర్చారు. భీముడిపై మరులుగొన్న హిడింబి పాడే పాట ‘ఛాంగురే బంగారు రాజా...’, అలాగే సుయోధనుడిపై చిత్రీకరించిన ‘స్వాగతం సుస్వాగతం...’ (ఈ రెండింటి రచన సినారె), శ్రీకృష్ణుడు – రుక్మిణి పాత్రలపై వచ్చే ‘ప్రియురాల సిగ్గేలనే...’ పాట (రచన సముద్రాల సీనియర్‌) చాలా పాపులర్‌. ఇక, ఆదమరిచిన భీమసేనుణ్ణి అప్రమత్తం చేసే సందర్భంలో శ్రీకృష్ణుడు పాడే ‘మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా...’ పాట ఇవాళ్టికీ అందరూ తరచూ పేర్కొనే అద్భుత వ్యక్తిత్వ పాఠ గీతం. ఘంటసాల పాడిన ఈ కొసరాజు రచనలో ‘ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు... సోమరిౖయె తిరుగువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు’ లాంటి పంక్తులు అనేక సందర్భాలకు అన్వయించే అద్భుతమైన మాటలు. పాటలకు వెంపటి సత్యం కూర్చిన నృత్యాలు మరో హైలైట్‌. కృష్ణుణ్ణి ఆరాధించే ముగ్ధగా రుక్మిణి పాత్రలో కె.ఆర్‌. విజయ నడక, చూపు, విలాసం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినవి. ఇక, రుక్మిణి చెలికత్తెగా గీతాంజలి, అలాగే ‘ఛాంగురే...’ పాటలో హిడింబి పాత్రధారిణి రత్న చేసిన నృత్యాలు ఆకర్షిస్తాయి.

ఏకకాలంలో... రెండు భాషల్లో...
నిజానికి, ఎన్టీఆర్‌ ఏకకాలంలో తెలుగు, తమిళాల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా స్క్రిప్టును సెల్యులాయిడ్‌ పైకి ఎక్కించారు. తమిళ వెర్షన్‌కు ‘రాజసూయం’ అని టైటిల్‌ పెట్టారు. తెలుగు వెర్షన్‌ లానే తమిళంలోనూ శ్రీకృష్ణ పాత్రను ఎన్టీఆర్‌ స్వయంగా ధరించారు. సుయోధన పాత్రకు మాత్రం తమిళంలో అప్పటికే రంగస్థలంపై వివిధ పౌరాణిక పాత్రలను పోషిస్తూ, సుప్రసిద్ధుడైన రంగస్థల – సినీ నటుడు ఆర్‌.ఎస్‌. మనోహర్‌ను ఎంచుకున్నారు. అలాగే, తమిళంలో నారదుడిగా టి.ఆర్‌. మహాలింగం, మరికొన్ని పాత్రలకు రామదాస్, ఓ.ఏ.కె. దేవర్‌ లాంటి పేరున్న అక్కడి నటులను తీసుకున్నారు. ఎస్‌. వరలక్ష్మి (కుంతి పాత్ర), తెలుగు తెరపై తొలిసారిగా చిరకాలం గుర్తుండిపోయే పాత్రలు చేసిన కె.ఆర్‌. విజయ (రుక్మిణి పాత్ర), కన్నడ నటుడు ఉదయ్‌కుమార్‌ (భీమసేనుడి పాత్ర) లాంటి వారు తమిళ వెర్షన్‌లోనూ అవే పాత్రలతో అలరించారు.

మొత్తం మీద ఈ పౌరాణిక చిత్రంలో తెర నిండుగా భారీ తారాగణమే. తెలుగులో ధూళిపాళ చేసిన శకుని పాత్రపోషణ ఆయన కెరీర్‌కు కీర్తికిరీటం. అలాగే, తరువాతి కాలంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భారతి (కన్నడ హీరో విష్ణువర్ధన్‌ భార్య) సుయోధనుడి స్వాగత గీతంలో నర్తిస్తూ తెలుగులో తొలిసారి అలరించారు. నారదుడిగా కాంతారావు, భీష్ముడిగా మిక్కిలినేని, రుక్మిగా సత్యనారాయణ, శిశుపాలుడిగా రాజనాల, జరాసంధుడిగా ముక్కామల, హిడింబాసురుడిగా నెల్లూరు కాంతారావు, రుక్మిణి తండ్రి అయిన విదర్భరాజు భీష్మకుడిగా నాగయ్య, రుక్మిణి పనుపున రాయబారం చేసే విప్రుడు అగ్నిద్యోతనుడిగా వంగర, కర్ణుడిగా ప్రభాకరరెడ్డి, ద్రోణుడిగా కె.వి.ఎస్‌. శర్మ, ధర్మరాజుగా బాలయ్య, ద్రౌపదిగా స్వర్ణ పాత్రపోషణ చేశారు. తరువాతి కాలంలో పెద్ద హీరో అయిన శోభన్‌బాబు ఈ చిత్రంలో అర్జునుడిగా చిరు పాత్ర ధరించారు.

మరపురాని శకుని పాత్రపోషణ
‘పాండవీయం’లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శకుని పాత్ర. ఆ పాత్రకు దర్శకుడిగా ఎన్టీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. గాంధార రాజ్య వారసుడిగా కౌరవులపై శకునికి పైకి కనిపించని పగ, మాయోపాయానికి గల గాథను తెరపైకి తొలిసారిగా తీసుకువచ్చారు. అలా శకుని పాత్ర, ఆ పాత్ర ప్రవర్తనలకు కథాపరంగా చేసిన వ్యాఖ్యానం, తెరపై కథనంలో చూపిన తీరు అపూర్వం. దానికి తగ్గట్టు రంగస్థల దిగ్గజమైన ధూళిపాళ ఆ పాత్రపోషణలో ప్రదర్శించిన ప్రతిభ మరో ఎత్తు. అందుకే, ఇవాళ్టికీ ధూళిపాళ, ‘పాండవీయం’లో ఆయన పోషించిన ఆ శకుని పాత్ర ప్రేక్షకుల మనసులో చెరగకుండా నిలిచిపోయాయి. అలాగే, మయసభా ఘట్టంలో సుయోధనుడిగా ఎన్టీఆర్‌ అనుపమానమైన నటన, సంస్కృత సమాసభూయిష్ఠమైన ఆ సుదీర్ఘ సంభాషణల్ని పలుకుతూ ఆయన అభినయించిన తీరు, సముచితమైన షాట్‌ డివిజన్, కెమెరా వర్క్, ఎడిటింగ్‌లతో వాటిని తెరపై పండించిన దర్శకత్వ సామర్థ్యం... ఇలా అన్నీ మరపురానివే.

విమర్శలున్నా... విజయం ఆగలేదు!
 పతాక సన్నివేశాల్లో శిశుపాలుడి వధ అనంతరం శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనంతో ఇరవై రీళ్ళ ‘పాండవీయం’ సినిమా ముగుస్తుంది. ఈ విశ్వరూప సందర్శన ఘట్టాన్ని నగాయిచ్‌ తన కెమెరా ప్రతిభతో అపూర్వంగా చిత్రీకరించారు. అది అందరినీ ఆకర్షించింది. మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారం, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతా బోధ సందర్భాల్లోనే విశ్వరూప సందర్శన ఘట్టం ఉంటుంది. అయితే, మనవాళ్ళు మాత్రం సినిమాటిక్‌గా తెరపై ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్వరూప సందర్శన చూపుతున్నారంటూ కొందరు పండితులు అప్పట్లో వ్యాఖ్యానించారు. అలాగే, భాషాపరంగా ‘శ్రీకృష్ణ పాండవీయం’ అని ఉండాల్సిన టైటిల్‌ను ఉచ్చారణ సాకుతో ‘శ్రీక్రిష్ణ...’ అని రాయడం పైనా విమర్శలొచ్చాయి. అయితే, సామాన్య సినీ ప్రేక్షకులకు అవేమీ పట్టలేదు. మూడున్నర గంటల నిడివి ఉన్నా ఆద్యంతం ఆసక్తిగా పదే పదే చూశారు. బాక్సాఫీస్‌ సూపర్‌హిట్‌ చేశారు.

ఆకస్మికంగా ప్రధాని మరణం... ఆగని సంక్రాంతి రిలీజ్‌!
అది 1966 జనవరి. భారత – పాకిస్తాన్‌ల మధ్య శాంతి, సామరస్యాల సాధన కోసం భారత ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి రష్యాలోని తాష్కెంట్‌కు చర్చలకు వెళ్ళారు. దాయాది దేశాల మధ్య మహత్తరమైన ‘తాష్కెంట్‌ ఒప్పందం’ కుదిరిన కొద్ది గంటలకే జనవరి 11వ తేదీ తెల్లవారకుండానే ఆయన ఆకస్మికంగా మరణించారు. యావత్‌ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. సరిగ్గా అంతకు నెల రోజుల ముందే డిసెంబర్‌ 11 రాత్రి హైదరాబాద్‌లోని నిజామ్‌ కాలేజీలో జరిగిన సభలో సినీ ప్రముఖుల బృందంతో ప్రధానిని ఎన్టీఆర్‌ కలిశారు. అప్పటికి 21 రోజుల పాటు రాష్ట్రమంతటా తమ సినీ కళాకారుల బృందం పర్యటించి, ప్రజల నుంచి సేకరించిన దాదాపు రూ. 8 లక్షల రూపాయలను ‘జాతీయ రక్షణ నిధి’కి చెక్కు రూపంలో ప్రధానికి అందజేశారు. ఎన్టీఆర్‌ ఉద్వేగపూరితంగా ప్రసంగించి, ప్రధానిచే ‘నటరత్న‘గా ప్రశంసలందుకున్నారు. అలాంటి శాస్త్రీజీ ఆకస్మిక మరణ వార్తతో ఎన్టీఆర్‌ నివ్వెరపోయారు.

నిజానికి, డిసెంబర్‌లో మద్రాసు వాహినీ స్టూడియోలో లెక్కకు మించి ఆర్కెస్ట్రాను పెట్టి, సంగీత దర్శకుడు టి.వి. రాజు సారథ్యంలో ‘పాండవీయం’ రీ–రికార్డింగ్‌ పూర్తి చేయించి, సెన్సార్‌ కూడా పూర్తి చేయించి, సంక్రాంతి విడుదలకు సర్వం సిద్ధం చేశారు. మరో రెండే రోజుల్లో రిలీజ్‌. ఇంతలో అనుకోని ఈ దుస్సంఘటన. ఇప్పుడేం చేయాలి? అయితే, అప్పటికే రిలీజ్‌ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఆపేస్తే... సినీ వ్యాపారవర్గాలు అందరికీ ఎంతో నష్టం. అంతా ఆలోచించి, రిలీజ్‌కే ఓటేశారు. అలా శాస్త్రీజీ మరణించిన రెండు రోజులకు తెలుగు ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ 1966లో భోగి పండుగ నాడు జనవరి 13న జనం ముందుకొచ్చింది.

సరిగ్గా ఆ మరునాడే ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ‘మోడరన్‌ థియేటర్స్‌’ – సేలమ్‌ వారి 102వ చిత్రంగా ఎస్‌.డి. లాల్‌ దర్శకత్వంలో ఎస్వీ రంగారావు, హరనాథ్‌ తదితరులు నటించిన అపరాధ పరిశోధక చిత్రం ‘మొనగాళ్ళకు మొనగాడు’ రిలీజైంది. వీటి కన్నా ముందే ఆ ఏడాది జనవరి 7న అక్కినేని ‘జమిందార్‌’ చిత్రం రిలీజైంది. అన్నింటి మధ్య ఆ సంక్రాంతి చిత్రాల బరిలో ‘పాండవీయం’ ఘన విజయం సాధించింది. తెలుగు వెర్షన్‌ సూపర్‌హిట్‌ తర్వాత 1966 ఏప్రిల్‌ 30న ‘పాండవీయం’ తమిళ వెర్షన్‌ ‘రాజసూయం’ పేరిట వచ్చింది. గమ్మత్తేమిటంటే, ఆ తరువాత అయిదేళ్ళకు ఇదే సినిమాను ‘కణ్ణన్‌ కరుణై’ అని కొత్త టైటిల్‌తో, 1971 జూన్‌ 18న మళ్ళీ పెద్దయెత్తున విడుదల చేశారు.

ఆ రోజుల్లోనే... అనుకోని ప్రీక్వెల్స్‌!
గమనిస్తే... పద్ధెనిమిది పర్వాల మహాభారతంలోని ప్రధాన గాథలెన్నో తెలుగుతెరపై సినిమాలుగా వచ్చాయి. దేనికదే ప్రత్యేకం. అయితే, కేవలం 27 నెలల కాలవ్యవధిలో ఒక సినిమాకు ‘ప్రీక్వెల్‌’ కథతో మరో సినిమా చొప్పున ఏకంగా 3 సినిమాలు రావడం 1960లలో జరిగింది. ఆ 3 సినిమాల్లోనూ ఎన్టీఆర్‌ హీరో కావడం, మూడూ సూపర్‌హిట్లు కావడం విశేషం. అవి – ‘నర్తనశాల’ (రిలీజ్‌ 1963 అక్టోబర్‌ 11), ‘పాండవ వనవాసం’ (1965 జనవరి 14), ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ (1966 జనవరి 13). మూడూ మహాభారత ఆధారిత కథలే! భారతంలోని విరాటపర్వ గాథతో ‘నర్తనశాల’ తయారైతే, దానికి ముందుదైన అరణ్యపర్వ కథతో ‘పాండవ వనవాసం’ వచ్చింది. అటు తర్వాత అరణ్యపర్వానికి ముందువైన ఆది, సభా పర్వాల ఘట్టాలతో ‘పాండవీయం’ రూపొందింది. కథాపరంగా చూస్తే, వరుసగా మూడూ ఒకదానికొకటి ప్రీక్వెల్సే! ‘ప్రీక్వెల్‌’ అనే మాట కూడా పరిచయం కాని ఆ రోజుల్లోనే మన తెలుగు సినిమాలోనే జరిగిన ఓ అపురూప సంభవం ఇది.  

అన్నీ చేసిన... అరుదైన యాక్టర్‌!
ఇక, భారతంలో కృష్ణరాయబార ఘట్టం ఉండే ఉద్యోగపర్వం, భీష్మ – ద్రోణాది పర్వాల్లోని కురుక్షేత్ర యుద్ధం వగైరా అంతా ఎన్టీఆరే నటించిన ‘శ్రీకృష్ణావతారం’ (1967), ‘దానవీరశూర కర్ణ’ (1977)ల్లో చూపారు. ఆ రకంగా దాదాపు మొత్తం మహాభారతంలోని అన్ని పర్వాలూ, వ్యాస – కవిత్రయ భారతాల నుంచి పోతన భాగవతం దాకా అన్నింటిలోని ప్రధాన అంశాలూ సినిమాతెరకెక్కాయి. అన్నింటిలోనూ ఎన్టీఆరే ప్రధాన పాత్రధారి. ఇక, ఆయనే నటించిన ‘భీష్మ’ (1962), ‘శ్రీమద్విరాటపర్వం’ (1979) చిత్రాలను కూడా కలుపుకొంటే... భీష్ముడు నుంచి కృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, బృహన్నల, కర్ణుడు దాకా ప్రధాన భారత పాత్రలన్నీ ఎన్టీఆర్‌ పోషించారు. సినీ చరిత్రలో న భూతో న భవిష్యతి అనిపించుకున్నారు.

మళ్ళీ మళ్ళీ... అర్ధశత, శతదినోత్సవాలు
ఇవాళ చాలా తక్కువగా అనిపించవచ్చు కానీ, అరవై ఏళ్ళ క్రితం అత్యంత భారీ మొత్తం (దాదాపు రూ. 10 లక్షలు) వెచ్చించి, ‘పాండవీయం’ రూపొందించారు. 30 ప్రింట్లతో తొలి రిలీజైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. రిలీజైన అన్ని కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవాలు, ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకొంది. ఆ తరువాత అనేక పర్యాయాలు రీ–రిలీజై, తరతరాల పర్యంతం ఆకట్టుకొంటూనే ఉంది. వసూళ్ళ వాన కురిపిస్తూనే వచ్చింది.

తొలి రిలీజ్‌ 1966 తర్వాత ప్రధానంగా 1968, 1986, 1997ల్లో కూడా ‘పాండవీయం’ పెద్దయెత్తున ఏకకాలంలో వివిధ కేంద్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌ రిలీజ్‌ లాగానే 1968 నవంబర్‌ 1న సెకండ్‌ రిలీజ్‌ సైతం ఈ సినిమా విజయవాడలోని దుర్గాకళామందిరంలోనే వచ్చింది. మళ్ళీ ఏకంగా 50 రోజులు  ఆడింది.

ఇక, 1986 జనవరిలో సంక్రాంతికి ఆంధ్రా – సీడెడ్‌ ప్రాంతాల్లో దాదాపు 20 ప్రింట్లతో ‘పాండవీయం’ రీ–రిలీజైంది. అప్పట్లో ఎన్టీఆర్‌ సొంత చిత్రాలు మూడింటికి (‘పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘తల్లా? పెళ్ళామా?’) కలిపి, అయిదేళ్ళ పంపిణీ హక్కులు రూ. 50 లక్షలకు అమ్ముడయ్యాయి. అందులో ఒక్క ‘పాండవీయం’ విలువే రూ. 40 లక్షలని ట్రేడ్‌ పండితుల మాట. అలా 1986 ఆరంభంలో రీ–రిలీజైనప్పుడు అప్పటికి ఇరవయ్యేళ్ళు నిండిన ఈ పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం కొత్త కలర్‌ సినిమాలతో సైతం ఢీ అంటే ఢీ అంది.

అప్పట్లో విజయవాడలో ‘అలంకార్‌ ఎ.సి’, ‘శేష్‌మహల్‌ ఎ.సి’ థియేటర్లు రెంటిలో రిలీజైంది. తెగిన టికెట్ల సంఖ్యతో సంబంధం లేకుండా హాలులో ఉన్న సీట్లు అన్నింటిపైనా ప్రతి షోకూ ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టాల్సిన ‘శ్లాబ్‌ సిస్టమ్‌’ నడుస్తున్న రోజులవి. అయినా సరే, ఒక్క ‘అలంకార్‌’లోనే 43 రోజులు నడిచింది. ఒక రీ–రిలీజ్‌ సినిమా అలా బెజవాడలో ఒక ఎ.సి. థియేటర్‌లో అన్ని రోజులు ప్రదర్శితం కావడం అప్పటికీ, ఇప్పటికీ హయ్యస్ట్‌ రికార్డ్‌. ఆ తర్వాత షిఫ్టులతో బెజవాడలో మొత్తం 11 వారాలు ఆడింది. ఇక, ఆ శ్లాబ్‌ సిస్టమ్‌లోనే గుంటూరులో ఈ రీ–రిలీజ్‌ సినిమా ఏకంగా 33 రోజులు హౌస్‌ఫుల్‌! అంతేకాదు... అప్పటి సంక్రాంతి కొత్త చిత్రాలన్నింటినీ మించి ఆ ఊళ్ళో మొత్తం 69 రోజులు నడిచింది. కాసులు కురిపించింది.  

‘‘1997లో మళ్ళీ కొత్త పబ్లిసిటీ, పోస్టర్‌ డిజైన్లతో సినిమాను భారీగా రిలీజ్‌ చేస్తే, అన్ని చోట్లా బాగా ఆడి, ఏరియాల వారీగా కొనుక్కున్న అందరికీ లాభాలు పండించింది’’ అని అప్పట్లో ఈ చిత్రం హక్కులు కొని, పంపిణీ చేసిన సినీ ప్రముఖుడు – సినీ వ్యాపార విశ్లేషకుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు చెప్పారు. ఆ 1997లోనే ‘పాండవీయం’ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో షిఫ్టింగులతో 100 రోజులు  ఆడింది. అలా... వచ్చిన ప్రతిసారీ ‘పాండవీయం’ చిత్రం కొత్త సినిమాలకు దీటుగా దీర్ఘకాలం నడిచింది. ఇలా మొత్తం నాలుగుసార్లు 50 నుంచి 100 రోజులు ఆడిన సినిమా మరొకటి లేదు. తెలుగు సినీచరిత్రలో ఈ పౌరాణిక క్లాసిక్‌ చిత్రం ఒక్కదానికే దక్కిన ఘనత అది.

పదే పదే... పెట్టుబడిని మించి లాభం
ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కళాఖండం అప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపుగా రీ–రిలీజైన ప్రతిసారీ కాసుల వర్షం కురిపిస్తూనే వచ్చింది. సినిమా రూపకల్పనకైన తొలి నిర్మాణవ్యయానికే కాదు... రీ–రిలీజుకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి కూడా అనేక రెట్ల మొత్తం వసూలు చేసింది. ట్రేడ్‌ పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. చివరకు శాటిలైట్‌ టీవీ ఛానళ్ళు, ఇటీవల ఓటీటీలు వచ్చిన తర్వాత కూడా ‘పాండవీయం’ సినిమాకు క్రేజు తగ్గలేదు. మొదట్లో రెండు తడవలు ‘ఈ’ టీవీ వారికి, ఆ తరువాత మరో మూడుసార్లుగా ‘జెమినీ’ వారికీ ఈ సినిమా ప్రసార హక్కులను పరిమిత కాలవ్యవధికి అమ్మారు. ఒక్క 2011లోనే ఈ చిత్ర శాటిలైట్‌ హక్కులు దాదాపు రూ. 25 లక్షలకు అమ్ముడవడం గమనార్హం. అనేక చిత్రాల హక్కులు శాశ్వత ప్రాతిపదికన అమ్ముడైపోతుంటే... అరవై ఏళ్ళ క్రితం నాటి ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ మాత్రం ఇలా ఇప్పటికి అయిదు పర్యాయాలు పదే పదే పెద్ద మొత్తానికి అమ్ముడవడం అపూర్వం. అంటే, ఈ చిరస్మరణీయ పౌరాణిక చిత్రరాజం తన తొలినాళ్ళ బడ్జెట్‌తో పోలిస్తే, ఇప్పటికి ఎన్ని వందల రెట్లు వ్యాపారం చేసినట్టు! తలుచుకుంటేనే అబ్బురం అనిపించే విషయం అది.  

చెప్పింది బంగారు నంది... ఇచ్చింది వెండి నంది...
ప్రభుత్వమిచ్చే ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు అరవై ఏళ్ళ క్రితం కూడా వివాదాస్పదమయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. నంది అవార్డులు ఆరంభించిన రెండో ఏడాదే ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ విషయంలో అదే జరిగింది. ఆ చిత్రం సెన్సార్‌ 1965 డిసెంబర్‌లోనే అయిపోయింది. అందుకే, 1965 సంవత్సరానికిచ్చే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నంది అవార్డుల బరిలోనే అది పోటీకి నిలిచింది. ఆ ఏడాది అవార్డుల్లో మొదట ఉత్తమ చిత్రంగా ఎన్టీఆర్‌ ‘పాండవీయం’కి బంగారు నందిని ఇస్తున్నట్టు ప్రకటించారు. తీరా ప్రకటన తరువాత కూడా ప్రైజు మార్చి, వెండి నందితో సరిపెట్టారు. అదేమంటే... ‘పాండవీయం’ పౌరాణికం కదా, కాబట్టి అది సొంతంగా రాసిన కథ కాదు కదా అని అభ్యంతరం చెప్పారు. అలా ఏయన్నార్‌ ‘అంతస్థులు’కి ఆ ఏడాది బంగారు నంది దక్కింది. తీరా బహుమతి ప్రదానం కూడా అయిపోయాక ‘అంతస్థులు’ పైనా వివాదం వచ్చింది. ‘నిను వీడని నీడను నేనే...’ లాంటి పాపులర్‌ పాట ఉన్న ఆ చిత్ర కథను ప్రధానంగా నడిపేది భౌతికం కాని దయ్యం పాత్ర అనీ, అలాంటి సినిమాకు ఎలా ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చారనీ రచ్చ రేగింది. ఏమైనా, ఒక పక్కన అప్పుడే రిలీజై థియేటర్లలో నడుస్తూ, శతదినోత్సవమైనా పూర్తి కాకుండానే ప్రేక్షక ప్రశంసలతో పాటు ప్రభుత్వ అవార్డు గెలవడం ‘పాండవీయం’కి జరిగిన ఓ అరుదైన ఘటన.

నవల మిగిలింది! నిర్లక్ష్యంతో నెగిటివ్‌ పోయింది!!
ఫస్ట్‌ రిలీజ్‌ నాటికే ‘పాండవీయం’ చిత్రం వెండితెర నవలగా కూడా వచ్చింది. సినిమాలోని మాటలు, పాటలు, ఛాయాచిత్రాలు పొందుపరిచిన 94 పేజీల నవల అది. చిత్ర రచయిత సముద్రాల సీనియర్‌ కుమారుడూ, స్వయంగా ఎన్టీఆర్‌కు సన్నిహిత మిత్రుడైన సముద్రాల జూనియర్‌ ఈ వెండితెర నవలను సంకలించి, కథనం కూర్చడం విశేషం. అయితే, తెలుగువారి దురదృష్టం ఏమిటంటే, ఈ అపురూప సినీ కళాఖండం ఒరిజినల్‌ నెగిటివ్‌ 1990ల రీ–రిలీజ్‌ నాటికే కొంత దెబ్బతింది. పదే పదే రీ–రిలీజుల కోసం నెగిటివ్‌ నుంచి ప్రింట్లు వేస్తున్నందున, అసలు ‘ఒరిజినల్‌ నెగిటివ్‌’ బాగున్న సందర్భంలోనే ఎన్టీఆర్‌ ముందు జాగ్రత్తతో ‘డూప్‌ నెగిటివ్‌’ కూడా చేయించి పెట్టారు. కానీ కళాతపస్విగా ఎన్టీఆర్‌ తన ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమా తాలూకు ఆ నెగిటివ్‌లు రెండూ ఇప్పుడు ఎక్కడున్నాయో కనీసం ఆచూకీ లేదు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వెండితెర క్లాసిక్‌ డిజిటైజేషన్‌ ప్రభుత్వ ఆర్కైవ్స్‌ పరంగా కానీ, ప్రైవేటుపరంగా కానీ ఎక్కడా జరగనేలేదు. కేవలం టీవీల్లో ప్రసారం కోసం సిద్ధం చేసిన అరకొర డిజిటల్‌ మాస్టర్లు, కోతలు పోనూ యూ ట్యూబ్‌లో మిగిలిన సినిమానే ఇప్పుడు మిగిలిన మహాప్రసాదం. ఘనమైన మన సినీ చరిత్రపై మనకున్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. క్షమార్హం కాని కళా, సాంస్కృతిక నేరం.
- రెంటాల జయదేవ

Videos

TDP నేతల చేతిలో చంపబడ్డ మంద సాల్మన్ కొడుకుల సంచలన వ్యాఖ్యలు

దమ్ముంటే టచ్ చెయ్.. హౌస్ అరెస్ట్ పై అశోక్ బాబు వార్నింగ్

వైయస్సార్, ఎన్టీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు

నేను ఆ ఉద్దేశంతో అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రెహమాన్

అపాయింట్ మెంట్ కోరుతూ ఏపీ డీజీపీకి MLC లేళ్ల అప్పిరెడ్డి లేఖ

సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

హైవేపై ప్రమాదాలు..ఒకరు మృతి..

ట్రంప్ టారిఫ్.. షాక్ ఇచ్చిన యూరప్

మహిళ డ్యాన్సర్లతో మంత్రి వాసంశెట్టి డాన్స్.. బయటపడ్డ సంచలన వీడియో

లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ

Photos

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

మేడారం సందడి (ఫోటోలు)

+5

'యుఫోరియా' మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ బ్లాక్ బస్టర్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా, శర్వానంద్‌ (ఫోటోలు)

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)