Breaking News

శని వలయాలు ‘కనిపించుట’ లేదు!

Published on Tue, 11/25/2025 - 06:30

శని. అందమైన వలయాలతో సౌరకుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కన్పించే గ్రహం. అది కాస్తా తాజాగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. అంటే మరేమీ లేదు. శని గ్రహం చుట్టూ అందంగా చుట్టుకుని కన్పించే వలయాలు దాదాపుగా ‘మటుమాయం’అయిపోతున్నాయి! ఆదివారం రాత్రి వినువీధిలోకి విహంగవీక్షణం చేసిన ఔత్సాహికులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కొట్టొచ్చినట్టుగా కన్పించి ఆశ్చర్యపరిచింది. 

అయితే అంతమాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో ‘శని’దాపురించిందని మనమెవరమూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదట! ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటూ మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ‘‘అది కేవలం మన దృక్‌ భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుంచి కన్పించడం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్నాచితకా టెలిస్కోపుల సాయంతో వాటిని చూడటం కనాకష్టం’’అని వారు వివరించారు.  

‘రింగ్‌’క్రాసింగ్‌!  
ప్రస్తుతం భూమి నుంచి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కన్పించేందుకు రింగ్‌ ప్లేన్‌ క్రాసింగ్‌గా పేర్కొనే అరుదైన దృగ్విషయమే కారణమట. ఈ సమయంలో భూ­మి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తుందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ వలయాలు పైనుంచో, కిందినుంచో కాకుండా సరిగ్గా ఒక పక్కనుంచి మాత్రమే కన్పిస్తాయి. దాంతో అవక్కడ లేవనే అనిపిస్తుంది. 

అదీ సంగతి! 
ఎంత రింగ్‌ క్రాసింగ్‌ ప్రభావమైనా సరే, అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్ట చుట్టుకుని ఉండే అందాల వలయాలు కన్పించకుండా పోవడం ఏమిటని అనిపించడం సహజమే. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే! పైగా ఈ దశలో వాటినుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. వెరసి సుదూరంలో ఉన్న మన భూ గ్రహం నుంచి వాటిని సమాంతరంగా, అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపుగా కన్పించవు. దాంతో అవసలు లేవనే అన్పిస్తుంది’’అని వివరించారు.  

సమాన వంపు కోణం! 
శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కన్పించకుండా పోతాయి. అసలున్నాయా, లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్‌ప్లేన్‌ క్రాసింగ్‌ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కన్పించకుండాపోయింది. తాజాగా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగడంతో అందరికీ కనువిందు చేసిందన్నమాట. మరో ఐదేళ్లకల్లా, అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్లీ పూర్తిస్థాయిలో కనువిందు చేయనున్నాయి.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)