థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
‘బైకర్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Published on Fri, 04/03/2026 - 08:18
టైటిల్ : బైకర్
నటీనటులు: శర్వానంద్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు
నిర్మాణ సంస్థ: యూవి క్రియేషన్స్
నిర్మాతలు:వంశీ-ప్రమోద్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: జె యువరాజ్
ఎడిటింగ్: అనిల్ కుమార్ పి
విడుదల తేది: ఏప్రిల్ 3, 2026

శర్వానంద్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘బైకర్’ తో వచ్చాడు. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శర్వా ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీలే ఆయన గురువు. ఎప్పుటికైనా ఇండియాలో కూడా మోటోక్రాస్ రేసింగ్‌కు గుర్తింపు తీసుకురావాలనే తండ్రి కల కోసం విక్కీ అహర్నిశలు కష్టపడతాడు. నెంబర్ వన్ బైక్ రేసర్‌గా నిలుస్తాడు. కొడుకు ఛాంపియన్‌గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లోకి దించాలనుకుంటాడు సునీల్. అందుకోసం ఐఎన్‌జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత(అతుల్ కులకర్ణి)ని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు.
తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనన్య(మాళవిక నాయర్) ఎవరు? ఆమె విక్కీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్‌కు దూరంగా ఉన్న విక్కీ.. మళ్లీ మోటోక్రాస్ రేసర్‌గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి సునీల్ మళ్లీ కోచింగ్ ఇచ్చాడా? లేదా? చివరకు తండ్రికొడుకులు కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
తెలుగు తెరపై స్పోర్ట్స్ డ్రామాలు కొత్త కాదు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, హాకీ.. ఇలా వివిధ క్రీడల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో ఇప్పటివరకు సినిమా రాలేదు. అదొక్కటే బైకర్ ప్రత్యేకత. కథా, కథనం రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా సినిమాల మాదిరే సాగుతుంది. ఛాంపియన్‌గా ఉండే హీరో ఉన్నపళంగా క్రీడను వదిలేసి సాధారణ జీవితం గడపడం.. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మళ్లీ ఆయన క్రీడల్లోకి రావడం.. క్లైమాక్స్‌లో విజేతగా నిలవడం..స్పోర్ట్స్ డ్రామా చిత్రాలన్నీ దాదాపు ఇలానే సాగుతాయి.
అయితే కథనం ఎలా సాగింది? ఎమోషన్ ఏమేరకు పండింది? అనేదానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. బైకర్‌లోనూ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. సంఘర్షణ ఉంది. కానీ, అది ప్రేక్షకుడిపై అంతగా ప్రభావం చూపించలేకపోయింది. విజువల్స్‌తో పాటు రేసింగ్ సన్నివేశాలు మాత్రం అదిరిపోతాయి. రేసింగ్ సీన్లను తెరపై చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి. రేసింగ్ వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా హీరో పరిచయ సన్నివేశాలు ఉంటాయి. భార్య, కొడుకుతో హాయిగా గడుపుతున్న సమయంలో తండ్రి గురించి ఓ వార్త వినడం.. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలయిన తర్వాత నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.
హీరో, హీరోయిన్ల లవ్‌స్టోరీ ఒకవైపు.. రేసింగ్ సీన్లు మరో వైపు.. ఫస్టాఫ్ అంతా ఇలా సాగుతుంది. ప్రతీది డీటైలింగ్‌గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెంకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం చాలా వరకు ఎమోషనల్‌గా సాగుతుంది. తండ్రి కోసం మళ్లీ రేసర్‌గా మారడం.. ప్రాక్టీస్ సమయంలో హీరో పడే ఇబ్బందులు.. విలన్ చేసే కుట్రలను ఛేదించి.. చివరకు విజేతగా నిలవడం.. ఇలా ఊహకందేలా కథనం సాగుతుంది. ముందుగా చెప్పినట్లు భావోద్వేగాలను మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు రేసింగ్ సీన్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. అవి ఆకట్టుకున్నాయి కూడా! అదే స్థాయిలో భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం శర్వా నటన అని చెప్పొచ్చు. తెరపై చూస్తుంటే అచ్చమైన స్పోర్ట్స్ మెన్‌లానే ఆయన లుక్ ఉంది. అటు యాక్షన్, ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పడిన కష్టమంతా తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. హీరో తండ్రి, కోచ్ బుల్లెట్ సునీల్‌గా రాజశేఖర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయనకు పెద్దగా డైలాగులు లేకున్నా.. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘జెర్సీ’ సినిమాను గుర్తు చేస్తాయి. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పాటలు కూడా సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. రేసింగ్ సీన్లను తెరపై అద్భుతంగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Tags : 1