Breaking News

చిత్రసీమలో వీరిద్దరూ ఇద్దరే!

Published on Mon, 06/23/2025 - 00:44

శ్రీశ్రీ అభ్యుదయ కవిగానూ, ఆత్రేయ ప్రముఖ వచన నాటక కర్తగానూ లబ్ధప్రతిష్ఠులయిన తర్వాతనే సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో ‘ఆహుతి’ (మూలం: నీరా ఔర్‌ నందా) అనే డబ్బింగ్‌ సినిమాతో శ్రీశ్రీ, 1951లో ‘దీక్ష’ చిత్రంతో ఆత్రేయ ‘సింగిల్‌ కార్డ్స్‌’తో చిత్రసీమలో ప్రవేశించారు.

శ్రీశ్రీ అభ్యుదయ భావజాలానికి, ఆత్రేయ మనసు పాటలకు ప్రసిద్ధులు కావడం వలన ‘తోడికోడళ్లు’ చిత్రంలో ఆత్రేయ రాసిన ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చాన...’ అనే పాట శ్రీశ్రీ రచనగానూ, ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రానికి శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము’ అనే పాటను ఆత్రేయదిగానూ భ్రమించి చాలామంది పందేల వరకు వెళ్లారు. శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’ అనే తన సినిమా పాటల సంకలనంలోనూ ఈ భ్రమను ప్రస్తావించారు.

‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా...’ అనే పాట మొదటిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ బహుమతి గౌరవాన్ని దక్కించింది. అంతటి ప్రతిష్ఠాత్మకమైన పాటలో ‘ప్రతి మనిషి తొడలుగొట్టి... సింహాలై గర్జించాలి’ అనేచోట వ్యాకరణ దోషాన్ని తనే గ్రహించి శ్రీశ్రీ బహువచనాన్ని ఏక వచనంగా మార్చి ‘సింహంలా గర్జించాలి’ అని దిద్దుకున్నారు. 

ఆత్రేయ కూడా ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’(1960) చిత్రంలో ‘ఎవరో?... అతనెవరో?’ అనే పాటలో ‘కరుణజూపి కబురు తెలిపి రమ్మనవా’ అనే పంక్తిలో ‘కబురు’ అనే ఉర్దూ పదాన్ని ప్రయోగించినందుకు కలత చెంది, గురుతుల్యులు మల్లాది రామకృష్ణ శాస్త్రి ‘ఫరవాలేదు, అప్పుడు బీబీ నాంచారి ఉందిగా!’ అని సమర్థించే వరకు ఊరట చెందలేదు. ఈ రెండు సంఘటనలు సినీ గేయ రచనలో కూడా శ్రీశ్రీ– ఆత్రేయల నిర్దుష్టతను, నిబద్ధతను తెలియజేస్తాయి.

పద్మనాభం నిర్మించిన ‘దేవత’ చిత్రంలో ‘బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక’ అని పాట పల్లవిని వీటూరి రాశారు. దానిని నిర్మాత కోరిక మీద వీటూరి... శ్రీశ్రీకిస్తే ఆయన ఆ పాటను పూర్తి చేశారు. శ్రీశ్రీ ఈ విషయమై వీటూరికి స్వయంగా కృతజ్ఞతలు చెప్పడమేగాక, ‘పాడవోయి భారతీయుడా’ పుస్తకంలో కూడా వెల్లడించారు. 

‘గోరింటాకు’ చిత్రంలో ‘కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి...’ అనే పాట పల్లవి వరకు మాత్రం వేటూరి రాయగా, చరణాలన్నింటినీ రాసిన ఆత్రేయ ‘క్రెడిట్స్‌’లో వేటూరి పేరును వెయ్యడానికి అంగీకరించడం ఇటువంటి ఉదాహరణమే!

సినీ గేయ కవులు పాటలు రాయడానికే ప్రాధాన్యమిస్తారు. కానీ పద్య ప్రేమికులైన శ్రీశ్రీ, ఆత్రేయ సందర్భం దొరికితే సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించి ఆ ప్రక్రియ పట్ల తమ మక్కువను చాటుకున్నారు. శ్రీశ్రీ ‘కులగోత్రాలు’ ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లో పద్యాలు రాయగా; ఆత్రేయ ‘మనసే మందిరం’, ‘ప్రేమ్‌ నగర్‌’, ‘అమర దీపం’, ‘కల్యాణ మంటపం’ ఇత్యాది చిత్రాల్లో పద్యాలను రాశారు.

ఆత్రేయ తన సొంత చిత్రం ‘వాగ్దానం’లో శ్రీశ్రీ పట్ల గౌరవంతో రెండు పాటలను రాయించారు. వాటిలో ‘సీతా స్వయంవరం’ హరికథ ఒకటి. ఈ హరికథలో వినాయక స్తోత్రం, పోతన భాగవత పద్యంతో పాటు కరుణశ్రీ ‘ఫెళ్లుమనె విల్లు...’ అనే పద్యం కూడా తనవి కావనీ, ‘కరుణశ్రీ’ పద్యాన్ని ఉపయోగించినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పుతున్నాననీ శ్రీశ్రీ ‘పాడవోయి భారతీయుడా’లో వెల్లడించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఆత్రేయ ‘వాగ్దానం’ చిత్రం తీసి చేతులు కాల్చుకున్నట్టే, శ్రీశ్రీ ‘చెవిలో రహస్యం’ అనే డబ్బింగ్‌ చిత్రం తీసి దారుణంగా నష్టపోయారు.

శ్రీశ్రీ, ఆత్రేయ – ఇద్దరూ వామపక్ష భావజాలం గల కవులు. శ్రీశ్రీ భార్య కోరిక మేరకు సత్యనారాయణ వ్రతం చేస్తే విమర్శకులు ఆయనను దుయ్యబట్టారు. ‘వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి సొంతం’ అని శ్రీశ్రీ తన చర్యను సమర్థించుకున్నారు. అలాగే మధ్యంతర ఎన్నికలలో తన నాటకాలతో కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రచారం చేసిన ఆత్రేయ ‘శ్రీ షిర్డీ సాయిబాబా మాహాత్మ్యం’ చిత్రానికి ఆణిముత్యాల్లాంటి పాటలను రాసి, అజ్ఞాని అయిన తన చేత ఆ బాబాయే ఆ పాటలను రాయించుకున్నారేమోనని ఆత్మీయుల దగ్గర సందేహాన్ని వ్యక్తం చేసేవారట!

శ్రీశ్రీ – ఆత్రేయల మధ్య భావసారూప్యం వారి జన్మాంతర అనుబంధమేమో అనిపిస్తుంది. శ్రీశ్రీని ఆత్రేయ గురుతుల్యునిగానే భావించేవారు. ఒక పరిశోధకుడు శ్రీశ్రీ గురించి వ్యాఖ్యానిస్తూ, ఆయన ‘వయసొచ్చిన పసివాడు’ అన్నారు. ఆ వ్యాఖ్య ఆత్రేయకు కూడా అన్వయిస్తుంది. జనసామాన్యానికి తెలియని గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన ఈ కవి ద్వయం తెలుగు సినీ రంగంలో రెండు మహోన్నత శిఖరాలు!

డా‘‘ పైడిపాల 
వ్యాసకర్త సినీ గేయ సాహిత్య 
పరిశోధకులు ‘ 99891 06162

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)