Breaking News

గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు..  తిండీ లేదు

Published on Thu, 04/03/2025 - 06:42

రంజాన్‌ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్‌ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. 

ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్‌ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!

ఈద్‌. పవిత్ర రంజాన్‌ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్‌ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్‌ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్‌ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది.

 దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్‌ అబ్దెల్‌ నాసర్‌ అల్‌–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్‌ రఫా క్రాసింగ్‌ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. 

అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... 
పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్‌ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్‌ అల్‌–బలాహ్‌లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. 

కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్‌ కుర్ద్‌ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్‌లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. 

చుక్కల్లో పిండి ధరలు... 
రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్‌ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్‌ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్‌ వంటి బేకింగ్‌ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్‌ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్‌ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్‌కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. 

వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ అహ్మద్‌ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. 

దారుణ సంక్షోభం: ఐరాస 
‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్‌ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్‌ఆర్డబ్ల్యూఏ) కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారి హెచ్చరించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)