Breaking News

ఎగతాళి చేసినవాళ్లే గౌరవిస్తున్నారు

Published on Fri, 09/27/2024 - 00:33

‘మనం సినిమా చూసేవాళ్లమే కానీ తీసేవాళ్లం కాదు’... భార్య వెంకట నర్సమ్మతో భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఒక్క సినిమా అయినా నిర్మించాలనే తల్లి ఆలోచనను కాదన్నాడు కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌. రెండేళ్లు ఇంటికి దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాడు కూడా. కొడుకు ఆచూకీ తెలుసుకుని ఇంటికి పిలిపించుకున్న నర్సమ్మ మళ్లీ సినిమా పాటే పాడారు. ఇక చేసేదేం లేక సినిమా నిర్మించాలని ఫిక్స్‌ అయిపోయారు.

 నర్సమ్మ వేలి ముద్ర మాత్రమే వేయగలరు. కానీ వెండితెరపై నిర్మాతగా ఓ ముద్రగా మిగిలిపోవాలని కూలి చేసి సంపాదించిన డబ్బు, రాగి సంగటి హోటలు పెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయం... ఇలా కష్టం చేసిన డబ్బుతో ‘స్పిరిట్‌’  (ఈజ్‌ నాట్‌ వన్‌) సినిమాని ఆరంభించారు. ఇక... మిగతా విశేషాలు నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, ఆమె భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు మాటల్లో తెలుసుకుందాం.

‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. పొలం పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో నేను, నా స్నేహితులు కలిసి సినిమాలు చూసే వాళ్లం. ‘బ్రహ్మంగారి చరిత్ర, పొట్టేలు పున్నమ్మ’ సినిమాలు నా మనసుని బాగా కదిలించాయి. సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మించాలనుకున్నాను. అందుకోసం పట్టుదలగా పదేళ్లు శ్రమించాను. 

ఆ కల ఇన్నేళ్లకు ‘స్పిరిట్‌’ (ఈజ్‌ నాట్‌ వన్‌) చిత్రంతో నెరవేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ అన్నారు. రవిబాబు, సత్యప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, చిట్టిబాబు, రమ్య, ప్రియ, పింకీ, జబర్దస్త్‌ నాగ్‌తేజ్, జూనియర్‌ రాజశేఖర్, సైదులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పిరిట్‌’ ఈజ్‌ నాట్‌ వన్‌). తన కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిత్‌ వండర్‌ సినిమా పతాకంపై చెన్నెబోయిన వెంకట నర్సమ్మ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

నా కల ఇన్నేళ్లకు నెరవేరింది 
ఈ సందర్భంగా నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామం. నేను చదువుకోలేదు కాబట్టి చదవడం, రాయడం రాదు. చెన్నెబోయిన వెంకటేశ్వరరావుతో నా పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆయనతో కలిసి సినిమాలు చూసేదాన్ని. మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న పొలంలో వ్యవసాయం చేసుకోవడంతో పాటు కూలి పనులకు వెళ్లేదాన్ని. బర్రెలు, మేకలు, పొట్టేళ్లు కూడా పెంచేవాళ్లం. ఓ చిన్నపాటి హోటల్‌ కూడా నడుపుతున్నాం. 

సినిమా నిర్మించాలనే నా ఆలోచనని ముందు నా భర్తకి చె΄్పాను. ఆ తర్వాత నా పెద్ద కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌కి చె΄్పాను. సినిమా నిర్మాణం అంటే మాటలా? కోట్ల రూపాయలు కావాలి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వద్దని వారించారు. ఆ తర్వాత నా పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి ఒప్పుకున్నారు. నా ఆలోచన నుంచి వచ్చిందే ‘స్పిరిట్‌’ సినిమా కథ. నా ఆలోచనలని వెంకట రవీంద్రనాథ్‌ చక్కగా తెరపై చూపించగలడనే నమ్మకంతో తననే డైరెక్షన్‌ చేయమన్నా. ఈ సినిమా కోసం మాకున్న పొలం, పశువులు, పొట్టేళ్లు, మేకలు, ఇల్లు అమ్మేశాం.

 సినిమా నిర్మాణం, పోస్ట్‌ ్రపొడక్షన్‌ పనులు, సెన్సార్‌ వంటి వాటికి ఇప్పటికే రూ. 90 లక్షలైంది. దాదాపు 40 లక్షలు దాకా అప్పులు చేశాం. సినిమా విడుదల చేసేందుకు పబ్లిసిటీ ఖర్చుల కోసం మరో రూ. 10 లక్షలు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... తెలంగాణాలోని దేవదాసీ వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. ఇప్పుడూ ఉత్సవాలు, జాతర్లు, ఎల్లమ్మ తిరునాళ్ల వంటి సమయాల్లో వారిని డ్యాన్స్‌ చేయటానికి తీసుకొస్తుంటారు. వారి కష్టాలను కళ్లారా చూశాం. 

మాతంగుల జీవితాలు ప్రస్తుతం దుర్భరంగా ఉన్నాయి. వారిపై జరిగే దురాచారాలు పోవాలి. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా చదువుకుని, ఉద్యోగాలు చేసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం. త్వరలో ఆడియో రిలీజ్‌ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే మా బంధువులు, తెలిసినవారు, ఊర్లోని వారు ‘మీరేంటి? సినిమా నిర్మించేదేంటి?’ అంటూ హేళనగా, చులకనగా మాట్లాడేవారు. అన్నింటినీ భరించి, ఈ సినిమా నిర్మించాం. దీంతో ఎగతాళిగా మాట్లాడినవారే అనుకున్నధి సాధించావంటూ ఆ΄్యాయంగా మాట్లాడుతున్నారు... గౌరవంగా చూస్తున్నారు. సినిమా నిర్మించాలనే నా కల నెరవేరింది. ఇకపై సినిమా నిర్మించను. ఇండస్ట్రీలోనే ఉండాలా? వద్దా అన్నది మా అబ్బాయి వెంకట రవీంద్రనాథ్‌ ఇష్టం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.  

ఆత్మస్థైర్యం కోల్పేలేదు  
– చెన్నెబోయిన వెంకటేశ్వరరావు  
సినిమా నిర్మించాలని ఉందని నా భర్య అన్నప్పుడు మొదట్లో నేను కూడా నవ్వుతూ, ఎగతాళి చేసేవాణ్ణి. అయితే తన పట్టుదల చూసి ఆ తర్వాత ఒప్పుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ సినిమా నిర్మించింది. ఈ సినిమా నిర్మాణం మాకో మధురానుభూతి. అలాగే ఓ విషాదం కూడా నింపింది. ఈ చిత్రంలో నటించిన మా రెండో అబ్బాయి పాముకాటుకు గురై మృతి చెందడం మమ్మల్ని కలిచివేసింది. మా అబ్బాయి నటించిన సన్నివేశాలు వచ్చినప్పుడు నా భార్య చూడదు... బాధపడాల్సి వస్తుందని. ఈ సినిమాలో నేనో పాత్ర చేశాను. ‘స్పిరిట్‌’ మాకు లాభాలు తీసుకురాకపోయినా పర్లేదు. కానీ, చేసిన అప్పులు తీర్చేలా డబ్బులు వస్తే చాలు. ఏది ఏమైనా సినిమా నిర్మించామన్న తృప్తి ఎప్పటికీ  ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)