అగ్రస్థానం నుండి అప్రస్తుతానికి?

Published on Sat, 07/04/2026 - 02:59

అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని 250 సంవత్సరాలు పూర్తవబోతున్నది. 1776 జూలై 4న 13 కాలనీలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో యూఎస్‌ఏ దేశానికి పునాదిపడింది. క్రమంగా స్పానిష్, మెక్సికన్‌లతో యుద్ధాలు, కొనుగోళ్లతో అది విస్తరించింది. 1941లో జపాన్‌ పెరల్‌ హార్బర్‌పై దాడితో రెండవ ప్రపంచ యుద్ధంలో క్రియాశీలకమైంది. 1945లో ప్రపంచ జీడీపీలో 50 శాతం వాటాతో బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 1969లో చంద్రుడిపై కాలుమోపి, 1970 దశకంలో అర్పా నెట్, తదుపరి ఇంటర్నెట్‌ ద్వారా 1980లలో సిలికాన్‌ వ్యాలీ గుండా ఐటీ రంగాన్ని శాసించింది. 1991లో సోవియట్‌ విచ్ఛిన్నంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.

అగ్ర లక్షణాలు
ఒక దేశం అగ్రరాజ్యంగా లేదా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే నాలుగు అంశాలు కీలకం. 1. మాతృదేశం నుండి సుదూర ప్రాంతా లలో శత్రువులను నిలువరించగలగాలి. 2. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, రవాణా మార్గాలను నియంత్రించగలగాలి. 3. ప్రపంచ స్థాయి వ్యవస్థలను సృష్టించి, ఆదర్శప్రాయమైన చట్టాలు, నిబంధన లను ఏర్పరచాలి. 4. ఆ దేశపు విలువలు, సంప్రదాయాలు, భాష లను ప్రపంచం అనుసరించాలి.

ప్రపంచవ్యాప్తంగా 750కి పైగా సైనిక స్థావరాలతో యూఎస్‌ఏ ఏ ప్రాంతంలోని శత్రువునైనా నిలువరించగలుగు తుంది. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌వంటి సంస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది.హాలీవుడ్, పాప్‌/జాజ్‌ సంగీతం, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా ప్రపంచ సంస్కృతులను ప్రభావితం చేస్తున్నది. సాలీనా 700 బిలి యన్‌ డాలర్ల ప్రైవేట్‌ ఆర్‌ అండ్‌ డీ వ్యయం, 500 బిలియన్‌ డాలర్ల దాతృత్వ విరాళాల ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది.

తిరోగమన రాజ్యం
2000 సంవత్సరంకల్లా యూఎస్‌ఏ తిరుగులేని ఏకైక అగ్ర రాజ్యంగా అభివృద్ధి చెందిందనటంలో సందేహం లేదు. కానీ 2025 కల్లా ఇంటా, బయటా అనేక  సవాళ్లను ఎదుర్కొంటున్నది. ‘అమె రికా నాయకత్వపు ప్రపంచం నుండి క్రమంగా అమెరికాతో కూడిన ప్రపంచ రాజకీయ వ్యవస్థ’ దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా జియో పొలిటికల్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరి కాను ఒక తిరోగమన అగ్రరాజ్యంగా అభివర్ణిస్తున్నారు. చరిత్ర కారుడు ఆర్థర్‌ షెల్లింగర్‌ అభిప్రాయపడినట్లు ‘అమెరికా ఒక ప్రయోగం మాత్రమే, తయారీ పూర్తయిన ఉత్పత్తి కాదు’.

అమెరికన్‌ ప్రభుత్వం క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటు న్నది. ప్రభుత్వ అప్పు జీడీపీ కంటే 120 శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 200 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీలో యూఎస్‌ వాటా 71 నుండి 59 శాతానికి పడిపోయింది. లావాదేవీలకు అమెరికన్‌ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా చైనీస్‌ యువాన్‌ కుదురుకుంటున్నది. బ్రిక్స్‌ దేశాలు డాలర్‌ ఆధిపత్యానికే సవాలు విసురుతున్నాయి. చైనా, రష్యా, ఈయూ,ఇండియా ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులుగా బలపడుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫ్యూజన్‌ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అంత రిక్ష పరిశోధనలలో చైనా గట్టి పోటీనిస్తున్నది. మాదకద్రవ్యాలు, గన్‌కల్చర్‌ అమెరికన్‌ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

కుప్పకూలకపోయినా...
యూకే (ఇంగ్లండ్‌) తన రవి అస్తమించని సామ్రాజ్యంతో ప్రపంచాన్ని సుమారు వంద సంవత్సరాలు (1850–1950) పాలించిందనే చెప్పాలి. ప్రపంచ జీడీపీలో అప్పటి బ్రిటన్‌ వాటా 25శాతం. అప్రతిహతమయిన నౌకాబలం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వలసలు, సముద్ర మార్గాల మీద ఆధిపత్యంతో బ్రిటన్‌ ప్రపంచాన్ని శాసించింది. బ్రిటన్‌తో పోలిస్తే అమెరికన్‌ ఆధిపత్యం భిన్నంగా ఉంటుంది. అమెరికా ఇతర దేశాలను ఆక్రమించి వలసలు స్థాపించలేదు. ఆధునిక నౌకా, వైమానిక సైనిక బలాలతో పాటుగా, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం, వరల్డ్‌ బ్యాంకు, ఐఎంఎఫ్‌లపై గుత్తాధిపత్యం, డాలర్‌ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఉడుంపట్టు పట్టి, నాటో మిత్రదేశాల సహకారం దన్నుగా యూఎస్‌ఏ అగ్ర రాజ్యంగా ఏర్పడింది. 

యూఎస్‌ఏ, యూకే రెండూ మాతృ దేశాన్ని సురక్షితంగా ఉంచుకొని, శత్రువులను కొల్లగొట్టడమనే ప్రాథమిక సూత్రాన్ని అమలుపరచాయి. రెండువైపులా శత్రుదుర్భేద్యంగా విశా లమైన అట్లాంటిక్, పసిఫిక్‌ మహాసముద్రాలు ఉండటం, అపార మైన సహజవనరులు యూఎస్‌ఏకు భౌగోళికంగా కలిసి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యూకే బలహీనపడటం యూఎస్‌ఏకు అనుకోని వరంగా పరిణమించింది.

యుద్ధాలు, ఆక్రమణల వలన సామ్రాజ్యాలు కూలిపోవు. సామ్రాజ్యాలు అంతర్గతంగా బలహీనపడి విచ్ఛిన్నమవుతాయని చరిత్ర చెబుతున్నది. 1950 కల్లా బ్రిటిష్‌ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. వలస సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చు 1950లో యూకే జీడీపీలో 10 శాతం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడి వలస పాలన ఖర్చులను భరించే స్థితిలో లేక వలస ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ప్రకటించింది. 1991 కల్లా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మవటంతో సోవియట్‌ యూనియన్‌ కూలి పోయింది. 1945లో యూకే, 1991లో సోవియట్‌ మాదిరిగా యూఎస్‌ఏ ఇప్పుడు అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం లేదు. కానీ క్రమంగా బలహీన పడి అగ్రరాజ్య స్థాయిని కోల్పోయే సూచనలు పుష్కలం.

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవ వనరులను యూఎస్‌ఏ ఆకర్షించింది. 1820–1860 కాలంలో వలస వచ్చిన ఐరిష్, జర్మన్లు మధ్య యూఎస్‌ఏ వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. 1880–1924 మధ్యకాలంలో వచ్చిన యూదులు, ఇటాలి యన్లు తూర్పు, ఈశాన్య యూఎస్‌ఏలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యులు. 1925–1965 మధ్యకాలంలో జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపాల నుండి శరణార్థులుగా వచ్చిన శాస్త్రవేత్తలు యూఎస్‌ఏ అణ్వస్త్ర పరిజ్ఞానానికి, కంప్యూటర్‌ విప్లవానికి దోహదపడ్డారు. వీరిని యూఎస్‌ఏ ఆహ్వానించకపోతే సోవియట్‌ ఏకైక అణ్వస్త్ర దేశంగా ఏర్పడేది. 1965–2000 మధ్యకాలంలో భారత్, తైవాన్‌ల నుండి వచ్చిన టెక్‌ నిపుణులు సిలికాన్‌ వ్యాలీ విజయానికి కారణం. వీరు లేకపోతే జపాన్‌ ప్రపంచ సెమీకండక్టర్, ఐటీ శక్తిగా ఆవిర్భవించేది. 

ఇటీవలి  వలసదారుల వ్యతిరేక ఉద్యమం కేవలం అమెరికన్‌ ఐడెంటిటీ రాజకీయాలలో భాగమే. జపాన్‌ నిపుణులైన వలసదారు లను ప్రోత్సహించక పోవటంతో ధనిక దేశమైనా ప్రపంచ రాజకీ యాలలో ప్రాధాన్యత సాధించలేక పోయింది. సోవియట్‌ వలస లను నిషేధించి కూలిపోయింది. యూఎస్‌ఏ ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను నిర్వహించటానికి సాలీనా కనీసం 2 మిలియన్ల వలస నిపుణులను ఆహ్వానించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నైపుణ్య కార్మి కులను యూరోపియన్‌ యూనియన్, చైనా ఎగరేసుకుపోతాయి. 

రాబోయే అర్ధ శతాబ్దంలో ప్రపంచ అగ్రరాజ్యం ఎవరనేది
ముందుతరం సాంకేతిక పరిజ్ఞానాలను ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటా రనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2076 ప్రపంచాధిపత్యం రేసులో కూటములు, పొత్తులు కీలకం. ఈ రెండు అంశాలలో యూఎస్‌ఏకు దుశ్శకునాలు కన్పడుతున్నాయి. కెనడా, యూరోపియన్‌ యూనియన్, యూకేలతో మొదలుపెట్టి, భారత్‌ వరకు అందరు మిత్రులను దూరం చేసుకోవటం యూఎస్‌ఏకు దురదృష్టకరం. 2050 కల్లా ప్రపంచ జీడీపీలో వాటా 15 శాతానికి పడి పోయి, ప్రభుత్వ రుణం జీడీపీలో 200 శాతానికి చేరి వలసలు పూర్తిగా ఆపివేస్తే యూఎస్‌ఏ అగ్రరాజ్య స్థానం కోల్పోతుంది. ధనిక దేశంగా కొనసాగినా, 2075కల్లా ప్రస్తుత జపాన్, యూకేల వలే అప్రస్తుతపు, అసందర్భపు, అప్రాముఖ్యతపు శక్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.

-వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌); సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)